అమ్మ అక్షరమై పోతూ

అమ్మ ఎప్పుడూ అనామకం గానే ఉంటుంది .Scan0005-001

అందులోనూ,నాన్న ప్రముఖంగా ఉన్నప్పుడు.

అమ్మా ఇంచుమించుగా అంతే.

నాన్న  చదివిన పుస్తకాలన్నీ చదివింది. ఆయన మాట్లాడిన సంభాషణలన్నీ వినింది. సమావేశాల్లో పాల్గొనింది. చర్చల్లో పాల్గొనింది.ఏ మాత్రం మొహమాటం లేకుండా విమర్శించింది.

ఆయన కట్టినట్టే, నూలు కట్టింది, పదహారేళ్ళ వయస్సు నుంచి. అన్నట్టు , ఆ రంగు రంగుల చేనేత చీరలే ఆమెకు గుర్తు.

ఆశ్రమం అంటే ఆశ్రమం. ఉద్యోగం అంటే ఉద్యోగం.సేద్యం అంటే సేద్యం. వ్యాపారం అంటే వ్యవహారం!

అన్ని విధాలుగా చేదోడు వాదోడు గా ఉండడం ఆమె నైజం అనాలో, నాన్నగారు సృజించిన వాతావరణం అనాలో కానీ, ఎక్కడి కక్కడ అప్పటికప్పుడు ఒదిగి పోయింది.

వేళ కాని వేళల్లో , అలుస్తూ సొలుస్తూనే, ఆ గడప తొక్కిన వారికి,కడుపు నింపింది.అన్నట్టు ,అమ్మ ఎన్ని వంటలు చేసినా,ఎంత ఆప్యాయంగా వండించినా , పట్టెడు మెతుకులు తప్ప ,పంచభక్ష్య పరమాన్నాలు తినలేదు. పదహారో ఏటే జీర్ణకోశ సంబంద శస్త్ర చికిత్స ఒకటి,ఆమె ఆహారాన్ని పరిమితం చేసింది.

సన్నిహితుల్లో ,ఎవరి బిడ్డ చదువుకోవాలన్నా, ఎవరి  కన్నుకాలు నొచ్చినా, ఎవరికె ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా, అమ్మే అండ.

కుటుంబం అంటే తన కన్న బిడ్డలే కాదు. ఉమ్మడికుటుంబంలోని మూడు తరాలు ,ఆమె ఈడు వారితో మొదలు పెట్టి , అందరినీ ఇంటపెట్టుకొని ,మంచీ చెడ్డ చూసింది. చదువు సంధ్య చెప్పించింది.పెళ్ళీపేరంటం చేసింది. వీళ్ళ తో పాటు, ఆ పని ఈ పని మీదా పట్నం వచ్చే వాళ్ళూ , వ్యాపార వ్యవహారాల్లో ఇంటికి వచ్చి పోయే వారూ అందరికీ ఆమె ఆతిథేయి.

నాన్న గారి కున్న సంపదంతా ఆయనకున్న వైవిధ్యభరితమైన మిత్రకోటి.హేతువాదులు,మానవ వాదులు,బౌద్ధులు, శాస్త్రజ్ఞులు,సాహితీవేత్తలు,పండితులు ,పాఠకులు,సామాజిక కార్యకర్తలు,పాత్రికేయులు,రైతులు.వ్యాపారవేత్తలు మా ఇంటి మనుషులు. వారితో పాటు వారి కుటుంబాలన్నీ , సేదదీరేవి. చింతలు చీకాకుల్లోంచి బయట పడడానికి వారు చేదోడు వాదోడుగా ఉండే వారు. సంతోషాల్లో సంబరాల్లో ఆది తాంబూలం పుచ్చుకొనే వారు.

