కొత్తా దేవుడండీ… !

ఆనాటి వాన వెలిశాక, నాటాలనుకొన్న మొక్కల విశేషాల కబుర్లు కురిసాయి.

ఏ మొక్క సంగతి ఎలా ఉన్నా , ఎండయినా వానయినా , ఆరు బయటా ఇంటి లోపలా, మట్టికుంపట్లో నీటి సీసాలో. ఎక్కడైనా చక్కగా కుదురుకొని, కుదమట్టంగా అలుముకొని,అలవోకగా అల్లుకొని పొయే మొక్క ను ఈ సారి అయినా నాటాలని అనుకొన్నాం.

కాలాల నాడు మా ప్రహరీ వారగా, ఈ గేటు నుంచి ఆ గేటు దాకా. నేలంతా అల్లుకుని, పచ్చగా కళ కళలాడుతూ ఉండేది. . అరచేయి వెడల్పున విప్పారిన లేతాకుపచ్చఆకులే ఆ తీగకు అలంకారం.

గేటు దాటి లోపలకి అడుగు పెట్టే వారిని.పచ్చగా పక పక లాడుతూ పలకరించేది  .  వచ్చిన వాళ్ళు వెళుతూ వెళుతూ ,ఒక చిన్న తీగని పట్టుకు పోయే వారు.  ఎవరయినా తీసుకెళ్ళి శ్రద్ధగా పెంచుకొంటున్నారంటే , బోలెడంత సంతోషంగా ఉండేది. పదిమందితో పంచుకొంటే పెరిగేది సంతోషమేగా.

ఒక శుభ ముహుర్తాన,  ప్రహరీ వారగా ,శుభ్రంగా చెక్కేసి ,సిమెంట్ చేయబడింది. “అదేముందీ, ఎక్కడ బడితే అక్కడ పెరిగే మొక్క “అని అందరూ అనుకొన్నా,  ఆ తరువాత మళ్ళీ మా ఇంట మాట మాత్రానికయినా ఆ మొక్క కనబడలా. ఆనవాళ్ళు కూడా మిగలకుండా పోయాయంటే నమ్మండి.

మొక్క నాటడం . ఒక పచ్చని ఆకు వేసీ వేయగానే , మారాకు వేయక మునుపే  ,   ఏ ఉడతో గెంతుతూ దుముకుతూ వచ్చి,ఆ నవనవలాడే ఆకును రుచి చూడాల్సిందే . గోరుచిక్కుళ్ళు గిల్లినట్లు ,తెల్లారే పాటికి ఆకంతా ఉడుత కొరుకుళ్ళే .

ఎట్లాగో కిందా మీదా పడి  ఆ ఉడుత కొట్టుడు నుండి కాపాడ గలిగామా , కాస్తంత తీగ బారుతుంది.   తీగలు సాగిందా , కోతిమూక తయారు. తీగ మొదలంటా పీకి, వేళ్ళ మొదలును నోట పెట్టుకొని  , కొరికి పడేయడం. పెట్టుకొని తమల పాకు ఈనెలు తీసినట్లుగా , ఒక్కో ఆకును తాపీగా ముక్కలు ముక్కలు చేసి,చప్పరించి , చెల్లచెదురుగా విసిరేయడం పరిపాటి.  అలా  ఆ కోతి ప్రసాదించిన ,తీగ ముక్కలనే మళ్లీ నాటడం. మళ్ళీ చిగురేయడం. మళ్ళీ ఉడుతలు, కోతులు. ఎక్కడ పెట్టినా ఇదే తంతు.

కట్టుదిట్టంగా  కాపలా కాసినట్టే ఉన్నా, ఎప్పుడో కన్ను కప్పేసి , కటిక్కిన మొదలంటా కొరికేసి ,ఆకులను నమిలేసి,చిగుర్లను చప్పరించేసి. కుండీ ని ఖాళీ చేసి పడేయడం ఆనవాయితీ అయిపోయింది.

అయినదేమో అయినది. ఈ మారు గట్టి ప్రయత్నం చేద్దామని , ఆనందు కు చెప్పాను.” ఆ నర్సరీ కి వెళ్ళి ఒక మొక్క కొనుక్కొని  రా ,కొత్త కుండీలో  భద్రంగా పెంచుదాం “అని.

