పసుప్పచ్చ బుడగ

(  budaga   ఆంధ్ర జ్యోతి ఆదివారం (29 నవంబర్ 2015)లో  ప్రచురితము.)

***

” వంటరి గా ఏం చేస్తుంటావ్ ? “ ఎవరయినా అదాటున  అడిగితే, వసుధ ఏమీ చేయకుండా, మరింత నిశ్శబ్దంగా చూస్తుంది.

వెలుగుల పగలులో పనులన్నీ ముగిసాక, ఆ వంటరి ఇంట్లోకి… వసుధ వంటరిగానే నడిచి వెళుతుంది.

పగలంతా వళ్లంతా పూసి పూసి అలసిపోయిన వాకిట్లోని వంటరి మందారం చెట్టు , మంకెనపూల మొక్క అలసిసొలసి వాడుమొహం వేస్తాయి. వాటికి తోడు ఆవెనకగా ఉన్న వంటరి పారిజాతం చెట్టు, వాటి వాలకం చూసీ చూడగానే ఉసూరుమనిపించి, వసుధ ముఖాన అలసట మాయమవుతుంది. ఇంటి తాళమయినా తీయకుండా, ప్రహరీగోడవారగా ఉన్న కొళాయి తిప్పి,  నీటిజల్లుల్లో అలసిన పూలమొక్కలని జలకాలాడిస్తుంది.  ఆ కొద్దిపాటి నీటిజల్లులకే    కడిగిన ముత్యాల్లా కళకళలాడుతాయి.  ఇక,  పారిజాతమేమో మౌనంగా  తన హృదయాకారపు కాయలను  నేలపై రాలుస్తుంది. ఎంత కృతజ్ఞతో దోసెడు నీళ్ళు అందించిన భాగ్యానికి !

రాలిన పూలను, పచ్చటి హృదయాలనూ భద్రంగా తీసుకొని, వసుధ వంటరి ఇంటి గుమ్మం వైపు నడుస్తుంది.     వసుధ  దగ్గర ఒకే ఒక్క తాళం చెవి ఉంది.  ఆ తాళం తీసినప్పుడల్లా, ఏదో మార్మికలోకపు లోహ ద్వారబంధాలను తెరవ బోతున్నట్లుగా  అనిపిస్తుంది .

వసుధ తన సంశయానికి తనే నవ్వుకొని, ఆ వంటరి సాయంకాలం తలుపు తీసీ తీయగానే,  విశాలమైన గదిలో నిశ్శబ్దంగా నిస్తేజంగా పరుచుకున్న వంటరితనం.

ముదురు సెనగ పువ్వు రంగు సోఫాలు, వాటి వెనకగా వేళ్ళాడుతున్న మీగడ రంగు తెరలూ, చుట్టూ గోడల మీద పిల్లలు గీసిన బొమ్మల ఆనవాళ్ళు . గాజు పలకల టీపాయి మీద  వన్నె తగ్గిన ఇత్తడి గిన్నె అడుగున ఎన్నడో పిల్లలు దాచిన గవ్వల రంగులు  తప్పించి ,అన్నీ వంటరిగానే ఉన్నాయి. వసుధ వాడిన పూలను తీసి , తన  చేతిలో పూలను అమర్చింది.

వంటింటిలోకి వెళ్ళి గుక్కెడు చల్లని నీళ్ళు గొంతులో పోసుకుంది. సగం తెరిచిన ఫ్రిడ్జి తలుపులోంచి ఒక్కో బుడగ బయటకు రాసాగింది. రోజూ ఇదే తంతు !

ఒక్కో సారి పుస్తకాల అరలోనుచి , మరోసారి ఉతికి దొంతరలుగా పెట్టిన బట్టల్లోంచి, మరోసారి తళ తళలాడే  గాజు పూసల షాండిలియర్ల లోంచి బుడగలు రావడం మొదలవుతుంది. ఎన్నో సార్లు, సరిగ్గా ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా తెలియకుండానే , రావడం మొదలు పెడతాయి. చిన్నచిన్నవి. పెద్ద పెద్దవి.

వసుధ కనురెప్ప పాటులో ఇల్లంతా నిండిపోతాయి. అంగుళం ఖాళీ లేకుండా.  గాజుగోళీల్లాంటి నీటి బుడగలు.

పిల్లలు ఖాళీ చట్రాన్ని సబ్బు నీటి నురగలో ముంచి , చిట్టి బుగ్గల నిండా గాలి నింపి ఉఫ్ మంటూ ఊదితే, గాల్లోకి, పై పై కి, వరసలు వరసలుగా తేలి వస్తాయే , సరిగ్గా అలాంటి మిల మిల మెరిసే బుడగలు.

తన చుట్టూ కిక్కిరిసి పోతోన్న బుడగల తాకిడికి  ఉక్కిరి బిక్కిరవుతూ ,తిరిగి బయటి గాలులు పీల్చు కోవాలనీ , వెలుగుల్లోకి నడిచి వెళ్లాలనీ ,  వసుధ  వీధి గుమ్మం వైపు చూసింది.

అప్పటికే, తలుపు గొళ్ళెం మీదా, తాళం కప్ప మీదా, ద్వారబంధమంతా పరుచుకొన్నాయి బుడగలు.   వసుధ కాలు మెదపడానికి సందే లేనట్టుగా!     ఆ  బుడగల అంచుల్లో…లేత వెలుగురేఖలు సప్తవర్ణాల్లా విచ్చిన్నమయిపోతున్నట్లుగా … పట్టుశాలువాలు కప్పుకొన్నట్లుగా ఇంద్రధనుస్సులు!

ఇది కలా నిజమా ?  భ్రమా  విభ్రమా? ప్రతి పూటా వేసుకొనే ఈ జవాబు ఆశించని ప్రశ్నలను దాటుకొంటూ , ఆమె లోలోనుంచి ఒక నిట్టూర్పు తేలివస్తుంది.  నిశ్శబ్దంగా.

