నేలమ్మకడుపు చల్లగా…!

అవి అటూఇటుగా , కొత్త శతాబ్దం ప్రారంభం రోజులు.

Tanvi Sankranthi

మా కుటుంబంలో మొదటి అమెరికా ఉద్యోగి ,నాలుగేళ్ల తరువాత మొదటిసారి ఇంటికి వస్తే, చుట్టాలందరికీ విందు ఏర్పాటు చేసారు. ఆ రోజు    కోటపాటి మురహరి రావు  బాబాయి ని  పరిచయం చేసినప్పుడు , కూడా ఇలాగే ప్యాంటు షర్టు వేసుకొని , తలకు పైపంచని చుట్టుకొని వున్నారు. చాలా కాలం ఒక మూలనున్న పల్లెలో ,ఆ తరువాత విదేశంలో ఉండి వచ్చిన బాబాయి ,మళ్ళీ  ఆ మారుమూల పల్లెలోకి వెళ్ళడం చేత , అందరికీ కొత్త మనిషిలాగే కనిపించారు..వచ్చిన చుట్టాలు పక్కాలు కొంత ఆశ్చర్యంతో ,కొంత వింతపడుతూ చూశారు.

బాబాయి ఉన్నత విద్యావంతులు. విదేశాల్లో ఉన్న ఉద్యోగాన్ని వదిలి ,స్వదేశానికి తిరిగివచ్చారు. ఉన్న పొలంలో వ్యవసాయం మొదలు పెట్టారు.  వ్యవసాయ పద్దతుల్లో వచ్చిన ఆధునిక పోకడలకు దూరంగా , సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్నారు. అది తెలుగునాట అన్నదాతల ఆత్మహత్యలతో అట్టుడుకి పోతోన్న సమయం . వారి వస్త్ర ధారణతో  పాటు భావజాలం కూడా ,  సాంప్రదాయాన్ని , దేశవాళీ పద్దతుల్ని ,రైతు కుటుంబాలలో పాటించిన తాత ముత్తాతల పారంపరిక సేద్యపు మెళుకువలనూ ప్రతిఫలిస్తున్నాయి.

సహజంగానే , ఆ పంచ నక్షత్రాల నడవలో నిలబడ్డ వాళ్ళకి , పంచామృతం వగైరాల ముచ్చట్లు చచ్చు బడిన  పురాభావనల్లా కనబడ్డాయి. విత్తన కంపెనీల వ్యాపారులు ఆ పూట అతిథుల్లో నిండిఉన్నారు. ఎరువులు ,పురుగు మందులు తదితర రసాయనాలు విరివిగా వాడడం, ఇబ్బడిముబ్బడి గా దిగుబడులు సాధించడం వారి జీవనవిధానం.

తెల్ల దోమ వచ్చింది. పోయింది.

అప్పుల ఉరితాళ్ళ పీఠముడి బిగిసి , ఎందరో సేద్యగాళ్ళు నేలనెర్రెల్లో మలిగిపోయారు.

అనేకానేక ,బహుళజాతీయ తమ విత్తన ప్రయోగ నాళికలతో, పొలం గట్లమీద పల్లె వాకిట్లో  నిలబడి ఉన్నారు.

ఆ నాడెప్పుడో , వూరిలోని పిల్లాపాపలను తన వెనకే తీసుకు వెళ్ళగలిగిన ,మార్మిక సన్నాయి వాద్యగాడి పాట లాగా, అందరూ ఆ కంపెనీల వెనకే  నడిచి వెళుతున్న రోజులుకదా, భూమాత, గోమాత .. లాంటి  మాటలు చెవిటివారి ముందు వూదిన శంఖంలాగానే ఉంటాయి  మరి.

