అక్షరాలా… అపరంజి !

అదేంటో గానీ,చెడు వినొద్దు కనొద్దు అనొద్దు …అని
అచ్చం మన గాంధీతాత అనుంగు మనవరాళ్ళూమనవళ్ళలా  …అనుకుంటామా..
చెడు చూడకా తప్పదు.వినకా తప్పదు.
ఇక అనడం అంటారా, అది మన పెదవి దాటే పలుకు  కనుక …ఎంతోకొంత మన అధీనంలోనే ఉంటుంది …కనుక ఫరవాలేదు.
కానీ, చూడవలసిన  దృశ్యమూ ..వినవలసిన విషయమూ ..పరాధీనమే కదా !

నిన్న గాక మొన్న “అలనాటి నెల్లూరు”పుస్తకావిష్కరణ సభను ముక్తాయిస్తూ జ్ఞాపకం చేసుకొన్నాను.. పూర్ణమ్మను.
“నలుగురు కలిసి నవ్వేవేళల నన్నోపరి తలవండీ” అని అంటుందే ఆ మరుపురాని మాటలను.
పూర్ణమ్మ, మన తెలిగింటి పుత్తడి బొమ్మ.
 కాలం కదిలి పోయింది.కన్యాశుల్కం ,బాల్యవివాహాల దురాచారం సమసిపోయింది.
ఒక సంస్కర్త, రచయిత దార్శనికుని   …ఆవేదన ఆలోచనై ..అక్షరాలా తీర్చిదిద్దిన అపరంజి ,మన పూర్ణమ్మ .
మన గుండెల్లో పదిలంగా నిలిచి పోయింది .అదాటున పలకరిస్తూ. ఒక దురాచారాన్ని గుర్తుచేస్తూ.
ఎవరింట పుట్టిందో ..ఎవరింట మెట్టిందో ..ఏ కోనేట గిట్టిందో ..కానీ ,
మన సాహిత్యంలో నిలిచిపోయిన చిట్టిచేమంతి, మన పూర్ణమ్మ.
*
చెడుచూడొద్దు వినొద్దు అని బుద్దిగా నమ్మే నేను, టివి సీరియళ్ళు గట్రాలకు ఆమడ దూరం కదా…అలాంటింది అదాటున ఒక దృశ్యం చూడవలసి వచ్చింది.
నేతి బీరకాయల్లో నేతినీ , సీరియళ్ళలో నీతినీ వెతికేంత అమాయకురాని కూడా కాదు కదా ..
అయినా ,
ఒక ముక్కు పచ్చలారని పసిబాలికను పెద్దముత్తైదువలా అలంకరిచి ,ముదినాపసాని మాటలతో ముంచి తేలుస్తూన్న..ఒక అత్యంతాదరణ పొందిన  సీరియల్ చూడనే చూసాను.
ఉమ్మడి కుటుంబం, బాల్యవివాహం, మేనరికం, అత్తల, అత్తల అత్తల సాధింపులు,నిప్పులగుండంపై నడకలు, ఆ పాప చెల్లించాల్సిన మొక్కులు,చదవ నీయకుండా చేయడానికి సవాలక్ష అడ్డంకులు ,పుస్తకాల సంచిలో పగిలిన గాజు ముక్కలు, పుస్తకం ముట్టుకొంటే రక్తసిక్తమయ్యే చెయ్యి, ఎడం చేత్తో పరీక్షరాసి “ఫస్టున” పాసవ్వడం, ఇక , ఆ పాప “భర్త” మరొక పసి బాలకుడు అదే పరీక్షలో ఫెయిల్ అవ్వడం, ఇక, విలనీ బామ్మలుతాతయ్యలు పెంచి పోషించే కాంప్లెక్షులు కాకరకాయలు!
 ఈ పాప కు పుస్తకాలు తోడుంటే “ఎదిగి పోతుందని” చేంతాడు చెత్తమాటలు గుమ్మరించి .. విలనీ బామ్మ పుస్తకాలు చించి చించి ..అపై సంచిని విసిరి కొట్టడం…
ఈ సుధీర్ఘ దైనందిన సీరియాల్.. నిరాఘాటం గా సాగిపోతూనే ఉంటుంది…
