సిరా సేజ్జెం

పొలమంతా సిరా చల్లి, అక్షరాలు నాటేసి, కథన సేద్యం చేస్తే … అక్కడ మొలకెత్తేది ఆనందమా?ఆవేదనా? ఆందోళనా? ఆక్రందనా?
ఖచ్చితంగా అవి అన్నీ కలగలసిన.. మొలకలపల్లి గారి ” సేజ్జెగాడు” కథాసంకలనం అయి ఉంటుంది !
అవునండి.
 తెలుగునాట ప్రత్తిరైతులు పురుగుమందును కడుపులో దాచుకొని మన ఓటమిని తమదిగా దిగమింగిన విషాద నేపధ్యంలో , మొలకలపల్లి గారు నవలీకరించిన ఆ”ఆక్రందన” మనలను ఇంకా వెన్నాడుతూనే ఉండగా, 
ఇదుగో ఇప్పుడు పదిహేడు కథల రూపంలో రైతుల జీవితశకలాలను “సేజ్జెగాడు”వెంట తీసుకొచ్చింది.
బతక లేక బడుగు రైతు ..అనుకునే ఈ రోజుల్లో..ఈ కథలు మనకు మరో మారు బతుకు తీపిని పరిచయం చేస్తాయి.
రైతులంటే చిన్నచితకా రైతులు కాదండోయ్ ! 
మోతుబరులు!
మోతుబరులంటే అలాంటిలాంటి మోతుబరులు కాదండోయ్!
 అక్షరాలా అయిదెకారాల ముప్పై సెంట్ల మోతుబర్లు !
అవునండీ, పండిన పంటను ఉన్న ఊళ్ళో అమ్ముకోక , మార్క్ ఫెడ్ కు వెళితే మంచి ధర వస్తుందని ఒక రైతు, పట్నానికి పయనమాయ్యాడు. వాళ్ళావిడ ఎత్తిపొడుపులను మెత్తగానే వారిస్తూ” పండిన పంటని పీడాకారం అనుకుంటే ఎట్టే ?” అంటూ.
శీతలగిడ్డంగులకు చేరిన సరుకు అక్కడే ,పడి ఉండగా, ఎగుమతుల ఆంక్షలు తొలింగింప జేసేందుకు కృషి చేస్తున్నామని, అనుమతులు ఇప్పించేస్తామంటూ మంత్రివర్యుల వాగ్దానదాసులవుతూ , మార్క్ ఫెడ్ ఫారాలను చేత బట్టుకొని , పదారు “సంతకాలు” సేకరించి అందుకై ఉన్న నాలుగు రాళ్ళు కరగదీసి, చివరాఖరకు తెలిందేమిటయ్యా అంటే, ఈ రైతు గారు మోతుబరి అని!
ఎలాంటెలాంటి మోతుబరి..? అక్షరలా 30 సెంట్లు అధికంగా ఉన్న మోతుబరి.
“అందులో మూడున్నరెకరాలే పంటేసాను. మిగిందంతా సవ్వనేల ” అంటూ ఆ రైతు నెత్తీ నోరు కొట్టుకొని ఏమి ప్రయోజనం? మోతుబరి మోతుబరే! లెక్కలో తేడాల్లేవిక్కడ!
ఇక, అటూ ఇటూ చెడిన ఆ రైతు కు చివరికి మిగిలేదేమిటి?
గుక్కెడు పురుగు మందా? మూరెడు ఉరి త్రాడా?
మార్క్ ఫెడ్ మాయాజాలమై పోతే , వ్యవసాయం ఎత్తుభారం అయి పోదా?
ఇంతకీ , సదరు రైతుగారు పండించేదేమిటి?
శనగలు, కందులు,మినుములు,పెసలు, వంగ, చివారఖరకు ..వద్దనుకుంటూనే , మళ్ళీ, ప్రత్తి!
విత్తనాలు,సత్తవ మందులు, పురుగు మందులు,కూలిడబ్బులు , వీటన్నిటి కోసం చేసిన బాకీలు, ఇక, ఆ “వడ్డీతొ వడగళ్ళ గుర్రం కూడా పరిగెత్త లేదంట!”
ఆ పై, పల్లెలో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం లో రైతు చిక్కి విలవిలాడి పోక తప్పదు కదా?
