నిశ్చయముగ నిర్భయముగ

పాలమూరులో మేము … పనిగట్టుకొని ఎవరో నియమం ఏర్పరిచినట్లుగా,

క్రమం తప్పకుండా, ప్రతి ఆదివారం …
ఉదయం కుంకుళ్ళతలంటు , మధ్యాహ్నం మంచి మసాలాభోజనం, ఆపై మ్యాట్నీ షో కు ప్రస్థానం.
అప్పుడు నాకు పదకొండేళ్ళు.మా చెల్లెలు ,కమల , నాకన్నా ఏడాదిన్నర చిన్నది.
సినిమా టిక్కెట్లు…బారానా(ముప్పావలా), రూపాయి ,రూపాయిన్నర.
 అమ్మ తలా రూపాయి ,మరో పదిపైసలు బటాణీలో పుట్నాలో కొనుక్కోమని ఇచ్చి పంపేది
మేము పరమబుద్ధి మంతుల్లా బారానా టిక్కెట్టు కొనుక్కొని ,మిగిలిన డబ్బుల్తో గోళీ సోడాలో, మిరపకాయబజ్జీలో ,ఇంకా మిగిలితే పిప్పర్మెంట్లో కొనుక్కునే వాళ్ళం.
తెరకు దగ్గరగా చతికిల బడి, మెడను నిక్కించి నిక్కించి చూసిన సినిమా …. సాయంకాలానికి
సహజంగానే తలనొప్పి వాయినమిచ్చి,ఇంటికి సాగనంపేది. ఆ సినిమాలో నచ్చిన మాటలు వల్లిస్తూ, పాటలు గునుస్తూ , గాలి పోసుకొంటూ ఇంటి దారి పట్టేవారం.
మళ్ళీ ఆదివారం మరో కొత్త సినిమా చూసే దాకా, ఆ మాటలు మా మధ్యనే చెమ్మచెక్కలాడేవి. ఆ పాటలు అల్లాబిల్లి తిరిగేవి..
ఆదివారం తరువాత ఆదివారం, సరిగ్గా ఇదే  తంతు.
అలాంటి ఒక ఆది వారం నాడు, నటరాజ్ టాకీసులో , మేము చూడబోయిన సినిమాలోని కథానాయకుడు అంతకు మునుపు చూసిన సినిమా హీరోల్లా  కత్తుల యుద్ధాలు, కార్ల చేజిగ్ లు లాంటి, హడావుడేం చేయకుండా , సూటిగా తేటగా ,మాటల్తో పాటల్తో ఆకట్టుకొన్నాడు.
పదే పదే “మహాకవి” అన్నాడంటూ అతను మాట్లాడిన మాటలు.., మాకెంత నచ్చాయో చెప్పలేం.
అలా ఆ మాటలతో పాటలతో  పాటు ఆ మహాకవిని ,..
 ఆ  మిట్టమధ్యాహ్నం  పూట ఆ “ఆకలి రాజ్యం(1981) లోంచి” అపురూపంగా అందుకొని,
  భద్రంగా మా వెంట తెచ్చుకొన్నాం.
 ఇకనేం ఉంది,?
మా ఇల్లు దద్దరిల్లి పోయింది.
మా అమ్మ వంటయ్యే లోగా , పలు మార్లు” సాపాటు ఎటూ లేదు “హోరెత్తిపోయేది. .
ఇక, అదే ఉత్సాహంలో ఆ మాటలకోసం,శ్రీశ్రీ  గారి పుస్తకం కోసం ,మాఇంటి పుస్తకాల గూడులో వెతికి చూడగా , అక్కడ, గురజాడ ,కందుకూరి ,జాషువా, తాపీ,కవిరాజు ,పోతన,తిక్కన, గోరా…లతో పాటు అనేకులు తమ రచనలతో బదులుపలికారు . కానీ,  శ్రీశ్రీ కనబడలేదు.
బడిలో “పాడవోయి భారతీయుడా “అంటూ పిల్లలమంతా ఎంతో ఇష్టంగా ఆట కట్టినా,
 “ఎవడువాడు ఎచటి వాడు “అంటూ ఉత్సాహంగా ఏకపాత్రాభినయం చేయబూనినా,
“ఎవరో వస్తారని ఏదో చేస్తారని” మా బడి బెంచీలపై దరువేసినా,”…
“కొంత మంది కుర్రవాళ్ళు పుట్టుక తో వృద్ధులు “అని మా ఆరోతరగతి అబ్బాయిల్నిఅదను దొరికినప్పుడల్లా  ఆటపట్టించినా,….
