నవల అంటే

*** ” నావ”ల ..నవల ***

మనకు తెలిసిన నవల 14 వ శతాబ్దపు ఇటలీ దేశ “నావెల్లా “లో మూలాలు ఉన్నట్లుగా సాహితీచరిత్రకారులు చెపుతున్నటికీ , భక్తిన్ మరింత వెనక్కి వెళ్ళి నవల మూలాలు జానపదం లో ప్రారంభమై వ్యవసాయ సమాజాలలో స్పష్టపడ్డాయని భావించారు.

వ్యవసాయం తో కుదుట పడ్డ మానవ సమాజం నవలకు ఒక నేపధ్యమై ,14 వ శతాబ్దం నాటికి అక్షరబద్దం అయ్యింది.

Boccassio రచించిన Decameron (c.1349-51,Italy) ఆనాటి యురోపు సాహితీకారులపై ప్రభావాన్ని చూపింది. కాల్పనిక యుగం చివరి వరకు ఈ ప్రభావం కొనసాగింది. శృంగార వీర గాథలతో ఊహాలోకాల్లోకి విహరిస్తున్న నవలను వ్యంగ్యాస్త్రాలు వేస్తూ నేలకు దింపింది “Cervates” రచించిన “Don Quixito”.(1605,1615,spain)

యూరోపియన్ కల్పనా సాహిత్యంపై చూపిన ప్రభావం మన “బారిష్టర్ పార్వతీశం” దాకా కొనసాగింది.

సరిగ్గా అప్పుడే ప్రారంభమైన పౌర గ్రంథాలయాలు , పెరుగుతోన్న అక్షరాస్యత , స్త్రీ విద్యలతో … నవల సామాన్యుల సాహిత్యం గా అందివచ్చింది. నవలలోని సరళ భాష ,స్పష్టమైన భావన, సామాన్య పాత్రలు …వారిని నవలకు దగ్గర చేసాయి.

“Robinson Crusoe”(Daniel Defoe,1719) నవలతో యూరోపియన్ నవల ఒక కొత్త కల్పనామయ జగత్తును .. నావికాయాన సాహాసాలను పరిచయం చేసింది.అన్ని యూరోపియన్ భాషలలోకి అనువదించబడిన ఈ నవల ప్రభావం అంతా ఇంతా కాదు .Robinsonade గా పిలవబడే ..ఏకాంతద్వీప సాహిత్యం గా పేర్కొనే.. ఈ తరహ నవలలు అనేకం యూరోపియన్ ప్రజల అన్వేషణాభిలాషను మరింత దోహదం చేశాయని .. భ్రమణకాంక్ష ను బలోపేతం చేశాయనీ .. ఒక ఆలోచన.

ఆ విధం గా పరోక్షం గా సామ్రాజ్యవిస్తరణకు నవల దోహదకారి అయ్యింది. నావలతో పాటే నవల కొత్త ప్రదేశాలకు చేరుకొంది. కొత్త ప్రాంతాలు ,భాషలు , సంస్కృతులను నవల సమీకృతం చేసుకొంటూ ..సామ్రాజ్యాలతో పాటు విస్తరిస్తూ పోయింది. విశ్వవ్యాప్తమైంది.

నవల అనే పదార్థ లక్షణాలు ధర్మాలు అంటూ ప్రత్యేకం గా ఏమీ ఉండవు.

గుణకర్మ విశేషాల విశ్లేషణా సామాగ్రి అంతకు మించి ఉండదు. అయినప్పటికీ, నవల అనే పద అర్ధం అన్వేషిస్తూనే ఉన్నాము.

నవల అంటే ఏమిటో మనకు తెలుసు.

ఏమిటో చెప్పమంటే గాని మనకు నవల గురించి ఎంతో తెలియదు అన్నది అర్ధమవుతుంది.