సరిగ్గా అలాంటప్పుడే, “జీవితము బుద్బుదప్రాయం “అని  అనాలనిపిస్తుంది.  కానీ, “జీవితము బుడగల మయము ” అని అనేస్తుంది వసుధ. తనకు తెలియకుండానే.

వసుధ మెల్లిగా తేరిపార చూసి , ఒక సారి ఆ బుడగల్ని  స్పృశించాలనీ,  తన కొనగోటి మీద ఆ బుడగల్ని నిలబెట్టాలనీ,   అవి చెప్పే  తీపి మాటలు చెవులారా వినాలనీ, అవి చూపే హరివిల్లులు కళ్ళారా చూడాలనీ   అనుకొంటూంది. తూనీగల రాక కోసం  అంత అల్లరినీ కట్టిపెట్టి , బుద్ధిగా  ఎదురు చూసే పిల్లల్లా , నిశ్శబ్దంగా   ఆ బుడగల్ని చూస్తూ కూర్చుంటుంది. ఎప్పటికో ఒక బుడగ  వసుధ కొన గోటి పై వచ్చి వాలుతుంది. తన ఊపిరి తాకిడికే ఎక్కడ తల్లడిల్లి పోతుందో ఆ వగలమారి బుడగ ! అని మురిపంగా విసుక్కొంటూ,  చిరుగాలి అలలకు రెపరెపలాడుతోన్న ఆ వన్నె చిన్నెల బుడగలోకి విస్మయంగా చూస్తూ కూర్చుంటుంది.  అచ్చం చిన్న పిల్లలాగానే!

ఎంత వెతికినా ఏముంటుందక్కడ?    శూన్యం. వట్టి శూన్యం.  అయినా,  ఆ బుడగల శూన్యంలో పాలపుంతలకోసం వెతుకుతుంది.    వసుధను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, ఒక్కో మారు ఆ శూన్యంలో తెలిసిన మనుషుల రూపాలు ప్రత్యక్షమవుతాయి. తమ లోకాలలోకి తమ  కాలాలలోకి వసుధను అలవోకగా లాక్కుపోతాయి.

పెద్ద పెద్ద కళ్ళ తేట ముఖంతో చిన్ని వసుధ. బిగించి కట్టిన రెండు జడల చివర్లలో ముడి వేసిన ఎర్ర రిబ్బన్ల రెపరెపలు. ముఖమంతా పరుచుకొన్న ముసి ముసి నవ్వుల వెలుగుల తడి. చేతిలో నురుగులు నిండిన అప్పుడే పిండిన పాల తపేళా.

“అమ్మాయ్ ! గట్టెక్కేటప్పుడు గడప దాటేప్పుడు  జాగ్రత్త తల్లీ ! ఎదురుదెబ్బ తగిలిద్ది  ! చూసుకొని నడువమ్మా ! ” వెనకాల తాతయ్య మురిపాలతో నిండిన జాగ్రత్తలు.

” ఇట్టాంటి ఓబద్దరపు తాతామనవరాళ్ళని ఎక్కడా  చూళ్ళేదమ్మా ! ” బుగ్గలు నొక్కుకొంటూ అమ్మమ్మ వెక్కిరింపులు.

“అమ్మాయ్ కనుక్కోమ్మా , ఏకాడికి పయనమయ్యిందో ఏయే దేశాలు చుట్టొచ్చిందో ముసలమ్మ !”తాతయ్య పరాచికాలు.

” తిప్పాడుగా మీ తాత… మహా ! గాడి పొయ్యి చుట్టూ..మజ్జిక్కవ్వం చుట్టూ … గొడ్లచావిడి చుట్టూ ,తిరగలి చుట్టూ , గిర గిరా! ఇంకే లోకాలు సూడాలి సంబడం బద్దల్లయ్యి !” అమ్మమ్మ మూతి ముప్పైవంకరలు తిప్పుతూ కొంగు విదిలించి నడుంలో దోపుకోవడం.  ఆ వాలకం చూసి తాతా మనవరాళ్ళ పకపక నవ్వులు.  పరిగెత్తుకెళ్ళి అమ్మమ్మ కాళ్ళను చుట్టేసింది ” అమ్మాయ్ వదులూ, బాగానే ఉంది సంబడం ! అక్కడ పాలు పొంగి పోవూ ..పదపద..! ”

“నేనెప్పుడో పొయ్యి మీద నుంచి దించేసాగా !” కళ్ళు తిప్పుకొంటూ అంది వసుధ.

” చూస్తుంటే పల్లెటూరి గబ్బిలాయిలా తయారయ్యేట్టుగా ఉంది ! పట్నం బళ్ళో చేర్చాలి ! ” ఎక్కడి నుంచో గుసగుసల గొంతు.    అమ్మదో నాన్నదో !

వసుధ చటుక్కున అమ్మమ్మ కుచ్చిళ్ళలో దూరింది.

వసుధ చుట్టూ ఒక నిశ్శబ్దం ఆవరిచింది. ఒక శాంతం. ఒక నమ్మకం. ఒక సంతోషం.

వాలి పోతున్న పొద్దుల్లో ,తేలి వస్తున్న పిట్టల పాటల లయ .చావిళ్ళకు మళ్ళు తున్న బసవన్నల మెడలలో మువ్వల పట్టీల సవ్వడి. వసుధ మెల్లిగా నిద్రలోకి వొదిగింది.

తనే ఒక మొగ్గలా ఆ పసుప్పచ్చని బుడగలోకి ముడుచుకు పోయింది. ఆ పచ్చదనం ఆ పసితనం. ఆ రోకటీపోట్ల లయ, అమ్మమ్మ చేతి మట్టిగాజుల తాళం. చితుకుల మంటల గాడి పొయ్యి. ఉడికీ ఉడకని పాలతాలికల కమ్మదనమూ , నోరంతా నిండిపోయింది.