మిమ్మల్ని ఆ వివరాల్తో విసిగించను …కానీ, అమ్మలారా అయ్యలారా…నేరాలు ఘోరాలు ఇంతకన్నా క్రూరంగా ఉంటాయా?
ఒక వైపు ఆడపిల్లలు ,వారి క్షేమాన్ని కోరేవారందరూ  …బాలికల ఉనికిని ,జీవితాన్ని ,జీవనాన్ని ..పునర్నిర్వచించే ప్రయత్నాల్లో శతాబ్దాల తరబడి చేస్తోన్న పోరాటాలు…
 మరొక వైపు ,ఆమ్నియోసింథసిస్  నుంచి ఆమ్లదాడుల వరకు విస్తరించిన అత్యాచారాలు, 
బాలికలపై విచ్చలవిడివిడిగా సాగుతోన్న హింస ,దౌర్జన్యాలు, దుర్మార్గాలు…
నిశ్శబ్దం గా మనల్ని మరో వందేళ్ళు  గిర్రున వెనక్కు తిప్పే నడిపే ..ఇలాంటి ప్రజాదరణ పొందిన సీరియళ్ళు..
…అవి తీసిన వారు…చూస్తున్న వారు ..చేస్తున్న వారూ .. పదిలంగా ఉండగా …
ఒక్క సందేహం. 
ఒకే ఒక్కటి.
వాళ్ళు బహుశా మరిచిపోయారో….  తలవనే  తలవ లేదో ..
గానీ , ఈ వ్యవహారమంతా .. మన మానవ హక్కుల ఉల్లంఘన కాదూ? 
మన మౌలిక మానవ సంస్కార వికాసానికి ప్రతిష్టంభన కాదూ?
ఆ బాల నటుల  మనోవికాసం నుంచి ,ఆ నటనను చూసి చౌడుదేరుతున్న బాల ప్రేక్షకుల మెదళ్ళ మొదళ్ళలోకి…
స్థిరపడుతున్న బాల్యహింస!
బాల పాత్రచిత్రణలో హింస ఇంత బాహాటంగా ,విచ్చలవిడిగా  ప్రకటించబడుతుండగా , 
త్వరలో పిల్లల పండుగ ఎలా జరుపుకోవడం?
కళలో కల్పనలో ఎదైనా చెల్లుదన్న పోయెటిక్ జస్టిఫికేషన్ , అర్టిస్టిస్టిక్ జస్టిఫికేషన్ ఇలాంటి వాటి విషయంలో ఇట్టే అంది వస్తుంది.
కల్పనలో ఏదైనా చెల్లుతుందనీ కాలస్థలనియమాలతో పని లేదనీ ..సమర్ధించేయవచ్చు.
కానీ, మన కంటిని మన వేలితో పొడిచే ఇలాంటి దురాకల్పనలు మనకెందుకు?
ఆయా పాత్రలలో “జీవిస్తున్న”బాలనటులు రాబోయే పిల్లలపండుగ రోజున ,”మహా బాలనటులని” బిరుదాంకితులయినా మనమేమీ ఆశ్చర్య పోనక్కరలేదు. ఆశ్చర్యపోము కూడాను!
ఇంటిగడప దాటని, ఊరిపొలిమేరయినా మీరని ..కొండల్లోకి కోనల్లోకి కూడా ఇలాంటి ..సీరియళ్ళన్నీ చేరుతున్నాయి కదా?
ఇప్పుడిప్పుడే అక్షరం చేతబట్టి ,  చేతనాక్రమంలో …పరివర్తనా దిశగా… బుడి బుడి అడుగులు వేస్తున్నవారి ముంగిళ్ళ లోకి ..వెళ్ళి ఇవి తిష్ట వేస్తున్నాయి కదా?
హత్యలు,మాన భంగా లు,కిడ్నాపులు ,చేతబడులు,శవాలపూజలు , ఇప్పుడిక బాల్యహింస ..
ఇలా అడ్డూఅదుపూ లేకుండా ..ఈ విచిత్రవిన్యాసం సాగవలసిందేనా?
 పగ,కక్ష, ద్వేషం ,హింసలలో ముంచెత్తుతోన్న బాల్యాన్ని చూస్తూ ఊరుకొందామా?
మరొక పుత్తడిబొమ్మ ఈ నేలపై తిరగాడకూడదనేగా ఆ మహానుభావుడు  పూర్ణమ్మకు ప్రాణం పోసింది. 