“మనసున మనసై” అన్న మా ఆకాశవాణి పాటను అమ్మ తన్మయురాలై వింటున్నా,,,
 “నా హృదయంలో నిదురించే చెలి” అంటూ మా జనరంజని  చల్లని సాయంకాలాలు కూని రాగాలు తీసినా ,,,
అవన్నీ  శ్రీ శ్రీ గారు రాసినవని మాకేం తెలుసు?
అంతెందుకు ?
ఆ “ఆకలి రాజ్యం” ఆసాంతం , అందులోని కథానాయకుడు, కమల్ హాసన్, ధీటైన అభినయంతో,ఘాటైన వాచికంతో వల్లించిన  మహకవి మాటల ప్రవాహపు వొరవడిలో ,ఆ సాపాటు పాటకారి ఆచార్య ఆత్రేయ గారు తన కలాన్ని పరిగెత్తించక తప్పలేదు కదా!
ఆ వరసలోనే ,
కాస్త ముందూ వెనకగా  ,అటు మాభూమి ,ఇటు మాదాల గారు ,అంతలోనే టి. కృష్ణ గారు ,
నరసింగరావు గారు “రంగుల కలలకు “జజ్జనకపాడేసారు కదా.
అలా, సాపాటు పాటలు పాడుకొని సంతోషించే ఆ రోజుల్లో,
ఓ మధ్యాహ్నం లెక్కల తరగతి లో ,
తలలో తన్నుకులాడుతున్న నాలుగు ముక్కలు నోటు బుక్కులోకి ఉత్సాహంగా వొలికించేసా.
“నీతీ నీవెక్కడ?
నిజాయితీ నీవెక్కడ?
విరిగిన పేదల గోడల్లోనా?
పెరిగిన పెద్దల మేడల్లోనా?”
అంటూ పేజీలు నింపేసి  , తెగ బారెడు నిట్టూర్చా.
.పక్కనే కూర్చున్న మా అపర్ణ మంచిది కదా,  వెంటనే మాలెక్కల సారుకి చూపించడం.
లెక్కలు ఎగ్గొట్టి చేస్తోన్న ఘనకార్యానికి ఎక్కడ గోడకుర్చీ వేయిస్తారో అని నేను భయ పడుతుంటే,
భానుమూర్తి మాష్టారు కడుంగడు సంతోషించి,అందరికీ చదివి వినిపించడం.
 ఆ హుషారులో నేను నోటు బుక్కంతా ఆ తరహా చిట్టిరచనలు చేయడం.
కవిత్వం అంటే ఏమిటో ఇప్పటికీ తెలియక పోయినా,.. అప్పటి మా బడి లో తిరుగులేని కవయిత్రినై పోవడం  అప్పుడు భలే గా అనిపించింది..
అలా నేను సైతం కవితలు రాసానండోయ్ ! ..అని చెప్పగలిగానంటే,
ప్రత్యక్షంగా పరోక్షంగా నాలో ఆనాడు అక్షరాగ్ని రగిలించినదెవరంటారు?
నాకు తెలియని ఆనాటి నా పసి ఆవేశభరిత కవితల అజ్ఞాత గురువు గారు ఎవరో మీకు తెలిసిపోయిందిగా?
అక్షరాలా శ్రీ శ్రీ గారే!
***
(ఇంకా ఉన్నది)
20-2-2011
( శ్రీ శ్రీ సాహిత్యనిధి 101 వ సంచికలో ప్రచురణ కాబోతున్నది. త్వరలో. )

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

ప్రకటనలు

3 thoughts on “నిశ్చయముగ నిర్భయముగ

  1. Reblogged this on మడత పేజీ and commented:

    “ప్రత్యక్షంగా పరోక్షంగా నాలో ఆనాడు అక్షరాగ్ని రగిలించినదెవరంటారు?!
    నాకు తెలియని ఆనాటి నా పసి ఆవేశభరిత కవితల అజ్ఞాత గురువు గారు ఎవరో….”మీతో పంచుకొందామని

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s