అమ్మ సాదా సీదా ఇల్లాలు. తను చేసిన ఆకు కూర పప్పు ,మొలకెత్తిన పెసలు,పచ్చ దోసకాయ ముక్కలు ,దానిమ్మ గింజలు, వేరుశనగ పప్పుల ఉండలు, కారప్పూసలతోనే, వచ్చిన వారికి మర్యాద చేసేది. ఏ సమయం లో వచ్చినా ఆ సమాయానికి పళ్ళెం ముందు పెట్టేది. చిన్నదో పెద్దదో.

వర్తమాన సాహిత్యమూ ,లలిత గేయ సాహిత్యం అమ్మ కు నచ్చేది. వార మాస పత్రికల్లో వచ్చే ,కథలతో పాటు, కుట్లు అల్లికలూ , ఆరోగ్య చిట్కాలు ఆమెకు నచ్చేవి. అలా, మాలతి చందూర్ గారి నుంచి  వాసిరెడ్డి సీతా దేవి గారి వరకూ ఆమెకు మొదట రచయిత్రులుగా పరిచయమై , కుటుంబ మిత్రులయిన వారే.

కరుణశ్రీ పుష్ప విలాపం ఆమెకు చాలా ఇష్టం. అలాగే, రామదాసు కీర్తనలూ, ఎం. ఎస్. రామా రావు గారి సుందరాకాండ గానం ఆమె తరుచూ వింటూ ఉండేది.

మా ఇంటిలో రేడియో, ప్రెషర్ కుక్కర్, కుట్టు మిషను, ఎంబ్రాయిడరీ, జాంలు జెల్లీలు, పుడ్డింగ్ లు కేకుల తయారీ , షర్బత్ లు ఉత్సాహంగా నేర్చుకొనేది. ఇంకా, జొన్న రొట్టెలు,చింతకాయ తొక్కు , భక్ష్యాలు,కర్జలు ,పేణీలు లాంటి అనేక వంటలు అమ్మే మా కుటుంబాలకు పరిచయం చేసింది.

పాలమూరు నుంచి పల్లెకు వెళ్ళినప్పుడు పందిట్లో వేసే మెలికముగ్గుల నుంచీ పేరంటం పాటల వరకు ఆమెకొక ప్రత్యేక మైన శైలిని చూపించేది. అభిరుచిని  ప్రకటించేది. ఆమెకొక ప్రత్యేక మైన గుర్తింపు ఉండేది .

పాలమూరు ,తిరుమలదేవుని గుట్టలోని మా ఇల్లు చాలా చిన్నది.వరండా ,వంటిల్లు వదిలేస్తే ,తీరైన గదులు రెండు. మేము పండెండు మందితో పాటు, వచ్చే పోయే అతిథులతో, నిండి పోతున్నా , ఎప్పుడూ ఇల్లు ఇరుకుగా అనిపించేది కాదు. నాలుగడుల దూరంలో , మున్సిపల్ బడి. అదే ,మా ప్రాథమిక పాఠశాల.

టైలరింగ్ నేర్చే వాళ్ళు ఒకరతే ,టైప్ నేర్చుకొనే వాళ్ళు మరొకరు. బడికి వెళ్ళే వాళ్ళు బడికి వెళితే,కాలేజీ కి వెళ్ళే వాళ్ళు కాలేజీకి . కట్టెల పొయ్యిలో వంట.రోటి పచ్చళ్ళు.పొత్రం పిండి. బొగ్గుల బాయిలర్లో వేడి నీళ్ళు. రేడియోలో జన రంజని. వారాంతాల్లో, బాలానందం.

ప్రతి ఆదివారమూ, పరీక్షలయ్యాక  పల్లెకు వెళ్ళే ముందు,ఖచ్చితంగా ఒక సినిమా.

అమ్మ పూల మొక్కల పెంపకం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పళ్ల బుట్టల్లో మట్టిపోసి ,విరగబూయించిన చిట్టిచేమంతులు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. మద్రాసు కనకాంబరాలు వరుసలు వరుసలుగా గోడవారగా పూయించేయేది. సంక్రాంతి నాటికి  ,బంతులూ చేమంతులూ సరేసరి. మరువం ఒక కుండీలో పెరగాల్సిందే.