ఇవాళ్టి ,బాలపాత్రల చిత్రణ గురించి వీసమెత్తు ఊహించగలిగినా , గురజాడ గుప్పెడు  గుండె ..ఎంతలా విలవిలలాడిపోయేదో..!
అంతటి ఆశయాన్ని తప్పుదోవ పట్టించి ..టీఆర్పిలు పెంచుకోవడం ..ఎంత విషాదం !

 సున్నితంగా సృజించవలసిన ..పువ్వులాంటి పిల్లల పాత్రల చిత్రణలో.. 
మాధ్యమాలు ఏనాటికైనా కళ్ళుతెరుచుకోవాలని ,
మనం కళ్ళు చెవులు  నోరు …మూసుకొని 
 ప్రార్ధిద్దామా?

 బాలనటుల దుర్భరస్థితికి ,బాలప్రేక్షకుల దౌర్భాగ్య పరిస్థితికీ ,

రెండు నిమిషాలు మౌనం పాటిద్దామా?

పిల్లల పండుగ వేళ !

తెలుగుజాతి యావత్తు ..
సమిష్టిగా !

***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “అక్షరాలా… అపరంజి !

 1. మీరు చెప్పింది నిజం. కాని ఏం చేస్తాం?
  ఒక్క టీవీ సీరియళ్ళేంటి అన్ని రంగాల్లోనూ అలాగే ఉంది.

  మతాలు ఎన్నైనా దైవం ఒక్కటే అన్నట్టు, సినిమాలు ఎన్నైనా కథ ఒక్కటే.
  పశుబలం తప్ప మరోటి లేని మృగాలు హీరోలు. సున్నితమైన రూపం తప్ప వ్యక్తిత్వం సుతరామూ లేని బొమ్మలు హీరోయిన్లు.
  ఈ రోజుల్లో మన “కళా సృష్టి” ఎంత నాటుగా, మోటుగా, రోతగా, క్రూరంగా ఉంటే అంత జనాదరణ!

  ఇక మీరు గురజాడ గురించి చెప్తుంటే బాధగా అనిపిస్తుంది. అంత దారుణమైన సాంఘిక దురాచారాన్ని కూడా సున్నితమైన హాస్యంతో,
  చుర్రు మనిపించే వ్యంగ్యంతో, “ముత్యాల సరాల్లాంటి” మాటలతో వ్యక్తం చెయ్యగలడం ఆయనకే సాధ్యమయ్యింది.
  అలాంటి తెలుగు నాటకం ఈ రోజుల్లో ఇంచుమించు చచ్చిపోయిందనే అనిపిస్తోంది.

  సంస్కారవంతమైన, విద్యావంతమైన చర్చకి, బూతులు తిట్టుకోడానికి మధ్య తేడా తెలీనివి మన న్యూస్ చానెళ్లు. సత్య శోధనకి, పుకార్లు పుట్టించడానికి మధ్య తేడా తెలీనివి మన వార్తాపత్రికలు.

  మనసుకి మంచి పోషణ నిచ్చి, తెలుసుకోవాలనే తపనని తీర్చి, మనిషిని పెంచే పుస్తకాలు తదితర వసతులు మన సమాజంలో కొంచెం తక్కువ. పాత రచనలనే మళ్లీ మళ్లీ ఆత్రంగా తవ్వుకోవడం తప్ప, గొప్ప లోదృష్టితో మన సమాజం యొక్క భవిష్యత్తుకి బాటలు వేయడం ఎలాగో తెలీని స్తబ్ధత నిలకొంది మన సాహితీలోకంలో.

  అందమైన, నిర్మాణాత్మకమైన, నవ్యమైన, సత్యవంతమైన ఆలోచనలు ఆలోచించలేని భావదారిద్ర్యం.
  కొట్టుకోవడం తప్ప సమిష్టిగా, సృజనాత్మకంగా ఉద్యమించలేని ఆశక్తత.
  బయట పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా ఏమీ పట్టనట్టు జీవితాలు వెళ్ళబుచ్చే మేధావి వర్గపు దారుణ మౌనం.

  మరి అది మన చదువులో లోపం అనుకోవాలా? జీన్సులోనే ఉందా?… నేరం గ్లోబల్ వార్మింగ్ మీదకి తోసేద్దామా?

  ఏదేమైనా ఈ ప్రస్తుత దుస్థితి కి స్పందించి బాధపడే వారంతా, విద్యావంతులైన తెలుగువారంతా, కలిసి ఏదైనా చెయ్యాలి…

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s