” తనని ప్రేమించి లాలించి అనురాగం పంచీ మమకారం పెంచుకొన్న తన గారాల పుత్రుడి అవసరానికి కాకుండా, తన ఫలం ఎక్కడికో పరాయి ఇంటికి ,పరాయి చోటుకి ,పరాయి అవసరానికి పోతున్నందుకు నేలతల్లి కంట తడి “పెట్టుకున్నదట! కన్నబిడ్డ ఆరోగ్యం ఫణంగా పెట్టిన నిస్సహాయ స్థితిలో , భర్తతో పాటు పొలంలో రెక్కలు ముక్కలు చేసుకున్న” దొడ్డ ఇల్లాలు మల్లీశ్వరి “ఏం చేస్తుంది? ” పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది!” (కోత)
ఎహోషువా రూతమ్మలను ఒకసారి పలకరించి చూడండి. మన పొలం వొట్టిపోవడానికి కారణాలు తెలుస్తాయేమో!
ఎహోషువా మట్టి మర్మమెరిగిన సేజ్జెగాడు. కోల చేతబట్టి కొండ్ర వేశాడంటే ,పంట చాళ్ళలో విరగపండి, ఫక్కున నవ్వినట్లే.ఎద్దులను అదిలించాడంటే , ఇక ఆ ఊరి పురులు పొంగిపొర్లినట్లే. 
తెల్లారి  లేచిన దగ్గరనుంచి ,పొద్దు వాలే వరకూ , అతను చేసిన సేజ్జెం ..రూతమ్మ కడుపు నింపిందా కట్టుకోకలిచ్చిందా ..ఊహు .. చివరకు ..బోరవిరుచుకు తిరిగిన ఆ సేద్యగాడు, అతనితో పాటు రంకెలేసుకు తిరిగిన ఆ ఒంగోలు జాతి గిత్తలు .. ఒక్క ట్రాక్టరు దెబ్బకు ..కాలంలో కలిసిపోవలసి వచ్చింది.
“ఆ పాణం ఉన్న వాటికన్నా లేని వాటితోనే సుఖం రా! చీకూచింతా ఉండదు.ఎద్దులమేతకి ఎంత ఖర్చవతందీ? పని ఉన్నా లేకున్నా మేత తప్పదాయే! లెక్క జూసుకుంటే ఎద్దులసేజ్జం అందదురా,ఎనకటిరోజుల్లో ఎట్టా జేసారో కానీ..” అని ఊళ్ళోని రైతులన్నప్పుడు ఎహోషువా చెపుతాడు కదా”
“ ఎద్దులు గాట్లో ఉంటేనే గాదెలు నిండి పోతాయి గదా కాపా ! ఎద్దులకి వేసే మేత చూశావు కాని ,వాటి పేడ చాలు.బంగారం పంట పండడానికి ! వాటి పేడ ఎంతో సత్తవ కదా కాపా! మనకి ఎంత నయ్యిదిబ్బ తేలిద్దీ?బస్తాల ఎరువులు ఏమొస్తన్నయి..పురుగులు వస్తన్నయి,తెగుళ్ళు వస్తన్నయి,ఖర్చులు ఎక్కువ అవతన్నయి,చివరికి దిగుబళ్ళూ రావడం లా! ”
అదేంటి ఎహోషువా నోట అత్యాధునిక ఆర్గానిక్ ఫార్మింగ్ ,సస్టైనబుల్ అగ్రికల్చర్ లాంటి భావజాలం …అలా దొర్లిపోతున్నది?
అవునండి . ఆ పొలం తనది కాదు. ఆ అరక తనది .ఆ కాడెద్దులు తనవి కావు. కానీ, తరతరాలుగా సేజ్జేగాళ్ళగా బతికిన ఆ ఎహోషువ అనుభవం లోంచి వచ్చిన మాటలవి.రెక్కలకష్టం నమ్ముకున్న ఎహోషువ పట్నం దారి బట్టాడు. అతని మాటలు పెడ చెవిన పెట్టిన ఆ ఊరి రైతాంగం గుక్కెడు విషం పట్టారు!
మరి రైతులన్న దానిలోనూ వాస్తవమున్నది . చూడండి, కాడెద్దులు జతయితే .తమరెక్కలకష్టం తోడయితే , ఉన్న ఎకరం నేల తమను గట్టెక్కిస్తుందని , గంపెడంత ఆశతో బ్యాంకుకు అప్పుకు పోయిన  ఓ రైతు ,చివరకు ఆ వడ్డీ తీర్చడం కోసం ఆ ఎద్దులు,అరక, బండి,ఎకరం నేల అమ్ముకొని ,కుటుంబమంతా కూలిపనికి మళ్ళాల్సిన వైనం ,”బతుకు తనఖా” లో చదవండి!