అందుకనే…. “సమకాలీన బ్రిటిష్ నవలను ” గురించి . ఆల్లన్ మాస్సీ అంటారు

“ప్రచురింపబడిన సృజనాత్మక సాహిత్యం అంతా నవల అని అనడం భావ్యం కాదు .. ఎందుచేతనంటే ఒక చోట నవల పేరుతో ప్రచురించ బడిన రచన మరొక చోట మరొక భాషలోకి అనువదిస్తే ఆత్మ కథగానో జ్ఞాపకాలుగానో ప్రయాణ రచనగానో మరొక సాహితీ రూపంగానో రచనాప్రక్రియ గానో..గుర్తించబడవచ్చును. కనుక ..ప్రచురణ కర్తలు నవల గా ప్రకటించిన దానినే మేము నవల గా భావిస్తూ విశ్లేషణకు స్వీకరిస్తున్నాము.”అని.

The Last Brahmin ఒక సాహిత్య ..తాత్విక ప్రక్రియ ..ముఖ్యం గా ఒక మేధా “స్వీయ “చరిత.”అంటూ పరిచయం చేస్తారు డి వెంకట రావు గారు.”ఉద్యమ రచనలు”గా పేర్కుంటూ నవలలను ప్రకటించదం మనకు పరిపాటి.

మరి మన సమకాలీన తెలుగు నవలలలో ఏవి నవలలు అన్న ప్రశ్నను పాఠకుల వివేచనకు వదిలి వేస్తూ ముందుకు సాగుదాం.

“నవల అన్నది ఒక భావన (idea) ఒక abstaction.” అంటూ ఆల్లన్ మాస్సీ , ఇలా అభిప్రాయ పడతారు

“నవల ఒక అన్వేషణా మాధ్యమము…పదాలను అర్ధం చేసుకొనేందుకు మార్గాలు వెతుకుతూ రచయితా పాఠకుడు కలిసికట్టుగా.. చేసే ఒక ప్రయాణం.”

“నవల అంటే శృంగార కావ్యము ,వేడుక పుస్తకము ,కథ “ అంటుంది భ్రౌన్ గారి నిఘంటువు

శృంగార కావ్యము కాని ఈ నూతన ప్రక్రియ ఏమిటో వివరించిన వారు Congreve (Incongita:or,Love and Duty Reconciled ,1713) శృంగార కావ్యము లోని అతిశయోక్తి లేక పోవడము… వీరులతో రాజులతో సాహసాకార్యాలతో ప్రణయ గాథలతో ఏకోరచనగా సాగక పోవడం…సామాన్యులకు దగ్గరగా వచ్చిఅనామకులను అర్భకులను అభాగ్యుల ను నవలలోకి స్వీకరించడము .. సరళం గానూ నవరస భరితం గానూ ఉండడము నవలా లక్షణము.

‘నవీన ప్రబంధము‘ అని నరహరి గోపాలకృష్ణమ్మ గారు అంటే.. ‘వచన ప్రబంధము‘ అన్నారు కందుకూరి.

‘నవ్యమైనదీ లాలిత్యమైనదీ నవల “ ..అని తెలుగు నవలకు పేరు పెట్టారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు.

‘ప్రాచీన మానవుడు ఉబుసుపోకకై నేర్పుడై చెప్పిన కథ కు పరిణిత రూపము. నవల. శబ్ద ప్రాధానyaత లేని ప్రబంధము; ప్రదర్శనము లేని నాటకము.‘ అంటారు ఫింగళి లక్ష్మీ కాంతం గారు.

“.నవల అంటే.. ఆఖ్యాయని “ అని అంటూనే “నవలంటే కథ కాదు “ అంటారు జి వి కృష్ణారావు గారు.

“చిన్నదైతే కథ పెద్దదైతే నవల అని నేను భావించను. “ అన్నారు వడ్డెర చండీ దాస్.

“నవల సజీవమైన ప్రక్రియ. ఇందులోని ప్రతి అంశం లోనూ ఇతర అంశాలు ఉన్నాయి..”.అంటారు హెన్రీ జేమ్స్

Novel is a genre of becoming . సచేతనం గా కొనసాగుతూ నిరంతరం విస్తరిస్తూ , అసంపూర్ణము సశేషమూ అయిన ఏకైక సాహితీ ప్రక్రియ నవల. అని అంటారు మిఖైల్ భక్తిన్ .

