ఆకటి వేళల

ఆకలయ్యే వేళకి అక్కడ ఆగామా ,  భీమాలోనే ఆగడం.
ఉదయం ఫలహార వేళయితే ,వేడి వేడి ఊతప్పమో ,ఇడ్లీవడో.
ఇక, మధ్యాహ్నం అయితే నవకాయ కూరలూ అప్పడం,ఊర మిరపకాయతో వడ్డించిన నిండు కంచంతో పాటు.. చల్లటి పెరుగు లో ముంచి తెచ్చిన తైరువడ ..అక్కడడక్కడా పలుకు పలుకు మంటూ ..బూందీ పూసలు.సాయంకాలం అనుకోండి ,మద్రసు చిట్టి ఇడ్లీ ,వేడి సాంబారు,చిటెకెడు నెయ్యి.చిన్న చిన్న ఇడ్లీలు సాంబారులో మునింగి తేలుతుంటే ..కమ్మని నెయ్యి వాసన కమ్మేస్తుంటే..ఇంటికి చేరినా అనుభూతి వదిలితేగా!
ఇక, అడిగింది ఆలస్యం వడ్డన జరగదు కనుక,ఈలోగా కాస్తా తలెత్తి ..అటూ ఇటు పరకాయించి చూశారు..ఇక పండగే మరి.
మాట వరస కన్నానుకోకండి.
నిత్య కల్యాణం మాటేమో కానీ, భీమాలోనూ అలాంటి అనేకానేక  భోజన ఫలహారశాలలోనూ ,ఎప్పుడు ఇంతే .పెళ్ళో పేరంటమో అక్కడే జరుగుతున్నట్లు.
పండగో పబ్బమో అప్పుడే వచ్చినట్లు.
కళకళాడుతూ .
మనుషులు.
కొత్తకోడళ్ళు.పసిబిడ్డలు.
తాజా గుళ్ళు .తడి ఆరని చందనం లేపనాలు.
పిల్లల గారాలు.తల్లుల మారాం.తండ్రుల తడబాట్లు.
స్నేహితుల పరాచికాలు.బందువుల రుసరుసలు. మధ్యవర్తుల సవరింపులు.
అత్తగార్లకు మర్యాదలు. అల్లుళ్ళకు అరణాలు.
దర్షనాల బేరాలు.రైళ్ళ రాకపోకల కబుర్లు.
అనేక భాసలు కలగలిసి దోసెల కరకరల మీదుగా దొర్లి పోతూ.
వినసొంపు .కంటికింపు.
అంతేనా.
పారాణి పాదాల పదనిసలు.
గోరింట కొనగోటి  సందేశాలు.
నవదంపతుల సరాగాల సుకుమారాలు.
అంతే కాదు.
అల్లుళ్ళ అలకలు.వియ్యంకుల విసుర్లు.బతిమిలాడడాలు.బామాడడాలు.
ఒకటా రెండా.
చూడ దలిచిన వారికి చూడగలిగింత.
చూడగా చూడగా..గత పదేళ్ళలో ..కట్టుబొట్టు, మాటమంతీలలో వచ్చిన తేడాలను అటుంచి..పెద్దగా మార్పులేమీ లేవు.
ఎటొచ్చి, “సారొచ్చాక ఆర్డరిస్తారా మేడం “అని అడగడం కాస్త తగ్గించి,”ఆర్డర్ మేడం ” అని అడగడం ఒక తీరయితే…
 “మీరొకరేనా? ఇంకా వచ్చే వారెవరైనా ఉన్నారా?అని అడగడం మానేసి..వంటరి వారికీ ఓర్పుగా వడ్డన చేయడం..
వేళ తప్పి వెళ్ళినా ..కుర్చీ ఖాళీ  లేదనకుండా  ..లైటేసి ఫ్యానేసి..ఒక కప్పు కాఫీ  వేడి వేడి గా అందించడం..
 మొత్తానికి సొంత బంధువుల ఇంటికైనా … పెళ్ళీ పేరంటానికైనా పిలుపు రాకపోతే వెళ్లడానికి వెనకాడే మనం,ఎలాంటి శషబిషలు లేకుండా ..ఎప్పుడు పడితే అప్పుడు ..అర్ధరాత్రైనా అపరాత్రైనా ..కులాసాగా థిలాసా నడిచెళ్ళి ..ఒక కమ్మటి కాఫీ ..తాగగలిగేది…
 ఇక్కడ కాకపోతే ఎక్కడ?
***
అదుగోండి ..అక్కడో కొత్తకోడలు అత్తగారి గారి ఉపన్యాసాలు శ్రద్ధగా వుంటూనే , ఆ పక్కనున్న పెనిమిటికి  SMS సంభాషించేస్తున్నది.ముసిముసి నవ్వుల ముద్దుల కొడుకు ఓరచూపుల్తో సమాధానాలు పంపించేస్తున్నాడు.
అప్పుడే మాటలునేర్చినట్లున్న పిల్లవాడొకడు , వాళ్ళ అమ్మానాన్నలను ముప్పైమూడు ప్రశ్నలతో మూతిప్పలు పెడుతున్నాడు. ఇదుగో ,ఈ తాతా మనవళ్ళ తగాదాలు తీర్చలేక ఆ అమ్మమ్మ తెగ ఆయాస పడుతోంది.
అదుగో ..ఆ నవ వధువు మెడలో పసుపు తాడును పదే పదే సర్దుకొంటొంది.
కట్నాలు పెట్టుబడులు, చీరలు సారెలు ,నగలూనాణ్యాలపై సుధీర్గచర్చ ..ఆ టేబుల్ వద్ద ఇప్పుడిప్పుడె 
మొదలయినట్లుంది.
అక్కడ ఆ అమెరికా అబ్బాయి అయోమయాన్ని అమ్మానాన్న లు ఓపికగా వివరిస్తున్నారు.
ప్రసాదమో పప్పన్నమో .
సందడి సందడిగా.
పక్కపక్కన కూర్చున్నా ఎవరికీ పట్టనట్లు..అంతా తామే అయినట్లు..వారి వ్యవహారాలలో వారు మునిగి తేలుతుంటే,

తప్పిపోయి ఏ పెళ్ళిపందిట్లోకో అడుగు పెట్టి ,తడబడి తేరుకునే లోగానే .. ఆ సందట్లో కూరుకు పోయినట్లు ..
అందరూ మనవారయినట్లు తెగసంబరపడి పోతూ ఉండగానే , ఎప్పుడో తెచ్చి పెట్టిన కాఫీ చల్లారిపోతే ..
మరో వేడి కాఫీ వచ్చే వరకు కనుల పరుగులు !
***
పల్లెల్లో పెదపల్లె..ఆ తిరుపతి భోజన ఫలహారశాలలకు
ఓ మారు జై కొట్టండర్రా!
***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “ఆకటి వేళల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s