కొత్తగూడెం ఫర్మానా !

ఉండబ్బా! కాస్త ఈ బొమ్మేసి వస్తా !  

నవంబరు నెల రాగానే ,..

 ఎక్కడెక్కడి పిల్లలు …
ఆ పిల్లలను వెన్నంటి ఉండే అమ్మానాన్నలు, పంతుళ్ళు పంతులమ్మలూ, బడులూ సంస్థలు …
బోలెడంత హడావుడిగా “కళ కళలాడుతూ” ఉంటారు.
బ్రష్షులు కడిగేస్తూ.  పెన్సిళ్ళు చెక్కేస్తూ.రంగులు కలిపేస్తూ. కాగితాలు పులిమేస్తూ
అంతేనా, పాటలు పాడేస్తూ. ఆటలు ఆడేస్తూ.
నాట్యాలు చేసేస్తూ.నాటకాలు ఆడేస్తూ. సినిమాలు చూసేస్తూ.
బహుమతులు సాధిస్తూ. కానుకలు పోగేస్తూ.
చేయ గలిగిన వారికి చేయగలిగినంత !
అవునండి.
పిల్లలపండుగ రోజులివి!
ఏడాదంతా ఏమరుపాటుగా ఉన్నా , అంతోఇంతో పిల్లలలోని సృజనశీలతను గుర్తించాలనీ,
ప్రోత్సహించాలనీ, గౌరవించాలనీ….
 ఎందరో అనుకొనే రోజులివే.
సరే, ఆ విషయం అలా ఉంచేసేస్తే,
మా చిన్నతనాన మా వూల్లో రాములవారి పెళ్ళి జరిగేది. ప్రతి  వేసంకాలం.
వూరు వూరంతా నడుం బింగేది.
చెరువు గట్టున ఖాళీ స్థలంలో పందిళ్ళు వెలిసేవి.
గుంజలు ఇచ్చేవారు గుంజలు ఇస్తే,వాసాలు తెచ్చేవారు వాసాలు తెచ్చేవారు.
తాటాకులు కొట్టుకొచ్చేవారు తమ పొలం గట్లెమీది చెట్లు కొట్టుకొచ్చేవారు.పురికొసల దగ్గర నుంచి దబ్బనం దాకా ఎవరో పిలిచి చెప్పినట్లు ఎవరిపాటి వారు ఎవరు తీసుకురాగలిగింది వారువెంటపెట్టుకుని వచ్చారు.
 పాలుపెరుగు , ఉప్పు పప్పు , పెరట్లో కాసిన కాయగూర, పొలాన పండిన కొత్త పంటా,
ఎవరికి తోచినంత వారు తెచ్చి వంట పందిట్లో చాప మీద గుమ్మరించే వారు.
గరిటె తిప్పినమ్మ గరిటె తిప్పతే, అన్నం వార్చే పెద్దమనిషి అన్నం వార్చేవాడు. ఇక అమ్మలక్కల సంగతి  చెప్పక్కరలేదు. సందడే సందడి !
కత్తిపీట చేతపట్టుకొని ఒకరొస్తే, గుమ్మడికాయ మోసుకొంటూ మరొకరు వచ్చేవారు.  కూర్చునే పీటలు ,పరుచుకొనే వెదురు చాపల దగ్గర నుంచి వండే కాగుల దగ్గరనుంచి వడ్డించే విస్తరి దాకా ..ఎసట్లో బియ్యం నుంచి వండి వరిగడ్డీ పై వార్చిన వేడి వేది అన్నపురాశుల దాకా, పరమాన్నం నుంచి గారెలు పూర్ణాలదాకా …. వడపప్పు ,చలిమిడి  కొబ్బరి ముక్కలతో పాటు సిద్ధం చేసి ఉంచి, పానకం బిందెల దాకా.. అబ్బో..చెపుతూ పోతుంటే రామాయణమై పోయేట్టుంది!
ఇక, ఎవరైనా కాస్త  ఏమరుపాటుగా ఉంటే,
 “ ఒరేయ్ , ఆ వాగొడ్డు చిట్టెమ్మ గారి చిన్నబ్బాయ్ కనబడలేదేట్రా… ఊళ్ళో ఉన్నాడా? ఎళ్ళి ..ఇట్టా కేకేసుకురా!”
అంతే…!
ఇక  అతను రాకుండా ఎక్కడికి పోతాడు?
ఇక అత్తాకోడళ్ళ వ్యహారాలు  కూడా చూడాల్సిందే,
“ అక్కాయ్ మరే… మన కాలువ గట్టు శేషాయమ్మ చిన్న కోడలిని చూశా…బీరకాయ చేదన్నా చూడకుండానే , పచ్చడి నూరేసిందంటగా!”బుగ్గలు నొక్కుకొంటూ ఒకావిడ ఉవాచ.
” అయినాగానీ  ఆమ్మాయ్ ..అట్టాగేనంటే పులుసులోకి ముక్కలు కోసేది ?””
కొత్త కోడలిగారికి ట్యుటోరియల్ ప్రారంభం!
కావిడి భుజాన వేసుకొని కాలువ నీళ్ళు తెచ్చి పోసేవాళ్ళు పోస్తుండగా, పానకం , వడపప్పు కొబ్బరిముక్కలను అల్లరిపిల్లల బారి నుండి కాపాడే వారు కాపాడుతూ ఉండే వారు.
ఊరబంతులు. వంటలు వడ్డనలు .
ఎంతో సరదాగా ఉండేది.
ఎవరికి వారే వాళ్ళింట్లో అమ్మాయి పెళ్ళా అన్నంత హడావుడి. సంబరం. సంతోషం.
అదండీ దేవుడి పెళ్ళికి ఊరంతా సందడి!.
ఇదంతా మీకు అభూతకల్పనలాగానో .. ఏ “రైతుకుటుంబం”” పల్లెటూరి పిల్ల” తరహా పాత సినిమా క్లిప్పింగ్ లాగానో అగుపడవచ్చు బహుశా!
అందులోనూ ఈ మధ్యనే వీధివీధిలో వినాయకచవితి పందిళ్ళు సృష్టించిన  అర్హ్ద శబ్దకాలుష్యాల వడదెబ్బ నంచి ఇంకా తేరుకోక పోతిమి!
ఇచ్చిన చందాలు  పారుతోన్న నీళ్ళలోకి విసిరేసిన చిల్లరనాణాల్లా ఎటుబోయాయో!
                