అన్ని నిర్వచనాలకు సరిపోతున్నట్లుగా కనబడుతూనే, ఒక్క నిర్వచనానికి సరితూగని సృజనాత్మక సాహిత్యమే నవల అంటారు భక్తిన్.

అందుకే ప్రతి నవల తో పాటూ నవల ను నిర్వచించేందుకు నవలాకారులు చేసే ప్రయత్నాలన్నీ.. ఒక విషయాన్ని స్పష్టంగ తెలియజేస్తాయిఅది నవల కున్న బహు ముఖీయత.

ప్రతి ఒక నిర్వచనమూ నవల కున్న మరొక పార్శ్వాన్ని ఆవిష్కరిస్తూ పోతుంది. ఇదొక నిరంతర భావచేతనా ప్రక్రియ.

స్పానిష్ ఫిలాసఫర్ Jose Otega Y Gasst అన్నట్లుగా …మానవ జీవితము దాని అత్యంత మానవీయ కోణంలొ ఒక సృజనాత్మకక్రియ కాదా ? మనవుడు తన జీవితాన్ని స్వయాన రచించుకొనే ఒక నవలాకారుడు లాంటి వాడు కాడా?

జీవితం లోని వైవిధ్యమే నవలాస్వరూపం .ఆద్యంతాలు లేని సజీవ చేతనా స్రవంతే నవలాస్వభావం.

నవల రచన పఠనం వేటికవే అనిర్వచనీయమైన సృజనాత్మక అనుభవాలు. నవల నిత్య చైతన్య స్వరూపిణి .

నవల అంటే జీవితం . జీవితం అంటేనే ఒక trial and error

సాఫల్యమో వైఫల్యమో …నిరంతర ప్రయత్నం …మన నిత్య జీవన వ్యవహారం.

“ఆ మానవుని హృదయాన్ని వ్యక్తం చేయడానికే నేను ఇన్ని వందల పేజీలుగా ఈ ప్రయత్నం చేశాను” ..అంటారు తెన్నేటి సూరి గారు తమ “ఛెంగిజ్ ఖాన్ “నవల గురించి.

లక్ష్యము సాఫల్యమో వైఫల్యమో అన్నది కాదు .ఆ లక్ష్య సాధన కు చేసిన ప్రయత్నం ప్రధానం అంటారు .

అలాంటి నిరంతర భావవ్యక్తీకరణ ప్రయత్నాలే “నవల”.

నవల అంటే…???

నవలే…!!!

***

ప్రకటనలు

6 thoughts on “నవల అంటే

 1. రాజు గారు, ధన్యవాదాలు.
  నా కొద్దిపాటి నవలాప్రయత్నాలు మీ దృష్టికి వచ్చినందుకు.మీకు నచ్చినందుకు.
  ప్రస్తుతం నవలాకథనం పై అధ్యయనం చేస్తున్నాను. ఒక పాఠకురాలిగా. ఒక విద్యార్థిగా .నేర్వ వలసిన విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో.
  మీరన్నట్లుగా,రాయవలసినవి మరిన్ని!
  తప్పక నా ప్రయత్నాలను కొనసాగిస్తాను.
  మీ ప్రోత్సాహానికి మరొక మారు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. @ Raju
  ఇక,నా నవలా ప్రయత్నాల గురించి.. బహుశా రచయితగా అనుభవాలన్నీ అవ్యక్తాలేమో.ఎప్పుడైనా రాయడానికి ప్రయత్నిస్తాను. మీ సూచనకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. ' మీ రేగడి విత్తులు' నవల చాలా బాగుంది చంద్రలత గారు. ముఖ్యంగా అందులో ఉన్న తెలుగు నుడికారం – అంటె నెల్లూరు ఒంగోలు ప్రాంతాల – భాషను అద్బుతంగా పట్టుకున్నారు. మాకు బాగా పరిచయమున్న భాష.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s