మా కొండమ్మ లబ లబ లాడుతూ వచ్చింది.

“అమ్మా ,ఆ మొక్కని అట్లా కొని తీసుకు రాకూడదు.”

“మరెట్లా తేవాలి?”

“ఎవరి ఇంటి నుంచి అయినా తేవాలి.”

“సరే మరి, నీకు తెలిసిన వాళ్ళెవరి దగ్గర నుంచి అయినా తీసుకు రా కొండమ్మ .”

“ఎవరూ ఇవ్వరు ! ”

“ఎవరింటి నుంచి అయినా తెచ్చు కోవాలంటావ్. ఎవరూ ఇవ్వరంటావ్ . మరెట్లా ఆ మొక్క మనింటికి వస్తుంది?”

“చెప్పకుండా  తెచ్చేయాలి !”

“అది దొంగతనం.”

“మా వాళ్ళంతా అట్లాగే తెచ్చుకొన్నారు.ఇప్పుడు ఎంతెంత అల్లుకొని పోయిందో .మా పక్కింటామె అయితే గుమ్మం మీంచి , ఆ మయాన గుడిసె కప్పంతా గుమ్మటంలా పాకిచ్చింది.”

“మరింకేం , ఆమెనే అడిగి తీసుకురా.”

“ఆ యమ్మ ఇవ్వనే ఇవ్వదు !”

“ఇంత చిన్న తీగ కోసిస్తే, ఆ యమ్మ ఆయుస్సేమీ పోదు పోవమ్మా ” ఆనందు అందుకొన్నాడు.

కొండమ్మకు కోపం వచ్చింది. “ఆనందో …గమ్ముగుండు? ఏ అమ్మయినా ఎట్లిస్తది? చేజేతులా ఆ మొక్క ను కోసి ఇస్తే ,ఆ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకు పోదా…? తెలిసినోడివి. నువ్వే ఇట్టా మాట్లడబడితివే… మీ ఇంటి కాన్నించి నువ్వు తెచ్చిస్తా ?”అదే ఊపులో నావైపు తిరిగి అంది,”మ్మో , ఎవరూ ఇయ్యరు .నాకు తెలిసి. కొనుక్కోకూడదు. ఎవరికి చెప్పా పెట్టకుండా  కోసుకోని రావాల! ”

“ఎప్పుడన్నా అలా దొంగతనంగా మొక్కలు తెచ్చి మన వాకిట్లో వేసామా? నీకు తెలుసుకదా. అయినా, ఒక మొక్కను నాటడానికి ఇన్ని కొత్త  రూల్స్ ఏమిటి కొండమ్మా ,ఎవరు చెప్పారు?”

“మా ఇంటిసుట్టు ముట్టు అందరూ ఆ వంతన చెప్పుకుంటండారు మ్మో, మా పక్కింటాయమ్మ ఒకే మాన , మహా బెట్టుగా నీలగతా సెపతది. ”

“సరే, అట్లా చేయక పోతే ఏమి ?”

“మ్మో … నువ్వు గమ్ముగుండు. ఆయమ్మ ఇంట్లోదంతా ఆమాన ఊడ్చి పెట్టూకోని పోదూ ! అదే ఆ మొక్క ని తెచ్చి ,బాగా పెంచి రోజూ పూజ చేస్తే, ఇంటినిండా లక్ష్మీ దేవే!”

“లక్ష్మీ దేవా?”

“అవునుమా, రోజూ పొద్దున్నా సందేళా దీపం పెట్టి , దండం పెట్టుకోవాల.పండక్కీ పబ్బానికీ పలారం పెట్టి పూజ్జేసుకోవాల. శుక్కురారం శుక్కురారం తలకుపోసుకోని దీపంపెట్టాల.  ”

“ఎవరు ?”

“ఇంటామె.” కొండమ్మ   చాలా నిజాయితీగా అంది.

” ఈ రోజు ఒక సారి మీ పక్కింటామె ని ఒక చిన్న తీగ ఇస్తుందేమో అడిగి చూడు.లేకుంటే..”

నా మాటపూర్తయ్యే లోగానే ఆనందు అందుకొన్నాడు. “ఏకో ఝామున సైగ్గా ,ఇంత తీగ తుంపుకొని సంచిలో దోపుకు రా ! ”

కొండమ్మ మళ్ళీ గయ్యి మంది.

