గిరిజనాత్మకం !


“నేను నాగురించి ఈ రోజు రాయదలుచుకొన్నాను” అంటూ పి.పద్మావతి మొదలు పెడితే, “ఈ అవకాశం మాకు వస్తుందను కోలేదు” అని అంటుంది పార్వతి.
‘చిన్న కుటుంబము చింతల్లేని కుటుంబము. కానీ, మాది చిన్న కుటుంబము పేద కుటుంబము .” 
..ఈ భూమిపై ఆవర్భవించిన మానవ పక్షి యొక్క ఆత్మవ్యధ ..” అంటూ తన జీవిత విషాదమేమిటొ వివరిస్తాడు భూక్యా శివ S/O మదర్ సుగుణ .

అమ్మ, నాన్న, ఆకలి, చదువుకోవాలన్న తపన, పట్టుదల ..వీటన్నిటినీ ,అక్షరాల్లో అద్ది మన ముందుంచారు కారేపల్లి కళాశాల విద్యార్థులు. గిరిజ గా మలిచి.
 కొన్ని రచనలు  చదువుతుంటే , నిండా పదహారేళ్ళు లేని ఈ పసిబిడ్డలు ఎంత ఎదిగారో కదా , వారి జీవితం ఎన్ని పాఠాలు నేర్పిందో కదా ,అనిపిస్తుంది. 
వినగలిగిన మనసుంటే, ప్రతి రచన మనకు ఒక కొత్త జీవిత పాఠాన్ని పరిచయం చేస్తుంది.
 గుండె చెమ్మగిల్లే ఈ రచనలు ,
మాకూ ఉన్నాయ్ బాధలు ..మాకూ ఉన్నాయ్ కలలు ..మాకూ ఉన్నాయ్ కన్నీళ్ళు..  వినే ఓపిక మీకుందా? “ అని నేరుగా ప్రశ్నిస్తున్నాయి.
మరి మీ సమాధానం ఏమిటో మీరే నిర్ణయించుకోండి!
***
ఏ. నిరోష రాస్తున్నది కదా,
“నేను మొదటి సారి చేసిన తప్పు అవునో కాదో నాకు తెలియదు.అది ఏమిటి అంటే ,మా ఇంటి పక్కన వాళ్ళకు తినడానికి సరిగా  బియ్యం ఉండేవి కావు.వాళ్లు మా అమ్మ లేకుండా చూసి నన్ను అడిగే వారు. వాళ్ళను చూస్తే నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నాకు బాధ అనిపించేది.వాళ్ళు అడిగినప్పుడల్లా నేను బియ్యం ఇచ్చేదానిని.” అంటూ తన జ్ఞాపకాలు పంచుకొంటోంది .
అంతే కాదు, జ్వరం వచ్చి కామెర్లు సోకిన తండ్రిని పసిబిడ్డలా చూసుకొని, అలసిసొలసిన  అమ్మకు  చేదోడు గా కూలీ చేస్తూ తండ్రి ని ఆరోగ్య వంతుణ్ణి చేసుకొంది. ఇప్పుడు  ఒక ఆరోగ్యకార్యకర్త గా శిక్షణ పొందుతున్నది!

“ నాకు నేను నచ్చ లేదు “ అంటూ ఒక విద్యార్థిని ఎందుకు తనకు తాను నచ్చలేదో వివరిస్తే,మరొక అమ్మాయి ఆ 
నచ్చనితనాన్ని ఎలా అధిగమించను చేయదలిచిన ప్రయత్నాలనూ చెపుతుంది.

నాకు అన్నం ఎలా దొరుకుతుంది ? ” అని ఒకరు ప్రశ్నిస్తే, తమకు పిడికెడు మెతుకులు, గుప్పెడు అక్షరాలు  అందివ్వడం కోసం ,అమ్మానాన్నలు పడే కష్టాలను కళ్ళకు కట్టేట్టు చిత్రించారు  ఈ కొండ పిల్లలు.

“నర్సింగ్ అంటే ఎవరికైనా చులకన. చాలా మంది నర్సింగ్ చేసున్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడతారు.”అని చెపుతూ తానెందుకు నర్సింగ్ చేయ దలుచుకొందో చెపుతుంది, నర్సింగ్ వలన సమాజసేవ ఎక్కువగా అలవాటు అగును “..అని.
మరి మీరు గణితి వెంకయ్య అనే నాయకుడి గురించి విన్నారా?
నాకు నచ్చిన నాయకుడంటే,మంచి వాడు,ప్రజల బాధలను తెలిసిన వాడు, మనస్సు సున్నితమైనదిగా చెప్పుకోవచ్చును.’ అతను డి.బాలాజీ ఊరి నాయకుడు, బాలాజి ఊరినంతటినీ  “ వెంకయ్య గుంపు “ అనేవారంటే ,అతను ఎంతటి నాయకుడొ , గ్రహించమంటున్నాడు బాలాజీ.
ఇక, మన రాజకీయ నాయకులు వెంకయ్య నుంచి నేర్వ వలసింది ఏమిటో మీరు
గ్రహించారు కదా?
” మనలో కూడా ఈ ఆలోచన అనేది మార్పు తీసుకు వస్తుందా? అని అంటారా?  తప్పకుండా తీసుకు వస్తుంది. ఎప్పుడంటే ! మనం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు. ఆలోచిద్దాం .మనలో మార్పును ఆహ్వానిద్దాం ” అంటుంది శశిరేఖ.
అందుకేనేమో, దరువేసి మరీ చెపుతోంది శారద,” అమ్మాయి జీవితం “లో మార్పును ఆశిస్తూ,