ఆ నిద్రలోనే , బలిష్టమైన చేతులు , తనను భుజాన వేసుకొని పట్నం బండెక్కించాయి. కళ్ళు తెరిచే సరికి , ఆ పొద్దు వెలుగుల పసుప్పచ్చ బుడగ  నిశ్శబ్దంలో వంటరిగా నిశ్శబ్దంలోకి ఒదిగిపోయింది. దాటి వచ్చిన పల్లె కలలతో మట్టివాసనలతో నిండిన బంగారం లాంటి పసుప్పచ్చ బుడగలో దూరి, పట్నవాసం  మొదలయ్యింది.

ఓ అక్షరం చినుకు తాకగానే , కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం. ఆ పసుప్పచ్చ బుడగ    పగడాల చిగురాకుల నునులేత రెమ్మల రంగులద్దుకోసాగింది. చిలకపలుకుల ముచ్చట్లతో ఆకాశం  అంచుల్లో వెలుగు చుక్కల ముగ్గులేయ సాగింది.  ఆ అక్షరాల ఆణిముత్యాలసరాల వానలో తడుస్తూ,   వసుధ మెల్లి మెల్లిగా కళ్ళు విప్పార్చి,  తన చూపును  చుట్టూ సారించ సాగింది.    ఎంత పెద్దదో ఈ లోకం !    ఎన్నెన్ని వింతలూ విడ్డూరాలు ఉన్నాయో ! నేర్చినమ్మకు నేర్చినంత !

తెల్లని తామరల పీట ఎక్కి కూర్చున్న చదువులమ్మ వెన్నెల సోనల వీణ పాట వినసొంపుగా వసుధ చెవిని తాకింది. వంటరి వెలుగుల బాట ఒకటి  కన బడ సాగింది. దాని మొదట్లో నిలబడి, అడుగులో అడుగేస్తూ ,బడి మెట్లెక్కింది. దారంటా పెరిగిన చెట్టు నీడల్లో సేద తీరుతూ ,రాలిన పండ్లను రుచిచూస్తూ ఒక్కో అడుగు  ముందుకు సాగింది. ఎందుకు ఏమిటి ఎలా … బుద్ధి పదునెక్క సాగింది. హృదయంతో పదాల పాటలు వినడం నేర్వ సాగింది. అప్పటికే ఆ బాటను సాగుతోన్న గొంతులెన్నో  వసుధ పాటకు తోడయ్యాయి.

కనకాంబరాలు కారబ్బంతులూ నాటేస్తూ , పాదులు తీస్తూ ,నీరు పోస్తూ , అమ్మ సన్నగా పాడుకొంటొన్న పుష్పవిలాపం , తెల్లవారక ముందే మందార మకరందాలు ఆస్వాదిస్తోన్న నాన్న గంభీర స్వరం , బడిలో కథలతో మడిచి చెపుతోన్న పాఠాల పచ్చదనం.  పగడాల మావి చిగురాకుల కమ్మదనాన్ని చిన్ని కంఠంలో నింపాయి. కొత్త గాలి పొసుకొన్న పసుప్పచ్చ మొగ్గ , సూర్య కాంతిలో తడుస్తూ విచ్చుకోసాగింది. రాలిన పూలతో పాటూ ఒక్కో పదాన్ని పదిలంగా పట్టు కొంటూ, పట్టు దారాల పల్లెపాటలు అల్ల సాగింది.ఆ చిలకాకు పచ్చ బుడగ పైర గాలిలా మెల్లగా సాగుతూ వచ్చింది. ఆ చిన్ని గొంతులోని చిట్టి రాగం తుమ్మెద రెక్కలు తొడుక్కొని , వసుధ పాట లోకమంతా ఒక మారు చుట్టేసి వచ్చింది. మెత్తని  గుండెల్లో ఆనందపు విత్తులు నాటి వచ్చింది.కారుమేఘాల అంచుల్లో వెండితీగల్ని కురిపించింది. బడి గడపను బంగరు తేరుపై దాటింది.కళ కళ లాడే కళాశాల ఆవరణలో మెరుగు పూల మొక్కయింది. ఒక్కో కొత్త భావన ఒక కొత్త పాటలా చుట్టూ పరుచుకోసాగింది. ఆ పదహారు వన్నెల  తేనె చినుకుల బుడగ మెల్లిగా , కూని రాగం తీసింది. ఆ పాట ఏ తీరాన్ని చేరిందో…. ఏడేడు లోకాల కావల  ఏ చెవిన పడిందో …!

ఆమె పాట ఆకాశాన్ని తాకక ముందే  ఇంటి గడప ముందు, పంచ వన్నెల రామచిలక వాలింది.పదహారు కళల పూర్ణమ్మ ఫక్కున్న నవ్వి , పాటల దుప్పటి కప్పేసి  , అక్కున చేర్చుకొంది. రామ చిలక రెక్కల పల్లకీ వేసింది. పండిన దొండపండు రంగు బుడగ తీపి పాటలు మోసుకువెళ్లింది.

వసుధ గొంతు సవరించుకొంటూ, తన పాటలను తనే వెతుక్కొంటూ, ఛుట్టూ ఆవరిస్తోన్న బుడగలని విస్మయంగా చూడసాగింది.

ఈ బుడగలు ఒక చోట  స్థిరంగా ఉండవు. ఒక దాన్ని ఒకటి తోసుకొంటున్నాయ్!  ఒక దానిని మరొకటి మోసుకొంటున్నాయ్! ఇల్లంతా కిక్కిరిసి పోతోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో ! అబ్బో ! ఆ బుడగల్లో బుడగలు కలిసిపోతాయి. బుడగలతో బుడగలు దోబూచులాడుతాయి. గది నాలుగు మూలల నడుమ నాలుగు స్థంబాలాటలాడుతాయి.