“ఆనందో ..ఆ మయాన సెపతా ఉంటే దూర్చుకోవే… ఇల్లు గల్లాయమ్మే పోయి సైగ్గా తెచ్చుకోవాల !”

మా కొండమ్మకి కోపం వస్తే అన్నపానాదులు పుట్టవని,    అందరం ఆ క్షణాన ఆ ఆలోచనని గట్టున పెట్టాం.

“ ఏమి చేయడం చెప్మా” అనుకున్నాం.

ఆ మధ్యన రిషీవ్యాలీలో చంద్రిక అక్కని  కలిసినప్పుడు, మా కొండమ్మ ప్రహసనమంతా చెప్పి వాపోయా. అక్క కూడా, బోలెడంత శ్రద్ధగా వినింది.

మర్నాడు పొద్దున నిద్ర లేచేసరికి, నా గది గుమ్మం ముందు గోపాలు తెచ్చి ఈ మొక్కను పెట్టాడు. చంద్రికక్క ఇమ్మందని. అక్క ఒక కోకో జాడీలో మట్టిని పోసి , ఈ మొక్కను పంపింది.

“మా ఇంటి నుంచి ఈ మొక్క తనతో మీ ఇంటికి మోసుకొచ్చేది ఏమైనా ఉంటే, అది స్నేహమే. ఈ తీగను మరింతగా పెంచి,పది మందికీ పంచుతారని. ”

మొత్తానికి భలే  !

“కొలువయితివా దేవి మా కోసము…

తులశీ….తులశీ …వరాపూర్ణ కలశీ…”  అంటూ పూజలు నోములు చేయడం తెలుసు. వేప రావి చెట్లకు ప్రదక్షిణాలు, పూజలు చేయడం తెలుసు. ఈ కొత్త దేవుడి గురించి ఇప్పుడే తెలుసుకొని,. ఆ పై , “నిజమే సుమీ” అని ముక్కున వేలేసుకొన్నా!

మా కొండమ్మ ఇరుగు పొరుగు పుణ్యాన కుసింత జ్ఞానోదయం అయ్యింది. ఆ దరిమిలా , ఒక్కరవ్వ లోకజ్ఞానమూ అబ్బింది.

అయితే, చంద్రికక్క స్నేహాన , ఆ తీగ మా ఇంటికి చేరి, మా గుమ్మం చుట్టూ తోరణంలా అల్లుకొంటోంది.

ఆ తీగ మొదట్లో , నీళ్ళు చిలకరిస్తున్న ప్రతిసారీ , ఈ పాత పాట కొత్తగా రింగుమంటోంది.

” కొత్తా దేవుడండీ..

  సరికొత్తా దేవుండండీ..

అదే నండి,

మన ఇంటింటా అలరారే సతతహరితపు తీగ …  చి.ల.సౌ. మనీ ప్లాంటు !DSCN9992

***Many thanks to Dr.Chandrika Mathur .Wish this plant was blooming cocoa chocolates ! :-))

ప్రకటనలు

One thought on “కొత్తా దేవుడండీ… !

  1. ఈ మనీ ప్లాంట్ గురించి అందరూ ఇలాగే అంటారు . ఈ మధ్య నా చెల్లెలు తనే స్వయంగా ఒక తీగని తెంపి ఇచ్చింది. ఎందుకో అది బ్రతకలేదు. మా డబ్బులన్నీ అయిపోతున్నాయి నీకు మనీ ప్లాంట్ తీగిచ్చి అని ఒక నిష్టూరం కూడానూ ! 🙂 నేను నర్సరీ నుండి కొని తెచ్చుకుని వేసాను . ఇప్పుడు బాగా ప్రాకుతుంది . 🙂

    మీ కొత్తా దేవుడి కబుర్లు బావున్నాయి . తీగలా ఇంటింటా అల్లుకునేది స్నేహమే కదా ! ఈ పోస్ట్ చదువుతుంటే … “అక్కడ పూసిన పువ్వు ” కథ గుర్తుకువచ్చింది . ఇలాగే వ్రాసారు మొక్కల పెంపకం గురించి . థాంక్ యూ చంద్రలత గారు .

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s