  బాలోత్సవ్ లో బొజ్జగణపయ్య ఊరేగింపు
రికార్డు డ్యాన్సులు .. సినిమాపాటలు , మందులచిందులు ,వగైరాల మధ్య పాపం ఆ బొజ్జ గణపయ్యే బిక్కచచ్చిఫోయి,కిమ్మనకుండా వూరిచివరి కంపుచెరువులో మునిగిపోయాడు!పోన్లేండి ఎవరి పుణ్యాన వారు !
ఇంతకీ, ఈ పిల్లల పండుగ పూట నేను చెప్పొచ్చేదేంటంటే..
అచ్చంగా మా చిన్నతనాన మేమెరిగిన ఆ అచ్చమైన పల్లెల్లో రైతుల సంస్కృతి లోని నిబద్దత, ఉమ్మడి భావన, సమిష్టి కృషి, క్రమశిక్షణ, మర్యాద, మనిషుల పట్ల గౌరవం ఇవీ అవీ ఇంకెన్నో ఒక్క చోట కుప్పజేసి చూసినట్లయ్యైంది. మరుగై పోయిన ఆ వ్యవసాయ సంస్కృతి మళ్ళీ కనబడింది. మన కొత్తగూడెంలో!బొగ్గు గనుల్లో పుట్టిన విద్యుత్ తేజం …ఏమేరుగనంట్లు రాష్ట్రమంతా విస్తరిస్తొంది! 
కాదు కాదు … రాష్ట్రాన్నంతా తనలోకి సమీకృతం జేసుకొంది
!ఒకటా రెండా ఇది ఇరవై రెండేళ్ళ సంస్కృతి!
 ఇంతటి మహత్కార్యానికి మూలకర్త డా.రమేశ్ బాబు గారు  . వారుఎప్పుడు మైకు ముందుకు  వచ్చినా అమ్మో మరొక ఉపన్యాసమేమో అని అనుకుంటామా, ఆయన ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఒక కథ చెప్పడం మొదలెడతారు!
 పిల్లలని గౌరవించడం, ఆప్యాయంగా చూసుకోవడం ఆయన లోని పసితనాని పచ్చబరచి ఉంచాయేమో !
డా.నరేంద్ర గారు,శర్మ గారు, ఒకరా ఇద్దరా .. ఆ వూరు వూరంతా నడుం బిగించి అక్కడ నిలబడతారు.
ప్రతి ఇల్లూ వచ్చిన అథిథులను అక్కున చేచుకొంది.
మాధవరావు గారు నడుం బిగించి , వచ్చిన ప్రతి బిడ్డకు వారి వెంట ఉన్న పెద్దలకు ,వేడి వేది కమ్మటి భోజనం వడ్డిస్తూ ఉంటారు.
 అలాగని వారేదో పాకశాస్థ్ర నిపుణులనుకొనేరు. వారొక బాధ్యత గల బిజీ  చార్టెడ్ అకౌంటంట్ !
 రమేశ్ గారేమో శస్త్రవైద్య నిపుణులు.నరేంద్రగారు ప్రముఖ వైద్యులు.
ప్రతి వారి వారి రంగాల్లో తల మునకలయ్యేంత  పనుల్లోమునిగిపోయే వారే!
అన్ని ఊళ్లలాగానే కొత్త గూడెం లోనూ ఒక ఆఫిసర్స్ క్లబ్ ఉండడం ,
ఆ వూరి పెద్దమనుషూలంతా చేరి పేకముక్కలు కలపడం ,
అది కుటుంబాలపై చీకట్లను గుమ్మరించడమూ …
మామూలుగానే జరుగుతూ ఉండేది. 
అక్కడున్న టెన్నిస్ ,షటిల్ కోర్టులతో పాటు, మంచోచెడో  అనేక మంది  మగవాళ్ళంతా ఒక చోట చేరేవారు. ఈ  నేపథ్యంలో   డా.వాసిరెడ్డి రమేశ్ గారు  ఆ క్లబ్ కు సెక్రటరీగా  ఎంపిక కావడం ,వారిలో ఒక ఆలోచన రావడం. , వారు సభ్యులందరినీ  నచ్చజెప్పి,  పేకాటలో వచ్చిన వార్షిక ఆదాయంలో  కొంత పిల్లలకై వెచ్చిచేట్టుగా అందరినీ వప్పించడమూ.. ఆ పై అంచలంచెలుగా  క్లబ్ ప్రాంగణం…. ఈ నాడు సుమారు పదమూడు వేల మంది పిల్లలు వారి అమ్మనాన్నలు ఉపాధ్యాయులు కళకళలాడుతూ తిరుగాడిన , ఒక అద్బుత  కళాక్షేత్రంగా  రూపొందడం .. ఇదంతా జగమెరిగిన  సత్యం!
   ఆట విడుపు