***

నాన్న గారి సాహితీ అభిరుచి గాంభీర్యము.గ్రాంథికం.

కవిత్రయం,పోతన,సోమన,శ్రీనథుడు,శ్రికృష్ణ దేవ రాయలు, తదితరుల పద్యకావ్యాల  సాహిత్యం ఆయనకు ఇష్తం.

వేమన, త్రిపురనేని,జాషువా మున్నగు భావచైతన్యకారుల సామాజిక హేతుబద్దత ఆయన దృక్పథం. దువ్వూరి,తుమ్మల,ఏటుకూరి తదితరుల కర్షక సాహిత్యం ఆయనకు కంఠాపాఠం.

రాహుల్ సాంకృత్యాయన్ , కరుణ శ్రీ నుంచి అన్నపురెడ్డి గారి వరకు  బౌద్ధ భావన   ఆయన నిత్య చైతన్యం.

కందుకూరి నుంచి గోరా వరకు, యలమంచలి వెంకటప్పయ్య గారి నుంచి రావిపూడి వెంకటాద్రి గారి వరకు , అందరి భావ చైతన్యాన్ని ఆయన అభిమానించేవారు.

గురజాడ తో మొదలై వోల్గా గారి దాకా అందరి అచ్చయిన అన్ని రచనలు చదివే వారు. శరత్ ,ప్రేంచంద్ అనువాదాలంటే వల్ల మాలిన అభిమానం.

త్రిపురనేని రామస్వామి హేతుబద్దత,కందుకూరి క్రియాశీలత, గురజాడ ముందుచూపు ఆయనకు నచ్చేవి.

అంబేడ్కర్ ను కూలంకషంగా చదివారు. ఎం .ఎన్. రాయ్ చేత ప్రభావితుడయ్యారు.

వర్తమాన సాహిత్యమూ లలిత గేయ సాహిత్యం అమ్మ కు నచ్చేది.

అమ్మ  వర్తమాన సాహిత్యం పట్ల ఆసక్తి. పత్రికలన్నిటిలోనూ వచ్చే వ్యాసాలు,శీర్షికలూ,కథలు క్రమం తప్పక చదివేది. ఆరోగ్య చిట్కాలు, ఆహార నియమాలు అలా నేర్చుకొని, అందరికీ పరిచయం చేసింది.

ఆ ఉమ్మడి కుటుంబంలో ,పెద్ద బావ గారికి పెద్ద కోడలు వచ్చిన రోజున ,ఆమె ఎంతకూ వంగని తన ఉంగరాల జుట్టును , బిగించి ముడి పెట్టింది. ఆ కుటుంబ బాధ్యతలను తలకెత్తున్న రోజున ఆమె  ,ఇరవై లో కూడా అడుగు పెట్టలేదు.

గద్దే వీర రాఘవయ్య గారు హెడ్ మష్టారు గా ,గూడవల్లి బడిలో పదో తరగతి చదివింది.లైబ్రరీ రామయ్య గారు,ఇంటికి తెచ్చి ఇచ్చే పుస్తకాలన్నె చదివింది. సాహిత్య పరిచయం ,వారి పెళ్ళికన్నా ముందుదే. అళా,అప్పుడు ఉప్పెనలా ముంచెత్తిన శరత్, ప్రేంచంద్  అనువాద సాహిత్యమంతా ఆమెకు కొట్టీన పిండి.

