ఒక బంగరు తళుకులా!

మా అబ్బాయిలుంగారికి అర్థరాత్రికి అటూ ఇటుగా ఎప్పుడు జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ, బుద్ధిగా కూర్చుని చదువుకొంటున్నాడు.
ఈ ఆకస్మిక పరిణామానికి కుసింత హాచెర్యపోయి, 
ఆ పై కడుంగడు సంతసించి, ఆనందంతో కళ్ళుచెమ్మగిల్లగా..
నన్ను నేనో మారు గిల్లి చూసుకొని, తెప్పరిల్లి, తేరుకొని…
కప్పునిండా  వేడి వేడి హార్లిక్స్ కలుపుకొని, వాడికి అందిద్దామని వెళ్ళానా..
మా బుద్దిమంతుడు ఈ చేత్తో కప్పునందు కొంటూ ,ఆ చేత్తో కెమిస్ట్రీ రికార్డు అందించాడు.
“అమ్మోయ్ ,ఈ పుస్తకంలో కాస్త  నాలుగు అడ్డగీతలు కొట్టి పెట్టమ్మా ” అంటూ ఆ చేత్తోనే చక్కగా చెక్కిన పెన్సిలు అందించాడు.
అడగడమే ఆలస్యం..వాడి కోరికకు మనం నిబద్దలమై  సదా అమలు పరుస్తాం కనుక , మరింత బుద్ధిగా తలూపి ఖాళీ కప్పుతో  సహా  ఆ పుస్తకం తీసుకొన్నా.
“స్కేలు కనబడలా… కాస్త చూసి తీసుకోమ్మా..”
సరేలెమ్మని ..ఇల్లంతా తిరగేసి బోర్లేయగా దొరికిన ఒక బుజ్జిస్కేలునుచేతబుచ్చుకొని  ,బరబరా గీతలు కొట్టడం మొదలుపెట్టా.
అడ్డంగా .నిలువుగా. గడులుగా.
కెమిస్ట్రీ ప్రాక్టికల్స్   అంటే  ఠాక్కున గుర్త్తోచ్చేది గోల్డెన్ స్పాంగ్లెస్ పరీక్షే. 
నాజూకు గాజు  రీక్ష నాళికలో సీసం  కొరకై పరీక్షచేస్తుంటే, తటాలున తళుకుతళుకులా బంగరు తునకలు ప్రత్యక్షం అయ్యేవి.
ఎంత అందంగా ఉండేవో!
ఎంత సేపు చూసిన ఆశ్చర్యంగానే ఉండేది.  మళ్ళీ మళ్ళీ ఆ పరీక్ష చేసి చూడాలనిపించేది. మా లాబ్ అసిస్టెంట్ సెబాస్టియన్ చిటికెడు పొడి అదనంగా ఇమ్మంటే ఇస్తేగా!
ఆ పై అందమైన నీలపు మైలతుత్తం, అదే నండీ కాపర్ సల్ఫేట్ ద్రావణం,సొగసు చెప్పేది ఏముంది.
ఇక నీలి రంగు మంటతో అప్పుడప్పుడు ఎరుపెక్కేబున్ సెన్ బర్నరు ,  కుళ్ళిన కోడిగుడ్డువాసన వేసే వాయువులు, భగ్గున  మండే ప్రాణవాయువు ..ఆమ్లాలు క్షారాలు ..ఒక్కక్కటిగా జ్ఞాపకం వాచ్చాయి.
క్రమం తప్పకుండా మా వీణాపట్వారి మేడం ఏ వారానికి ఆ వారం చేయించిన ప్రాక్టికల్స్..అక్యురేట్ అకురేట్ అంటూ నా  టీమ్మేట్  బృంద  చేసిన హడావుడి.. ఆమె చేతిపై చిందిన సల్ఫ్యూరిక్ యాసిడ్ చుక్కలు ..మా దుస్తులపై పడిన రంధ్రాలు.. రసాయనాలు చిందగా మిగిలిన రంగురంగుల మరకలు.. సన్నసన్నని రంధ్రాలు..
ఇద్దరం కలిసి సొంతప్రయోగాలు చేయబోయి భగ్గుమనిపించిన రసాయనాలు ..చిటపటలతో చిన్నపాటి పేల్లుళ్ళు.. గదంతా కమ్మేసిన పొగలు..వీణా మేడంతో తిన్న చివాట్లు..
ఆఖరికి బోలెడంత పరీక్షించేసి పరిశీలించేసి హడావుడి చేసేసి, మా అక్యురేట్  బృంద  పరిశోదించి భేధించిన లవణ రహస్యం..ఉప్పు… అని తేలినప్పుడు..పగలబడి నవ్విన  పకపక నవ్వులు..ఎలా మరిచి పోగలం?
ఆ ఉప్పునే అద్ది బృంద తో తినిపించిన దోరజామకాయ ముక్కలు రుచి ఇంకా నోరూస్తోంది.