అందుకేనండీ , వేమన్న ఘంటకొట్టి మరీ చెప్పింది! 

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని. 
ఎవరు ఎలాంటి మార్పుకు స్పూర్తి అవుతారో …
ఎలాంటి ఉదాహరణలుగా నిలబడుతారో ..!
వారి సంస్కారానికి  ఇలాంటి కార్యక్రమాలొక ఒక ప్రముఖ  ప్రకటనే కదా!
డా. వాసిరెడ్డి రమేశ్  గారి కీ వారి బృందానికి జేజేలు. 
మాధవ రావు గారికి ధన్యవాదాలు.
అన్నదాతా సుఖీభవ అన్నట్లు.                                                                                                                              
కొత్తగూడెం వాసులందరికీ …నమస్సులు.
ఇది మీ సభ్యతా సంస్కృతి.!
పదికాలల పాటు పచ్చగా సాగాలని కోరుకొంటూ…
పిల్లలపండుగ శుభాకాంక్షలు.
**
 ఏమండోయ్ ! వినబడుతోందా?


అయ్యలారా…

అన్నలారా..
మరి మీరిది విన్నారా?
మీ వూరి క్లబ్బు ను ఏమి చేయదలుచుకొన్నారు?
తరతరాల బూజు దులపడానికి నడుం బిగించ గలరా మహాశయులారా….?!?
అదే మన కొత్తగూడెం వాసులు మనకు పంపుతున్నా ఫర్మానా !
వేలాది చిట్టిచేతులలో వారు పెట్టి పంపిన నిమంత్రణ్ ! 
తరువాయి కార్యక్రమం మీ ఇంటినుంచే ప్రత్యక్ష ప్రసారం!  మీరే కర్తా కర్మా క్రియా ! 
మరొకమారు ,పిల్లలపండుగ జేజేలు!
ఊరుకేంచొచ్చినా ! 

రండి రండి రండి! దయ చేయండి!
                                                తమరి రాక మాకెంతో ఆనందం సుమండీ! 
Add caption
ఏం చేద్దామబ్బా ?

 

                                                 

రిషీవ్యాలీ పల్లెబడి పిల్లల తోలుబొమ్మలాట  


రిషీవ్యాలీ పల్లెబడి పిల్లలతో ఉపాధ్యాయులతో
,డా.వాసిరెడ్డి రమేశ్ గారు, ప్రఖ్యాత సినిమా దర్శకులు బి.నర్సింగ్ రావు గారు,వారి శ్రీమతి. 

బాలోత్సవ్ 201 ముఖ్య అతిధి చిన్నారి  రచయిత్రి నిధి ప్రకాష్.
ప్రకృతి ప్రేమికులు రాయి వెంకటప్ప గారి ఔషధ మొక్కల ప్రదర్షన , పంపిణీ.
***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
ప్రకటనలు

One thought on “కొత్తగూడెం ఫర్మానా !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s