వ్యవసాయ కుటబాలలో ,ఉమ్మడి కాపురాల్లో కట్టుబాట్ల మధ్యనే , ఆమె అక్షరం ఆమెకు ఆసరా అయ్యింది. పెళ్ళయిన దశాబ్ద కాలం పిల్లలు లేరు. ఆ కుటుంబం లోని అందరు పిల్లలు, తన ఈడు వారితో సహా ,ఆమె బాధ్యత వహించ వలసి వచ్చింది. కత్తి మీద సాము లాంటి ఆ వ్యవహారాన్ని ,ఆమె కష్టనిష్టూరాల కోర్చి ,నెగ్గుకొచ్చింది.

తీరా తాను అమ్మ అయ్యే నాటికి, బిడ్డలను తోడికోడళ్ళ వద్ద వదల వలసి వచ్చింది. వారు చదువుకోలేదు. పాడి పనులు ,వంటవార్పులు,పెళ్ళి పేరంటాలతో పల్లెటూరి ఉమ్మడి కుటుంబవిలువలతో , పెరగవలసి వచ్చింది. అమ్మ మొట్టమొదటి పోరాటం పిల్లలకోసమే. వారికి అక్షరం ముక్క అందించాలని. అలా,పాలమూరులో పట్టణ కాపురం మొదలయ్యింది. అప్పటీకే, పై తరగతులకు వచ్చిన పెద్ద పిల్లలు ,ఆమె విలువలని లెక్క పెట్టలేదనే చెప్పాలి.

వార్ని ఒక దారికి తెచ్చుకోను ,ఆమె జీవితాంతం శ్రమించింది.ఆఖరి క్షణం వరకు పోరాడింది. వారి బిడ్డలను,వారి బిడ్డల బిడ్డలను తను పెంచినా, మౌలికంగా,ఒక అమ్మలా ఆమె సంతోషంగా జీవించలేదు. ఎవరి పిల్లలు వారికి ముద్దు కదా. అందులోను,అమ్మకు. ఆ అసంతృప్తి చివరాఖరి వరకూ వరకు ఆమెను అంటి ఉన్నది. అమ్మ అమాయకత్వం గానీ, ఎవరి మనస్తత్వానికి తగినట్టు వారు ఎదుగుతారే కానీ, అమ్మ కోరినట్టుగా ఎలా పెరుగుతారు?

అమ్మ ఎప్పుడూ నాన్న గారితో అన్నట్టుగానే , “ఆవు వెళతా , దూడకు మేతేసి వెళుతుందా?”

అమ్మ నాన్నల వడిలో ఆడుకొంటూ పెరగకపోవచ్చు, గోరుముద్దలు తినక పోవచ్చు, వీపున ఉప్పుమూటలు ఆడక పోవచ్చు,భుజాన గుర్రపు స్వారీలు చేయకపోవచ్చు, అయినా  వారు జీవించిన జీవితంలో జీవిస్తూ, నిర్మించిన గృహవాతావరణంలో నివసిస్తూ, వారి స్నేహాల్లో, వారి అభిరుచుల్లో , సానుకూలత ఉండడం ,ఉండక పోవడం,  ఎవరెవరి ఇష్టాఇష్టాలకు సంబంధించినది. ఎవరి ఎవరి సంస్కారమూ, విచక్షణ వారిది.

ఇతరుల ప్రవర్తనకు అమ్మ నాన్నలు బాధ్యత వహించారు కాబట్టే, అందరూ వారిని కొనగోట నిలప గలిగారు.  అమ్మ నాన్నల సంస్కారం అందరినీ అర్ధంచేసుకొమ్మంది . కనుక, అందరినీ వారి వారి పరిమితులతో సహా అర్ధం చేసుకొంటూ, స్వీకరిస్తూ , వారు ఇరువురు  నిరంతరం శ్రమిచారు. దుఖించారు. మనసు కష్ట పెట్టుకొన్నారు. ఓదార్చుకొన్నారు. అయినా, చతికిల బడలేదు. “ముందుకు సాగాడం ఎలా?” , అన్న ప్రశ్నకు తమకు తోచినంత సమాధానం చెప్పుకొంటూ, నిలబడ్డారు. తమతో పాటూ నలుగుర్నీ నిలబెట్టారు. వారు ఇరువురూ, తమ ఊపిరి ఉన్నంత వరకూ అందరి క్షేమాన్ని కోరారు.