వసుధ ముఖాన  సన్నని నవ్వు లా తేలివచ్చింది ఓ పచ్చని తోరణం లాంటి బుడగ. పంటవేళల్లో  ఊరంతా అలలు అలలుగా పరుచుకొన్న సన్నాయి పాటలా.

పసుపుకొమ్ము కట్టుకొన్న ఓ చెయ్యి వసుధ చిటికిన వేలు పట్టుకొని అమాంతంగా తనతో లాక్కెళ్లింది. దొంతరమల్లెల పందిరి బుడగ  లోలోపలికి. అల్లిన  కొబ్బరాకుల పచ్చని స్థంబాల చుట్టూ వేలాడేసిన విచ్చిన ముద్దబంతి పూలగుత్తులను దాటుకొంటూ, పట్ట పగలు  ఆకాశంలో  నక్షత్రాలని చూపించింది. కొత్త పెళ్లికూతురి వాలిన కనురెప్పలపై విరిసిన కలల  ఇంద్రధనుస్సుల బుడగ  ఎక్కడకు కరిగిపోయిందో!

ఇంతలోనే, తొలి బిడ్డను పొత్తిళ్ళలో చూసుకొంటున్న అమ్మానాన్నల మురిపాలను మోసుకొచ్చిందొక బుడగ. పాపాయి పక పక నవ్వుల బుడగ దానిని తోసుకొని ముందు కొచ్చింది. ఒక బుడగలొంచి ఇంకొక బుడగలోకి చిట్టి తల్లి పరుగులు పెడుతూ పాల బువ్వలు తింటోంది. వచ్చిరాని మాటల పాటలు. ఆ వెనకగా పరుచుకొన్న వెచ్చటి నిశ్చింత.  ఆ నాన్న  గుండెల మీద చిట్టికాళ్ళ చిందు పాట. ఆ బలిష్టమైన భుజాల మీద కెక్కిన కేరింతల హోరు.   ఆ ఆనందాల బుడగలన్నీ చూస్తూ చూస్తూనే చిత్రంగా ఆవిరయిపోతూ మాయమయిఫొతున్నాయి.     చిట్టితల్లి అక్కయిన బుడగ ,చిన్ని తమ్ముడితో పోటానుపోటీగా  నీళ్లల్లోకి వదులుతున్న కాగితం పడవలు,  ఆకాశం లోకి ఎగరేస్తున్న గాలిపటాలు, కలిసి పాడుతోన్న చిట్టిపాటలు, గీసిన ముగ్గుల్లో నింపుతోన్న రంగు పులుముతున్న ఇసుక రేణువుల్లా … గాలికి  రంగు రంగుల బుడగలు అదాటున తేలి వస్తున్నాయి.

ఒక్కో  వాన చినుకుల  బుడగ , ఒక్కో వెన్నెల ముద్దల బుడగ , ఒక్కో సన్నజాజుల బుడగ , ఒక్కో సంపంగి పరిమళాల బుడగ, మెల్లి మెల్లిగా కరిగి పోతూ , నిశ్చింత నుంచి నిశ్శబ్దం లోకి , నెమ్మది నెమ్మదిగా ఒదిగిపోతూ , కాలంలోకి కరిగి పోతున్నాయి. నిశీధి సంద్రంలో మునిగి పోతూ, అలల తాకిడిలో చెల్లాచెదురుగా తేలిపోతూ, ఇసుక పిట్ట గూళ్ళ మీద వాలిపోతూ, రంగుల చీరలు ఛుట్టుకొన్న  బుడగలు. వసుధ  నవ్వును పొట్లం లా చుట్టుకొంటూ, వసుధ చుట్టూ నీరయిపొతూ కరిగిపోతున్నాయి.

పలుచని పట్టుదారాలతో అందంగా నేసిన విచ్చిన నెమలి పింఛం లాంటి ఆ పచ్చని కాపురం బుడగలో ,  నిశ్శబ్దంగా ఓ  భారీవిస్ఫోటం. చూస్తుండగానే , ఆ సప్తవర్ణాలు చెల్లా చెదురుగా వచ్చి పడ్డాయి .వసుధ చుట్టూ . ఖండఖండాలుగా విచ్చిపోయి.

ఆ జేగురు రంగు బుడగలో కమ్ముకు వస్తున్న చీకట్లను ఎత్తి చూపుతున్నట్టుగా , ఓ మంద్ర స్వరం. గంభీరంగా . వాస్తవం ఇది సుమా అని చెప్పబోతున్నట్టుగా. వృత్తి నైపుణ్యం ఉట్టిపడుతూ , మర్యాదగా పలికింది.

“క్షమించండి,  మిసెస్ రాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము మనిషిని ఊపిరితో అందివ్వ గలం.కానీ…” ఆ వైద్యస్వరం లో గంభీరం ఉట్టిపడింది.

వసుధ ఒక నిశ్చేష్ట భావనలో మునిగిపోయిఉంది. అతనికి ఇక ప్రమాదం లేదు అన్న మాట మెల్లిగా ఆమె లోలోనికి ఇంకుతోంది.

“మనిషి ఇక గట్టెక్కినట్టే ! కాకపోతే…. ”

” కాక పోతే …?!?”  వసుధ గుండె చిక్కబట్టుకొని , భయపడుతూ అంది.

“కాక పోతే, ఈ ప్రమాదం మిగిల్చిన వైకల్యాల వలన ,ఇతర సమస్యలు రావచ్చు!”

“ఇతర సమస్యలా?”

“ఇతర సమస్యలే. అనూహ్యంగా విరుచుకుపడ్డ  ఆ వైకల్యాన్ని స్వీకరించి, కుదుటపడి, మునుపటి లా బతక గల గుండె ధైర్యం అందరికీ ఉండదు. అందులోను, ముఖకవళికలు దెబ్బ తిన్నాయి కదా .ఆ మార్పును తట్టుకోవడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. “

వసుధ  వింతపడింది. “మీరేం అంటున్నారో తెలియడం లేదు డాక్టర్ గారూ ..”

