పద్యం తీసుకెళ్ళి పంతులమ్మలకిస్తే ..!


మాములూగా ఇంట్లో అమ్మాయిదో అబ్బాయిదో పుట్టినరోజు వస్తే, తలంటు పోసి, కొత్త బట్టలేసి,  గుప్పెడు పంచదారో..
 గిన్నెడు పాయసమో తినిపించేసి,  
సరేననిపించే వారు  మా చిన్న తనాన.
మరీ గారాబం అయితే , కాసిన్ని గారెలు వండేవారేమో.
మా అమ్మ కాస్త ప్రజాస్వామికబద్దురాలు కాబట్టి, 
ఎవరి పుట్టిన రోజున వారికి నచ్చిన తీపీకారం వండిపెట్టేది. 
ఆ లెక్కన, ప్రతి ఏడాది మా అన్నయ్య పుట్టినరోజుకి రవ్వకేసరి,చెల్లెలు పుట్టిన రోజున పెరుగు గారెలు,నా పుట్టిన రోజున మిరపకాయబజ్జీలు ..తినక తప్పేది కాదు.  
నాకు పాలతాలికలు అరిసెలు గారెలు బూరెలు తినాలనిపించినా, లాభం లేదన్న మాట!

ఇక పోతే, పేరంటాలు చేసిన జ్ఞాపకం అయితే లేదు మరి.కాకపోతే తల మీది కాసిన్ని అక్షింతలు చల్లి ,పెద్దలంతా దీవెనలు పంచేసి ,కాళ్ళకు మొక్కించుకొనే వారు!

సినిమాల్లో పదేపదే పుట్టినరోజు పండుగలు చేసి చేసి,  ఆ వేడుకలనంటిని చూసి చూసి , ఆ పాటలు పాడి పాడి ,
ఆ పై ఆటలు కట్టి , పెరిగాం కదా..అయినా మనకూ అలాంటి పండుగలు చేస్తే బావుణ్ణు అనుకోలేదు.పైనుంచి ,అదేదో సినిమా వ్యవహారం అనుకున్నాం !
ఇక, మా ఇంట పిల్లలు మెసిలే సరికి కేకులు కొవ్వొత్తులు  రంగురంగుల బెలూన్లువొచ్చేసాయి.
బడిలో పంచడానికి ఒక చాక్లెట్ డబ్బా ,చేతబట్టి పంపితే సరిపోయేది.
ఆ పూట బడయ్యాక ,సాయంకాలం పిల్లందరినీ పిలిచి సరదాఆటలు, పాటలు ,గెలిచిన వారికి బహుమానాలు .గాలి బుడగలు  ,రంగుల కాగితాలు, అలంకరణలతో పాటు,  రాను రాను  హడావుడి కూడా పెరుగుతూ వచ్చింది.
 వచ్చిన బాల అతిథులకు  బోలెడన్ని వీడ్కోలు కానుకలు  Return gifts ఇచ్చి పంపడం మామూలయిపోయింది. 
“నా పుట్టిన రోజుకి ఏం కానుకలిస్తావ్ ?” అని వూరుకొనే కాలం కాదిది .”నా పుట్టిన రోజున ఎలాంటి కానుకలు పంచుతాను?” అంటున్నారు గడుగ్గాయిలు. 
పిల్లలను బట్టి అమ్మానాన్నలా ,అమ్మానాన్నలను బట్టి పిల్లలా అన్నది తరువాతి విషయం.
సరే, వారి వారి శక్థి కొద్దీ.. బోలెడన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు !
మరి,  మా బడిలోకి పిల్లలొచ్చాక, వారితో పాటు వారి పుట్టిన రోజు పండుగలు పట్టుకొచ్చారు. రంగురంగుల డిస్నీ బొమ్మల సంచుల్లో కానుకలు పంచాలని ఏ పాపాయి కోరుకోదు చెప్పండి?
కేకు ,చిప్స్ ,చాక్లెట్లు వగైరాల సంగతి అటుంచి, ఈ వీడ్కోలు కానుకల్లో ,ఒక్కోరిది ఒక్కో అభిరుచి.తోటి పిన్నలతో పాటు తోడున్నాం కదా ,మాలాంటి పెద్దలకూ ఈ కానుకలు అందుతుంటాయి.  అనకూడదు కానీ, 
 బుజ్జిబడి పంతులమ్మలకు ఇదొక అదనపు సౌజన్యం అన్నమాట!
సరే, మరేమయ్యిందంటే మొన్నీ నడుమ ,
మా బుజ్జి బడిలో ఒక పాపాయి పుట్టినరోజు. 
పండగే కదా అందరికీ. 
ఎప్పటిలాగానే మేము ,పిన్నాపెద్దలం కలిసి ఆ పాపాయికి నచ్చిన పాటలన్నీ పాడీ,ఆటలన్నీ ఆడి ,ఆమెకు నచ్చిన బొమ్మల కథల పుస్తకాన్ని ఆమె చేత పెట్టామో లేదో…పుచ్చుకొంటినమ్మ వాయినం అన్నంత సంబరంగా ,మాకూ ఒక కానుక ఇచ్చింది. 
ఆందరు పిల్లల్లాగానే ,తీపో కారమో ,పెన్నులో పెన్సిళ్ళో,బంతులో బొమ్మలో.. ఇచ్చిందిలెమ్మనుకుంటాం కదా.
 మా బుజ్జి భవ్య కీర్తన ఇచ్చిందేమిటో తెలుసా?
ముచ్చట గొలిపే తన బొమ్మలతో బాటు,
తలా ఒక తెలుగు పద్యం!
అందుకేనండి,
పద్యం తీసుకెళ్ళి పంతులమ్మలకిస్తే ..!
ఏమవుతుంది?
ఇదుగోండి ఇలా,
గోడల మీదకెక్కుతుంది !
మీ అందరి ముందుకీ వస్తుంది!
భవ్యకీర్తనకూ,  “సృజనాత్మకంగాను అమూల్యంగాను  వీడ్కోలు కానుకలివ్వచ్చును సుమా “అని ఒక సద్భావనను 
వెలిగించిన భవ్య అమ్మానాన్నలకు జేజేలు!
భవ్య కీర్తన బోలెడన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి!
అందరికీ తెలుగు పద్యాల విందులు ఇవ్వాలని,
నాతో పాటూ మీరూ కోరుకోరూ మరి ?
శుభం!
***
మీకు కుదిరితే ,మరొక వీడ్కోలు కానుకల  మాంత్రికుడి గురించి ఇక్కడ చదవండి మరి!

   http://chandralata.blogspot.in/2009/11/blog-post_16.html

***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

2 thoughts on “పద్యం తీసుకెళ్ళి పంతులమ్మలకిస్తే ..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s