ఇక, పల్లెటూరి పందాలు ,గెలుపుఓటములు, ఎత్తిపొడుపులు ,వేళాకోళాలు ,గడపదాటని గౌరవమర్యాదలు,పల్లెదాటని మాటపట్టింపులు, చిన్నరైతుల “కలలపంట” ఫేగుతీపి” పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు, ఆడపిల్లలకట్నాలు ,అల్లుళ్ళ అరణాలు, కొడుకుల కొత్తపోకళ్ళు, కూతుళ్ల స్వతంత్రభావనలు, కోడళ్ళ కరకరలు,
తలకొరివిపెట్టాల్సిన కొడుకుతో తలపగలకొట్టించుకొని తలవాల్చుకొని నిల్చునే తండ్రులూ,
 చెల్లెలి కట్నంసొమ్మును ఆస్తిలో తన వాటాగా చెల్లుబెట్టి వ్యాపారంలో పెట్టుబడిగా మార్చేసుకొనే అన్నాయి,
నచ్చిన వాడితో నడిచివెళ్ళే చదువుకొన్న అమ్మాయిలు , 
భర్తతో పాటు కష్టమూ నిష్టూరం భరాయించే దొడ్డ ఇల్లాళ్ళు , 
అవసరమైతే ,భద్రకాళులై “ఈ సారి పైకి రా..నరికి పారేస్తా! మొగోడంటనే పేద్ద మొగోడు ! ఆడదాన్ని కొట్టడమా మొగోడితనమంటే ?” అంటూ గర్జించే శాంతమ్మలూ..
అందరికీ అన్నిటికీ అంతఃసూత్రంగా ఆ ఎకరం నేల!
‘అర్రుగొర్రు పొలం, మందళ్ళలో జొన్నపైరు ‘…లాంటి పల్లెగడపలోంచి  పలికే కమ్మని తేట తెలుగు పదాలు పలుకుబళ్ళు తియ్యని గుమ్ముపాలు తాగిన అనుభూతిని ఇస్తే, 
కడుపులో కెలికే కన్నపేగు మెలికలు, చర్రున నసాళానికెక్కే కోపమూ ,అన్నీ తెలిసీ ఏమీ చేయలేని నిరాశా, నేలనమ్ముకొని నలిగిన బతుకులు ,
అన్నిటినీ నడిపించే ఆ ఆర్ధిక మంత్రం రాజకీయ తంత్రమై… కుతంత్రమై ..
రైతు మెడకు చుట్టుకుంటున్న  , ఆ వైనాలన్నీ ఈ కథల్లో చదివాక, 
కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరగకపోతే చూడండి.
పొలంలో నాట్లేస్తూనో , నాగలి దున్నుతూనో ,కలుపు తీస్తూనో,కల్లాం చేస్తూనో, పైటేళ బువ్వ తింటూనో , మాపటేళ మననం చేసుకొంటూనో, 
ఆ రైతన్న మొలకలపల్లి ,పలికిన అచ్చమైన బతుకు కథలివి. ఆ రైతు బతుకులోని అగరు ..వగరు.. పొగరు ..ఎవరికి వారు స్వయంగా రుచి చూడవలసిందే.
అన్ని కష్ట నిష్టూరాలనూ ఓర్చి ,
” ఎల్ల కాలం దండగలు పడతాం ఏందీ? అట్టా పొలంలో ఎప్పుడూ దండగలు పడే పనయితే దేశంలో ఎవడూ పొలం జేయడు.ఇక జనం అంతా ఏం తిని బతుకు తారు ? కొట్టిన అమ్మే పెట్టక మానదు.ఇయ్యాల కాకపోతే రేపైనా వానలు కురవకాపోవు,పొలం పండకాపోదు!”
అన్న ఆశాభావంతో తమను తాము ఓదార్చుకొని , 
మళ్ళీ అరక పట్టి సేజ్జెం మొదలెట్టే .. 
ఆ అన్నం పెట్టె చేతులకు నమస్కారం .
ఒక పాఠకురాలిగా రచయితకు అనేక ధన్యవాదాలు

*
( పుస్తకం .నెట్ వారికి ధన్యవాదాలు)

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “సిరా సేజ్జెం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s