బాబాయి ఎవరి వ్యాఖ్యానాలను పట్టించుకోలేదు. చిరునవ్వుతో అడిగిన వారికి సమాధానాలు చెపుతూనే ఉన్నారు. వింత గొలిపే , పైపంచ తలకట్టు వలన ఎవరో ఒకరు దగ్గరగా వెళ్ళడం పలకరించడం. “అయ్యో పాపం !బంగారం లాంటి ఉద్యోగం వదిలి ,మట్టి పిసుక్కుంటన్నాడు!”అంటూ చెవులు కొరుక్కోవడం. మళ్లీ దగ్గరకు వెళ్ళి ,అడిగి మరీ  , ఫోటోలు దిగడం.

ఒక పక్క విదేశీ  జీవనాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ,విందువినోదాలు. మరో పక్క , రాబడి గల విదేశీ జీవితాన్ని వదిలి ,మట్టిలోకి నడిచిన  బురద కాళ్ళు.

ఆ నాడు విర్రవీగిన అనేక కంపెనీలు ,ఇవాళ ,బహుళజాతీయ సంస్థల్లో విలీనమయిపోయాయి.అధీనమయి పోయాయి.మాయమయి పోయాయి.

ఆ నాటి మనుషులందరూ అటూ ఇటూ చెదిరిపొయారు.అనారోగ్యాలు,అసంత్రుప్తులు ,అంతర్గత పోరాటాలు. అంతరాల దొంతరలూ. ఆవేదనలకు అంతే లేదు.మట్టి వాసన అందనంత ఎత్తుల్లోకి వారు ఎగిరి పోయారు. నడమంతరపు సిరి తెచ్చిన ముప్పుతిప్పల్లో మునకలేస్తూ , లోకాతీతులై బతుకు తున్న వారు ఇంకొందరు.

అప్పటికీ ఇప్పటీకీ, బాబాయి అలాగే ఉన్నారు.పెద్ద మార్పేమీ లేదు. పెరిగిన వెండిపోగుల గడ్డం తప్ప !

తన చిన్న మనవరాలిని భుజానకెత్తుకొని , పొలం గట్లపై నడుస్తూ ,నవుత్తూ ,నవ్విస్తూ ,సుస్థిరత అంటే ఇదే కదా మరి!

సంక్రాంతి రోజుల్లో ,ఎంత లేదన్నా మట్టి పరిమళం మనసును తడుముతుంది.  కొత్త బియ్యంతో చేసిన పరమాన్నపు తీపి జ్ఞాపకం నోరంతా నిండుతుంది.

ఎంతో సంతోషంగా మా బాబాయి   కోటపాటి మురహరి రావు గారిని పరిచయం చేస్తున్నా.

గడ్డిపరకతో విప్లవం తేవచ్చుననీ ,అందులోనే ప్రకృతి భద్రత ఉన్నదన్న గురుతుల్యులు
మసనోబు ఫుకునోవా  గారి మాటను, సుస్థిరంగా నిలబెట్టిన బాబాయి …   మీకు వందనం .

సగౌరవం గా. ఆత్మీయంగా.

***

నిజమే, వ్యవసాయం ఒక కళ. ఒక సంస్కృతి. ఒక జీవన విధానం.

ప్రకృతితో చెలిమి.పోరాటం.విజయం. విరాజమానం.

అందుకే కదా అంటారు,అమ్మ కడుపు చల్లగా అని. నేలమ్మ చల్లగా ఉన్నప్పుడే, ప్రకృతి సమస్తం భద్రం !

సుస్థిరతే సఫలం.అన్నిందాలా !

***

శ్రీ కోటపాటి మురహరి రావు గారి ప్రకృతి సేద్యం గురించి మరింత తెలుసుకోవాంటే, ఈ లింక్ లు చూడండి.

  1. https://www.youtube.com/watch?v=38DmzoNCttY
  2. https://www.youtube.com/watch?v=xW6NEVFH8ak     
  3. https://www.youtube.com/watch?v=_yfgbtSMUkM  

 

 

సంక్రాంతి శుభాకాంక్షలు…!!!Harshini Sankranthi

ప్రకటనలు

One thought on “నేలమ్మకడుపు చల్లగా…!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s