వీరి వీరి గుమ్మాడి !

వీరి వీరి గుమ్మడి పండు..
వీని పేరేమి ?”
అమ్మ మాకు నేర్పిన ఆట అది.
మా తిరమల్దేవుని గుట్ట గేర్లో సందడిగా పిల్లలం ఆడుకొనే కుంటాటకు,చోరాటకు, లింగోచ్చకు  రైలాటకు..ఇది అప్పటి నుండి జత చేరింది.
మీరు ఆడే ఉంటారు కదా?
పిల్లలందరం బచ్చాలు వేసుకొని దొంగ ఎవరో తేల్చేసి ..అందరం గప్ చుప్ గా దాక్కోని..చూస్తుంటే , అమ్మ దొంగ కళ్ళు మూసి .. మాట అంటుండగా మాలో ఒకరం వెళ్ళి ముక్కు గిల్లేసి వచ్చేవారం. ఇక కళ్ళు తెరిచిన దొంగ అదెవరో కనుక్కోవాలి.ఇక, పిల్లల సందడే సందడి.
వీరి వీరి గుమ్మడి పండు..వీని పేరేమిఅంటూ!
అనుకుంటాం కానీ , ఇది మూసిన కళ్ళు మూసి ఉండగానే మిగిలిన జ్ఞానేంద్రియాల సాయంతో ముక్కు గిల్లిన వారెవరో గ్రహించాలి. నిజం చెప్పాలంటే , నా మట్టుకునాకు, నా ముక్కే సాయానికి వచ్చేది!
 గిచ్చిన వారి అరచేతి వాసన బట్టి ..కదలికల సవ్వడికొసవేళ్ళ స్పర్ష .. ఇలా మిగిలినవన్నీ తోడయ్యేవి.
ఇప్పుడు చెప్పండి.
వీరి వీరి గుమ్మాడి  ..దీని పేరేమి?”

చప్పున చెప్పలేరా?
బాగా చూడండి.
ఇట్టే చెప్పేయ గలరు!

మొన్నీమధ్య కొండదారిలో వేగంగా మలుపు తిరుగుతుంటే, కళకళలాడుతూ నా కళ్ళ బడ్డాయి..
విరిసిన  పసుపుపచ్చపూలు.

కారు కిటికీలోంచి వేగంగా కదిలిపోతుంటే, ఉండబట్టలేక ఆగి చూద్దును కదా… 
దారి పక్కనంతా అల్లుకు పోయిన తీగ… విరబూసిన పూలు!

 అప్పటికింకా మంచుతెరలు వీడలేదు.మెల్లి మెల్లిగా సూరీడు దట్టమైన పొగమంచును దాటుకొంటూ ..ఒక్కో వెచ్చటి అడుగు వేస్తున్నాడు.
తీగ లాగుతూ డొంకంతా కదిలించేసా. అది చెరుకుతోటలోకి దారి తీసింది. ఎవరో రైతు గట్టు మీద వేసిన గుమ్మడి ..ఇలా దారంతా బంగరుపూలు పూయించేసిందన్న మాట!
అవునండీ,ఈ తెర మీద విరబూసింది ..అక్షరాలా ఆ గుమ్మడి పూవే!
ఆకుపచ్చని చేలగట్లమీద పొంగుబంగరు గుమ్మడి పూలు ఎంత సొగసుగా ఉన్నాయో కదా!
ఒక్క సారిగా గుర్తొచ్చింది.
పూసే కాలం వస్తే పూయవూ!
పండగనెల మొదలవ్వబోతోంది కదా!
ముచ్చటగా ముగ్గేసిగొబ్బెమ్మను చేసి..పసుపుకుంకుమలతో సింగారించిగుమ్మడి పూవు తురిమిబంతి చేమంతి పూలరేకులు చల్లి ..తమలపాకులో పంచదారో పటికబెల్లం ముక్కలో ఫలహారం పెట్టి ..మురిసిపోకుండా ఉండగలమా!
మొదటి రోజున ఒకటి, రెండో రోజున రెండు..పండగ నాటికి వాకిలంతా గొబ్బెమ్మలే!
ముత్యాల ముగ్గులన్నిటా బంగరుపూలు పూసేవి.వాకిట్లో విరిసిన ముద్ద బంతులతో చేమంతులతో పోటీలు పడుతూ
పొద్దుట గొబ్బెమ్మ కాస్తా ..సాయంకాలానికి గోడ మీద పిడకయ్యేది.భోగినాడు వెచ్చటి మంటయ్యేది.
గుమ్మడి పువు మీద కుంకుమ పొడి ఛాయ  అంటే బహుశా అదేనేమో.. శీతవేళల వెలుగు వెచ్చదనం కలగలిసి ..మన ఇంటి ముంగిట్లో మురిసేవేళ .వాకిట్లో వంటింట్లోఅక్కడ ఇక్కడా అని లేకుండా.. సరిగ్గా సంక్రాంతి శోభ ..అదిగో అక్కడే మొదలయ్యేది.
చేలగట్ల మీది గుమ్మడిపూల  పలకరింపులతో  ..పకపకలతోమొదలయ్యి .. .కొత్తబియ్యం పరమాన్నం , కమ్మటి గుమ్మడి కాయ కూరో పులుసో దప్పళంతోనో
పూర్తయ్యేది!
ఎప్పుడు  గుమ్మడి  కాయను కోయబోయినా పెద్దామ్మ ముక్తాయించేది
కడివెడు గుమ్మడి కత్తి పీటకు లోకువని!
***
ఏడాదీ .. ఆ  పచ్చని బంగరు పూలు పూయవలసిన చేలగట్లు నీట మునిగి ఉన్నాయి
కల్లాం లోని కుప్పలువేసిన ధాన్యం తడిచి మొలకెత్తిపోయింది.కోతకు  దగ్గరపడిన వరి చేలల్లోనే చెదిరిపోయి ఉంది. త్వరలో మన నిలువునా నీట మునిగితడిచి ముద్దయిన అన్నదాతల ఆక్రందనకు ఒక మార్గం దొరుకుతుందనీ.. 
సంక్రాంతి శోభ వారింట  చేరాలనీబంగరుపూలు విరియాలనీ కోరుకొందాం!
షాపింగు మాల్స్ కూ రేడియో లకూ పరిమితమై పోక
అహర్నిషలు టివి తెరలపైననే  కాక
చేలగట్లపై శోభిల్లే సంక్రాంతే సంక్రాంతి .
ఏమంటారు?
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

One thought on “వీరి వీరి గుమ్మాడి !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s