“మిసెస్ రాం,  మీకే తెలుస్తుంది. కాలం చెపుతుంది. ఏది ఏమైనా , మీరు నిబ్బరం గా ఉండండి. ప్రమాదం తప్పింది. మీ కుటుంబమంతా ఒక కొత్త జీవితాన్ని గడపాలి ఇకపై.  మంచి అయినా , చెడు అయినా.” నెమ్మది నెమ్మది గా ఆ కంఠం బుడగలోకి కరిగి పోయింది.

వసుధ మరోసారి ఆసరా కోసం, భరోసా కోసం , ఆత్రుతతో వెతికింది. ఆ బుడగా లేదు. ఆ మనిషీ లేడు ! వెతికి వేసారి నట్టుగా , ఆమె కళ్ళు తడారి పోయాయి. పొడికళ్ళతో చుట్టూ చూసింది.

అక్కడొక ముదురు నేరేడు రంగు బుడగ. మందగొండిగా  అటూ ఇటూ ఊగిస లాడుతూ ఉంది. ఉలుకూ పలుకూ లేకుండా,కదలక మెదలక ముడుచుకు పడుకొన్న ఆ ఆకారం లాగా.

” కాస్త మంచి నీళ్ళయినా తాగండి.” గ్లాసు భళ్ళు మంది. “పోనీ, కొబ్బరి నీళ్ళు ఇవ్వనా?” మళ్ళీ పలకరింపు. ఘనీభవించిన మౌనం కప్పుకొన్న మొండి పట్టు.

“ఈ బత్తాయి రసం, పాలు , ఏదో ఒకటి కొంచమైనా తాగండి..”

“పో అవతలకి. ఊరికూరికే విసిగించకు. పొమ్మన్నానా! ”

“ ఎందుకండీ అంత కోపం?”

” అంతా ..అంతా.. నీ వల్లే ! ”

“నేనేం చేసాను ?”

ఆ  పై,  ఆ వగరు మాటలు తుట్టెలా చుట్టేసాయి. వినలేనంతగా.

శస్త్రచికిత్స సమయాన వైద్యులు తొడుక్కొనే ఆకుపచ్చని ఆసుపత్రి దుస్తుల్లాంటి రంగు బుడగ  తేలి వచ్చింది. భుజాన తెల్లని పొడవాటి చొక్కా వేసుకొన్న కంఠం వృత్తిని ఉట్టిపడుతూ గంభీరంగా పలకరించింది.

వసుధ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు  మాట పెగల్లేదు. ధైర్యమై నిలబడ్డ ఆ మనిషి ముందు, వసుధ గొంతు పెగల్చుకొని , అపనమ్మకం లో ముంచెత్తిన ఆ రెండు మాటలు మాట్లాడింది.

“అకారణం గా అంత కోపం …?!? ”

“ఆ కోపం మీ మీద అనుకోవద్దు . మిసెస్ రాం. ఆ వైకల్యం మీద. దానికి మూలమైన పరిస్థితి  మీద కోపం..చేజారిన సుందర స్వప్నం మీద కోపం. భయం, అసంతృప్తి, అశాంతి, అభద్రత, వంటరితనం అన్నీ గూడు కట్టుకొని , ఇలా బద్దలవుతున్నాయ్ . కణ కణ మంటూ ఉవ్వెత్తున చిమ్మే బడబాగ్ని నైనా భరించాల్సింది భూమితల్లేగా ?”

వసుధ నెర్రలు వారిన నేలమ్మ అయ్యింది. గుండెలు ఎండి బీటలు వేశాయి.

చిన్నపాటి చినుకులకే పులకరించే కాగిన పుడమిలా , ఏమరుపాటులో దొర్లే నాలుగు మంచి మాటలకో , చిన్న నవ్వులకో పులకరించడం అలవాటయిపోయింది. మేఘాలు లేని వట్టి ఆకాశంలో కి ,ఎడారి వంటితో ఆశగా ఎదురు చూస్తూ , ఓ ఇసుక రంగు బుడగ రాను రాను బిగుసుకు పోసాగింది.

పిల్లలు చదువులు, ఆటలు పాటలు, చుట్టాలు పక్కాలు, స్నేహాలు బంధాలు, ఇరుగు పొరుగు , ఎవరూ తాక లేనంత గా ఆ బుడగ లోలోకి కూరుకు పోసాగింది. ఆ ఇసుక రంగు బుడగ ఇటుక రంగు పులుముకొని , కిటీకీలు లేని ఇల్లై కూర్చుంది.

ఇంతలోనే తేలి వచ్చిందొక వంగ పూవు రంగు బుడగ. భయం భయంగా.

భయం. ఏమి మాట్లాడాలన్నా , ఎవరితో మాట్లాడాలన్నా, ఎక్కడ మాట్లాడాలన్నా భయం. ఏ మాటకు ఏం కోపం వస్తుందో .  లోలోన విత్తుకొన్న ఆ భయం , మొలకెత్తి మోసులెత్తి చెట్టై కొమ్మలు దీరి , చుట్టు ఆవరించుకుంటూ ,వేళ్ళూనుకొంటూ , చూస్తుండగానే మహా వటవృక్షమై , పసిబిడ్డల గుండెలతో సహా, లోలోన ఊడలు దించుకొన్న భయం.

అంతుచిక్కని భయం. అది చేయాలన్నా, ఇది చేయాలన్నా…అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా…భయం. ఒక తటస్త జీవితపు బుడగలోకి కాళ్ళు ముడుచుకొంటూ… స్థితి గతులను  విస్మరించిన భయం. ఆ వంగపూరంగు బుడగ చూస్తుండగానే , కుంపట్లోకి విసిరేసిన  వంగపండులా కమిలి పోసాగింది.  కరుడు గట్టి పోతూ. నల్లబారి పోతూ.