***

ఇక, ఎవరు నా రచనల గురించి  నాతో మాట్లాడాలనుకొన్నా, వారడిగే రెండో ఫ్రశ్న ,”రామనాథం కి మీ నాన్న గారే కదా స్పూర్తి” అని. నిజానికి , అమ్మ మూర్తి ని అనేక పాత్రలలో నింపే ప్రయత్నం చేసాను.

లలిత ,సావిత్రి, భారతి,అనురాధ,వత్సల ఇలా ఎన్నో పాత్రలకు అమ్మ నాకు స్పూర్తి నిచ్చింది.

అనేక ప్రతికూల పరిస్థితుల్లో ,తన కంటూ ఒక చిన్న ఉనికిని ఆమె కాపాడుకొంది. అనేక అసంతృప్తుల్లో, తన అల్పసంతోషాలతో జీవితాన్ని నెగ్గుకొచ్చింది.

ఆ ఉమ్మడి కుటుంబంలో ,పెద్ద బావ గారికి పెద్ద కోడలు వచ్చిన రోజున ,ఆమె ఎంతకూ వంగని తన ఉంగరాల జుట్టును , బిగించి ముడి పెట్టింది. ఆ కుటుంబ బాధ్యతలను తలకెత్తున్న రోజున ఆమె  ,ఇరవై లో కూడా అడుగు పెట్టలేదు.

గద్దే వీర రాఘవయ్య గారు హెడ్ మష్టారు గా ,గూడవల్లి బడిలో పదో తరగతి చదివింది.లైబ్రరీ రామయ్య గారు,ఇంటికి తెచ్చి ఇచ్చే పుస్తకాలన్నె చదివింది. సాహిత్య పరిచయం ,వారి పెళ్ళికన్నా ముందుదే. అలా,అప్పుడు ఉప్పెనలా ముంచెత్తిన శరత్  అనువాద సాహిత్యమంతా ఆమెకు కొట్టీన పిండి. వ్యవసాయ కుటుంబాలలో ,ఉమ్మడి కాపురాల్లో కట్టుబాట్ల మధ్యనే , ఆమె అక్షరం ఆమెకు ఆసరా అయ్యింది.

నా కొద్దిపాటి రచనల్లో చిప్పిల్లిన పువ్వులూ,ముగ్గులూ,వంటలూ,వడ్డనలు,పాటలు పండుగలూ,చేనేతలూ, సామెతలూపలుకుబళ్ళు  , కుట్లు అల్లికలూ,సినిమాలు ,పత్రికలూ ,అన్నీ అమ్మ పరిచయం చేసినవే. ఉమ్మడి కుటుంబాల కట్టుబాట్ల సంకుచిత వ్యవస్థలో ,తన ఉనికి నిలుపుకోవాల్సిన అవసరం తెలియ పరిచిన మనిషి.

అనేక ప్రతికూల పరిస్థితుల్లో ,తన కంటూ ఒక చిన్న ఉనికిని ఆమె కాపాడుకొంది. అనేక అసంతృప్తుల్లో, తన అల్పసంతోషాలతో జీవితాన్ని నెగ్గుకొచ్చింది.తన ఇష్టాయిష్టాలను ప్రకటీంచడానికి ఏనాడు వెనకాడలేదు.  తన ఆలోచనను నిలుపుకోవడానికి పోరాడింది.తీవ్ర అనారోగ్యంలో కూడా ,ఆశావహ దృక్పథాన్ని వీడలేదు.

మనిషి స్వాభిమాని.ఏనాడు ఒకరి ముందు చేయి చాచ లేదు. తల వంచ లేదు. కష్టమైనా నిష్టూరమైనా,నిలదొక్కుకుంది. నిలబడింది. నిలదీసింది.నిలబెట్టింది కూడా !