“అమ్మా మీకు చెపుతున్నా వినవే అమ్మా
నాన్న మీకు దండం పెడతా వినవా నాన్నా (2)
నాతోటి వాళ్ళందరూ  “ఓహో “
బడికి వెళుతుంటే ” ఆహా”
నాకు వెళ్ళాలనిపిస్తుంది ఓ నాన్న
నన్ను కూడా బడికి పంపించవే అమ్మా  (2)”

” …సార్ , మానవత్వం పోయింది. దాని విలువ వంద రూపాయలు. ఈ గదిలో ఎవరికైనా దొరికిందా?” అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే  హృద్యమైన కథ ఎం.మోహన్ ది. 

ఇవే కావు, “తిన లేని పండు” “తలపాగారాజు ” వంటి సరదా కథలూ ఇందులో ఉన్నాయి. 
వ్యక్తిత్వ వికాసం , సైన్సు పాఠాలు ,సుస్థిర వ్యవసాయం, పర్యావరణం 
 అధ్యాపకుల అభిప్రాయాలు ,కవితలు,సామెతలు, అవీ ఇవీ అన్నీ ..ఒక్క చోట ప్రోది చేసారు ..వీరు.

” సీతాఫలం చెట్టు ను చూస్తే ప్రతి మానవుడి నోరూరుతుంది .దాని మీద నిగనిగ లాడుతున్న పండు ,సీతాఫలం కాయ,కు ఏం తెలుసు మనుష్యులందరూ పండు కోసం చూస్తున్న సంగతి ? చెట్టు గుట్టును రట్టు చేసేది (తెలిపేది)  పండు, సీతాఫలం కాయే, కదా? “అని రాస్తూ జి శివాజి ఇలా ముగిస్తాడు ,” అలాగే మా అమ్మ యొక్క ఆత్మీయత గురించి మా అమ్మ వాత్సల్యం గురించి గాని, మా అమ్మ మన్స్సు గురించి గాని ,ఒక కొడుకుగా మాతల్లి యొక్క బాధను తొలగించి , నిజమైన పుత్రుడిగా నడుచుకొంటాను” అంటాడు శివాజి , అమ్మను చెట్టుతో ,తనను పండుతో పోల్చుకొంటూ.

కొండా కోనల్లో ఆడుతూ పాడుతూ పెరిగే ఈ గిరిసంతతి , పలకాబలపం బట్టి ,అక్షరం నేర్చి , బడి మెట్లెక్కి ,కళాశాల లోగిలిలో నిలబడి , చేస్తోన్న అక్షర చమత్కారం ఈ “గిరిజ” .
కారేపల్లి ప్రభుత్వ  జూనియర్ కళాశాల , వార్షిక సంచికను ఒక సాహిత్య సంచిక గా రూపొందించడంలో అధ్యాపకుల కృషి ,ప్రధానోపాధ్యాయుల వెన్నుదన్ను స్పష్టంగా కనబడుతున్నాయి.

వారికి ధన్యవాదాలు
ప్రభుత్వ కళాశాలు ఇంత చక్కటి ఉదాహరణగా నిలబడడం  కన్నా ఆనందం ఇంకేముంది?

ఈ పిల్లల మాతృ భాష తెలుగు కాదు. తెలుగు నేర్చి ,ఆ తెలుగునే తమ ఆలోచనలకు అనుభూతులకూ వ్యక్తీరణమాధ్యమం గా  వారు మలుచుకొన్న తీరు, 
మనం తెలుగు వాళ్ళం అమ్మ మాట మన నోట పలికితే నామోషిగా భావించే ముందు, 
ఒక మారు ఆలోచించాలి మరి !
పరభాష  మీద వారు సాధించిన పట్టు , ఎంతో అభిమానం గా ఆప్యాయంగా పదాలను అల్లుకొన్న తీరు ముచ్చటేస్తుంది .కదండీ.

అందుకై,
ఎంతో శ్రద్ధగా తరగతిని సృజనాత్మకం గా మలిచిన   తెలుగు అధ్యాపకులను వారు  చేసిన కృషినీ ,
మనం అభినందించక తప్పదు.

ఇంత మంచి ప్రయత్నం చేసిన కవి సీతారాం గారికి ధన్యవాదాలు.

***

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “గిరిజనాత్మకం !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s