నిజానికి భయం బుడగ ముందు కనబడిందా , అణువణువునా ఆపాదించబడిన అపరాధ భావనలతో చిక్కగా అల్లిన గచ్చకాయ రంగు బుడగా అన్నది ఒక్క మాటతో తేలేది కాదు. గచ్చకాయ రంగు బుడగ బహుశా తప్పుల తడక లాంటి ఊదారంగు బుడగ పక్కన నక్కి , తక్కుతూ తారుతూ మెత్తగా వచ్చినట్టుంది.

కళ్ళెత్తితే తప్పు. కళ్ళు వాలిస్తే తప్పు.  వింటే తప్పు. వినకపోతే తప్పు. నవ్వితే తప్పు. నవ్వకపోతే తప్పు. ఏడిస్తే తప్పు .ఏడవక పోతే తప్పు. నడిస్తే తప్పు. నడవక పోతే తప్పు.బతకడమే  ఒక తప్పు అనిపించేలా కుదేలంటూ చతికిల బడింది.  కుంటుతోన్న కాలంతో సహా నేల బారున  కూలబడింది.

వసుధ కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళ ముందు ఒక అస్పష్ట అసంపూర్ణ చిత్రం. వసుధ గజ గజ వణికి పోయింది. లోలోని భయం ఒక్కసారిగా తరుముకువచ్చింది. ఆ అస్తవ్యస్తవర్ణాల బుడగ , ఒక్క సారిగా భగ్గుమంది. భగ భగ మండసాగింది, ఎర్రటి ఎరుపు. కొలిమిలో కాలుతోన్న కొడవలి కొనలా . సమ్మెట దెబ్బకు ఎగిసి పడ్డ నిప్పుకణికల్లా  ఆ క్షణాలన్నీ వసుధ చుట్టూ చెల్లాచెదురుగా పడ్డాయి.   ఆ నివురు కప్పిన నిప్పులన్నీ బుడగల్లా మారిపొసాగాయి.

వసుధ చూస్తుండగానే ,ఇల్లంతా బుడగల మయం.

కనురెప్పల మీద వాలుతూ.కలల్లోకి చొచ్చుకు పోతూ . నరనరాల్లోకి పాకుతూ. మెదడునూ గుండెనూ ఇష్టారాజ్యం గా ఆక్రమించేస్తూ..బుడగలు బుడగలు .వసుధకు ఊపిరి ఆడడం లేదు.

బుడగలు వసుధను మడమ తిప్పుకోనివ్వడం లేదు. చేయి సాగడం లేదు. నోరారా అమ్మా అని వాపోదామన్నా , తెరిచిన నోట్లోకి దూరిపోయిన బుడగలు,వసుధ గొంతు నొక్కి పట్టేసి  ,పేగుల్లోకి చొచ్చుకు పోతున్నాయి. తల్లి పేగు కలుక్కుమంటొంది. కలగాపులగంగా. కడుపు చించుకొన్నట్లు పిలుపులు. బుడగల్లోకి కలిసి పోతున్నాయి.

ఆ మూల వంటరి సెనగపువ్వు రంగు సోఫాలో పెద్ద ముదురు నీలం రంగు బుడగ. ఆ శూన్యాల ఖాళీల్లోకి తొంగి చూడాలని ఏ మాత్రం లేక పోయినా , ఉదయాన్నే  పిచ్చాపాటీ ముచ్చటిస్తున్న దంపతులు  కనబడ్డారు. టీపాయి మీద హాయిగా జాపుకొని పెట్టుకొన్న మట్టంటని కాళ్లు . పక్కనే అప్పుడే  చప్పరించి పక్కకు పెట్టిన వెచ్చని కాఫీ కప్పులు.మాటల్లో వేడి వేడి గా దొర్లుతున్న నిన్నటి సాయంత్రపు ఆటల పోటీల విశేషాలు.చేతుల్లో తిరుగుతోన్న వార్తాపత్రికల కాగితాల మడతలు. అతను చెపుతోన్న కబుర్లకు ఆమె తలాడిస్తోంటే, అలలు అలలుగా ఎగరాలని ప్రయత్నిస్తున్న తడారుతోన్న జుట్టు. ఓ లేత నీలం రంగు బుడగ వారి చుట్టూ పలచగా సంతృప్తిగా  పరుచుకొని వుంది.

హఠాత్తుగా  ఓ కబంద హస్తం ఓ పసిరికపచ్చ బుడగ  లోంచి అసహ్యంగా పొడుచుకు వచ్చింది. వారిద్దరి నడుమగా .   గుండె లేని ఆ మొండి మొరటు కబంద హస్తం  గొంతు చించుకొని, భగ్గు మంటూ అరిచింది.

“పిచ్చిపాట ఒకటి గొంతులో పెట్టుకొని , కారుమేఘాల్లో కాంతి పుంజాల్ని కొలుస్తానంటావ్? ముళ్ళపొదల్లో పూలతీగలా అల్లుకు పోగలనంటావ్ ? ఎంత పొగరే నీకు ? చీకటి లోతుల్లో చీకిపోతూ, ముడుచుకొన్న నాగజెముళ్ళ మధ్య వంటరిగా బతికి , అప్పుడు చూడు, నీ గొంతెలా పెగలుతుందో … నీ వెర్రి పాట  ఎలా పుడుతుందో !”

ఆ పసిరికపచ్చ బుడగ పగిలిన సెగ్గడ్డనుంచి కారిన రసిక పులుముకొని, జుగుప్సలు చిమ్మింది.   ఆ కబంద హస్తం  ఆమె తడి జుట్టు కుదుళ్ళలో పట్టుకొని , ఆ లేత నీలపు బుడగ లోంచి బరబరా లాక్కుని గుమ్మం బయటకు పడేసిన సడి లేని చప్పుడు.   బతుకుల బాటను పడి,నల్లేరును దాటివచ్చిన    ఆ కుటుంబం  చివరాఖరకు చెప్పుడు మాటల సెగలో మాడిమసై విచ్చిపోయింది. తొలిపొద్దుల్లో కాపురం బుడగ బుగ్గయి పోయింది.