మా రేఖ వాళ్ళంతా ప్రాక్టికల్స్ ఎప్పుడైనా ఎగ్గొట్టి “సంగీత్” లో సినిమాలకు వెళదామన్నా ..
మా అక్యురేట్ బృంద పుణ్యాన బుద్ధిగా ల్యాబులో హాజరవాల్సి వచ్చేది!

ఒక్క సారిగా ఆ గీతల్లో గడుల్లో పలకరించాయి. గలగల మంటూ జ్ఞాపకాలు.
కాలం కరిగిపోతుంది. పోతూనే  ఉంది.
 నిశ్శబ్దంగా.
కాకపోతే అవే ద్రావకాలు ప్రయోగాలు..అవే రికార్డులు పరీక్షలు..
అయితే అవేవి గతఇరవై ఏళ్ళలో  ఒక్క మారైనా అక్కరకు వచ్చినట్లు జ్ఞాపకం లేదు.
అంతగా అక్యురేట్గా నేర్చిన పాఠాలు తలలో నిలిచిన పాపానా పోలేదు. ఒక్కో మారు అనిపిస్తుంది కదా… ఇలా నిత్య జీవితంలోను  వ్యవహారంలోను అక్కరకు రాని చదువులు ఎందుకబ్బా అని.
ఏమి చేయదలుచుకొన్నామో ఆ చదువులు మాత్రం చదివగలిగే అవకాశం ఉంటే బావుణ్ణు అని.
ఇన్నేళ్ళు గా ఎలాంటి మార్పులు లేకుండా ఈ చదువులు చదువుతూనే ఉన్నాం ..
మరీ ఇప్పుడు మార్కుల చదువులు చదివే కాలం కదా..హ్యుమానిటీస్ చదివితే సమయం వృధా అని భావించే కాలం కూడాను!
దీనికి కాలమానం కొలమానం ఏమి టో   మనమో మారు పునరాలోచించుకోవద్దూ?
కొలమానం అంటే గుర్తొచ్చింది.కొలబద్ద నా చేతిలోనే ఉంది. పెన్సిలు అరిగి పోయింది. మా వాడిచ్చిన అసైన్మెంట్ పూర్తయ్యింది.
గబ గబ తీసికెళ్ళి వాడికిచ్చేసి వస్తా.
అన్నట్లు, మా బృంద ఆ ఏడాది IIT ఎంట్రన్సు లో  టాపర్ గా ఆమె ఫోటో దూరదర్షన్లో  కనపడింది.ఆ పై వివరాలు తెలియవు.ఆచూకి లేదు.బహుశా జ్ఞానజీవన స్రవంతిలో కలిసిపోయిఉంటుంది!
మా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజిలో  బృంద తో గడిపిన రెండేళ్ళ గుర్తుగా నా పాత్రలకు ఆమె పేరు పెట్టుకొని మురిసి పోతుంటాను.  బృంద కు తెలుగు రాదు. ఇక నా రాతలుకోతలు చదువుతుందనీ ..నాకు ఎప్పుడో ఎక్కడో తారసపడుతుందనీ అనుకోను .
తటాలున మెరిసి మాయమై పోయింది.
మా వీణా మేడం లాగానే.మా సెబాస్టియన్ లాగానే .మా కెమిస్ట్రీ పాఠాల్లాగానే.
నాజుకు జ్ఞాపకాల్లో ఒక బంగరు తళుకులా! 
***
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

6 thoughts on “ఒక బంగరు తళుకులా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s