ఆ క్షణాన , అప్పుడే కలిసి తాగిన కాఫీ కమ్మదనం , కలబోసుకొన్న కబుర్ల వెచ్చదనం , సాన్నిహిత్యపు మడతల్లో ఒలికిన పన్నీటిచినుకులు, ఇంకిన కన్నీటి చారలు, దాంపత్యపు భద్రభావనలు చుట్టూ పరుచుకొనే ఉన్నాయి.  అపనమ్మకంతో నిర్ఘాంత పోయిన వసుధను దాటుకొని, గుండె ,మెదడు లేని  ఆ కబంధ హస్తం తాలుకు గిడస బారిన భుజాల మీద కెక్కి, ఆ లేత నీలం బుడగ తేలిపోయింది.  ఫెటిల్మని పేలిపోయింది.

ఏ బుడగల్లోనూ కలవకుండా ఓ కరుడు కట్టిన బుడగ గది మూలన దాక్కుంది. అది వసుధ కంటబడింది. అది అంతే. ఎటూ కదలదు. అటో ఇటో తోద్దామన్నా కదలదు. అది కమురు కంపు కొడుతూ ,చిక్కటి చీకటి రంగులో ,కరుడు కట్టిన కోపతాపాల  ఇనుపచట్రాల మధ్య ఇరుక్కు పోయి ఉంది. కావిళ్ళ కొద్దీ వెలుగు పూలను  గుమ్మరించినా వెలుతురు సోకదు.  కడవళ్ళ కొద్దీ మొగలిపూల సుంగంధాలలో ముంచెత్తినా  ఆ కంపు పోదు.

ఏమీ చేయ లేని నిస్సహాయతలో పడిపోతుంది వసుధ. ఎక్కడలేని శక్తి తెచ్చుకొని , ఓపికగా లేచి. ఆ బుడగలోకి కళ్లు పొడుచుకొని  చూస్తే , ఆ చీకటిలో కాళ్ళూచేతులు ముడుచుకొని బొక్కబోర్లా పడుకొన్న ఒక ఆకారం కనబడుతుంది. అస్తమయాన్ని కన్నార్పకుండా చూస్తున్న ఆ  పొద్దుతిరుగుడు పూల కళ్లు.     వళ్లంతా పొడలు పొడలుగా రక్తం చిమ్మిన చారికల సాలెగూళ్ళు. ఎవరి రాకకో ఎదురు చూస్తూన్నట్టు , గొట్టాల గాలిలో నిలిచిన కొన ఊపిరి.

ఆ పసుప్పచ్చని కళ్లల్లోనేగా  వెన్నెల వెలుగులు చూసింది. కమ్మని కలల పందిళ్ళు వేసింది.  ఆ పాము పొడల వంటిపై నేగా  వెచ్చనిఊపిరి సంతకాలు చేసింది. ఆ ఘనీభవించ బోతున్న శ్వాసలోనేగా  ఆనందాల పరిమళాలు నింపుకొంది.

ఆ క్షణాలు క్షణికావేశాల్లో కరిగి పోయాయి. ఆ కరుడుగట్టిన కమురు కంపు కొట్టే  చీకటి రంగు బుడగ ఎంతకీ కదలదే! ఎక్కడో అనుబంధాల దారం పుటిక్కిన తెగింది. ఊడలు దిగిన నీడల్లో చిక్కులు పడింది.   ముక్కలు ముక్కలయ్యింది. ఏ ఒక్క వెలుగూ ఆ పక్కకు రాలేదు. దిగులు విచారం గుదిబండల్లా వెనక్కి ఈడుస్తున్నాయి. ఆ గొంతులో పదునెక్కిన పాటలన్నీ , ఏనాడో అటకెక్కాయి .ఒక నిర్ఘాంత  నిశ్శబ్దంలోకి ఘనీభవించి పోయింది. కాలంతో పాటూ వసుధ.

అల్లనమెల్లన ఎప్పుడు వచ్చిందో , పక్కింటి అమ్ములు అమాంతంగా వసుధ వళ్ళో పడేసింది . చక్కగా కత్తిరించి, పొత్తిలా పట్టుకొన్న తన చేతిలోని కాగితం ముక్కల  చదరాలను.

అమ్ములు చనువుగా వసుధ చేతులు పట్టుకొని ఊపేసింది. “రంగు రంగుల చేపలు చేద్దాం  రమ్మన్నావ్. నువ్వేమో స్టాచ్యూ ఆట ఆడుతున్నవ్ ! “అమ్ములు అలిగినట్టుగా బుంగమూతి పెట్టింది. “పో వసుధక్కా, నేను నీతో కచ్చి!”      వసుధ ఒక్కసారిగా తల విదుల్చుకొని చుట్టూ చూసింది. అమ్ములు ఉత్తిత్తి కోపాలు చూడగానే  మెల్లిగా వసుధ ముఖం లో నవ్వు మొలకెత్తింది. ‘ఇంకా వచ్చి బతిమిలాడడం లేదేం అబ్బా ‘అని అన్నట్టు  చటుక్కున చూసి ,తల తిప్పేసింది అమ్ములు. వసుధ కు నవ్వొచ్చింది.

“ఒక పేద్ద సూర్యుడు, ఒక పేద్ద చందమామ , ఏడు నష్షత్తరాలు ,అన్నీ…అన్నీ…ఉండే పేద్ద కథ చేప్పేయ్ ! అప్పుడు పండు కొడతా” అమ్ములు బేరం మొదలెట్టింది.

వసుధ అలాంటి కథ అమ్ములుకి ఎప్పుడు చెప్పనబ్బా అని ఆలోచనలో పడింది.

“ఇంకా చాలా చాలా పేద్ద పేద్ద పసుప్పచ్చ పూలు….” అమ్ములు రెండుచేతులు బార్లా చాపుతూ అంది.

“ఓ పేద్ద రాష్షసుడు కూడా ఉండాలి !” అమ్ములు కళ్ళు పెద్దవి చేసింది. “ఆ రాష్షసుడు చాలా బయంకరంగా ఉండాలి !”

” అమ్మో ! నాకు భయం!” వసుధ కళ్ళు పెద్దవి చేసి అంది.

“బయం లేదు. ఆ బయంకరమైన రాష్షసుణ్ణి తన్నేస్తాను. నువ్వూ తన్నేయ్ !  ” అమ్ములు ఉత్తిత్తి తన్నులు గాల్లోకి తంతూ అంది.  వసుధ అమ్ములు వంక కొత్తగా చూసింది.

రాక్షసుడు ! ఈ మాట అంతకు మునుపు వినింది. నిజమే . ఆ డాక్టరు గారి నోట.  ‘మీరు చెపుతోంది అర్థం కాలేదన్నప్పుడు’ డాక్టరు గారు రాకాసి మాట ఎత్తారు కదా !

” మిసెన్ రాం , మనం మానవ మాత్రులం. వెలుగు చీకట్లు మనలోనే ఉంటాయి. ఆయా సంధర్భాలను బట్టి ,మనలను ముందుకో వెనక్కో తోసుకెళతాయి. మనలో నిక్షిప్తమైన ఆ నిగూఢ రాకాసిని మనం గుర్తించే లోపలే  , మనలని నిలువునా కబళించి వేస్తుంది. ”

ఇంతలో,  ఓ పేద్ద బుడగ వసుధ కళ్ళముందు కొచ్చింది. ఆ బుడగలో  ఎక్కడ ముడుచుకొని దాక్కుని ఉన్నాడో రాక్షసుడు ,చూస్తుండగానే బుడగంతా  నిండి  పోయాడు. అమ్ములు ఎడాపెడా గాల్లోకి విసురుతోన్న చిట్టి పిడికిళ్ళ తాకిడికి ఫెటిల్మని పేలింది బుడగ. రాక్షసుడు ఎటు పోయాడో ఏమో ! వసుధ విస్మయంతో చుట్టూ చూసింది.

తెరిచిన వాకిటి మెట్ల మీద కూర్చుని, తన చేతి వేళ్ళు ముడుస్తూ తెరుస్తూ  ,అడ్డదిడ్డంగా అంకెలు లెక్క పెడుతోన్న అమ్ములు,   కిటికీ తెరలను మెల్లిగా కదిలిస్తోన్న సాయంకాలపు సముద్రం గాలి తప్ప ఏ సవ్వడి లేదక్కడ.

ఆశ్చర్యం ! అక్కడ ఎలాంటి బుడగలూ లేవు. ఆ నాలుగు గోడల నడుమ కిక్కిరిసిన కమురు కంపు కొట్టే కరుడు బుడగలన్నీ ఎప్పుడు మాయమయ్యాయో !

వెలుగుల పసుపుపచ్చ బుడగల్లో పాలతపేళాలు పట్టుకొని పరుగులు తీస్తున్న పాపాయి పకపకలు. పాలబువ్వలు తినడానికి ఇల్లంతా పరుగులు పెడుతున్న చిట్టితల్లి పరుగులు తప్ప  అన్ని బుడగలు కరిగిపోయాయి. ఆ ఖాళీల్లో ఓ పేద్ద సూర్యుడూ. ఓ చల్లని చంద మామ , ఏడు నక్షత్రాలు,ఆకాశం లో ఎగిరే  పెద్ద పెద్ద పసుప్పచ్చ పూల బుడగలు నిండిపోసాగాయి.

ఎప్పుడన్నా ఎక్కడి నుంచి అయినా  ఏ రాష్షసుడయినా తలెత్తి చూస్తే ,అమ్ములు వాకిట్లోనే మొట్టికాయలు పిడి గుద్దులు కురిపించేస్తుంది. వసుధ కూడా అమ్ములు దగ్గర ఆ కళను నేర్చేసుకొంది.

ఆ కళలన్నిటినీ, ఆ కథలన్నిటినీ అమ్ములు ,వసుధ  గాల్లోకి విసరసాగారు. మెల్లిమెల్లిగా ఆ కథలన్నీ ఇల్లంతా పరుచుకొన్నాయి. వరుసలు వరుసలుగా  . కరుడు గట్టిన బుడగలు కాలు పెట్టే చోటే లేదక్కడ.  వెలుగులు నిండిన సూర్యబింబాల వంటి,  గుత్తులు గుత్తులుగా పూసిన సువర్ణగన్నేరుల్లాంటి ,  చెట్టంతా పరుచుకొన్న చిట్టిచేమంతుల్లాంటి , విరగబూసిన పచ్చ తంగేడు పూల లాంటి ,  పసుప్పచ్చ బుడగలే ఎటుచూసినా.

అమ్ములు తనతో బాటు ఇరుగుపొరుగున ఉన్న మరో నలుగురు పిల్లలని కేకేసుకు వచ్చింది. వాళ్ళు తలా నలుగురిని. అందరూ కలగలిసి ఆ పసుప్పచ్చని వెలుగుల బుడగలతో బంతులాటలు, దాగుడు మూతలు ఆడుకొని ఆడుకొని అలసిపోతారు.

ఏ మాత్రం వ్యవధి దొరికినా, పక పక నవ్వుల పువ్వుల పొట్లాలు చుడుతుంటారు. కలల పరుపులెక్కి కథల దుప్పట్లు కప్పుకొంటారు.

ఎవరయినా అదాటున ” వంటరిగా ఏం చేస్తుంటావ్ ?”   అన్నప్పుడు నిండారా, నిశ్శబ్దంగా, పండిన పసుప్పచ్చని చేనులా… నవ్వుతుంది వసుధ.

***

 

చంద్ర లత     (15-10-2015)

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s