ఎప్పుడూ వర్తమానకాలంలో జీవించేది. ఆధునికంగా ఆలోచించేది. ఆమె ఆలోచనలన్నీ అమలు చేసి ఉంటే, ఎలా ఉండేదో.

***

అవి శ్రీలక్ష్మి ,ఆయేషా ఉదంతాల రోజులు. ఆడపిల్లలు వంటరిగా పట్నమెళ్ళి చదువుకోవాలంటే, ఎక్కడ చూసినా ఒక అభద్ర భావన.
పల్లెల గడపల్లోంచి పట్నానికి చదువులకోసం వచ్చే ఆడపిల్లలకు ఒక సురక్షితమైన ఆవాసం ఉండాలనీ..
ఒక అమ్మాయి చదువు,వృత్తి నైపుణ్యము ,ఆ కుటుంబానికంతా ఆసరా అవుంతుందనీ, నాన్న గారు చాలా స్పష్టంగా నమ్మారు. తనకు తోచినంతలో కళాశాల విద్యార్ధునిలకు ఒక వసతిగృహం ఏర్పాటులో చాలా కృషి చేశారు.

గుంటూరులోని , డా. కాసరనేని జయప్రదాంబ డిగ్రీకళాశాలకు అనుబంధమైన ఈ వసతి గృహానికి నాన్నగారికన్నా ఎక్కువ ఆర్ధిక సహాయం చేసిన వదాన్యులు ఉన్నప్పటికీ. ఆయన ఆలోచననూ  కృషిని దృష్టిలో ఉంచుకొని, వారి పేరునే నిర్ణయించారు ఆ కమిటీ వారు, డా. కాసరనేని సదాశివరావు గారి అధ్యక్షతన.
అప్పుడు, నాన్నగారు ,”తన పేరు వద్దనీ అమ్మ పేరు పెట్టమనీ”, ఆఖరుకి అమ్మపేరుతో నాన్నగారి పేరునీ కలిపి, ఇలా.

“ కోటపాటి సరోజిని దేవి మురహరి రావు విద్యార్థినుల వసతిగృహం” అయ్యింది.
శ్రీ రావెల సాంబశివ రావు గారికి ధన్యవాదాలతో.

***

మొన్న శీతాకాలం సెలవల్లో, అమెరికా వెళ్ళబోతూ, దేశాంతరాన ఉన్న మనవడికి ఒక సందేశం ఇమ్మన్నాను.” సందేశం లేదు.ఏమీ లేదు. పొమ్మంది.” సరే , “ఏదో రెండు మాటలు చెప్పు” అని పట్టుబట్టా.

“ధైర్యంగా ఉండు. వెళ్ళిన పని సాధించుకురా !”

నాన్న గారికి,మా అందరికీ  అమ్మ ఎలా ప్రేరణ అయ్యిందో ,ఈ రెండు వాక్యాలు వింటే తెలియదూ?

***

అమెరికా నుంచి  వచ్చే సరికి అర్థరాత్రి దాటింది . అమ్మ మెలుకువగానే ఉంది.

పలకరింపులయ్యాక, “అమెరికా నుంచి నాకేం తెచ్చావ్?” అని నిలదీసింది.

“ఆలస్యమయ్యింది. రేపు పొద్దున తీస్తాలే !”  అన్నా ప్రయాణ బడలికలో.

“ ఏం తెచ్చావో ఇప్పుడే ఇవ్వు !”అని పట్టు బట్టింది అమ్మ.

ఆకుపచ్చని ఊలు స్వెటర్.ఇచ్చాను.  వెంటనే, సంబరంగా తొడుక్కొంది. అల్లిక నచ్చింది. ఆకుపచ్చ నచ్చింది. వెచ్చదనమూ నచ్చింది.

అమ్మ మురిసిపోతూ అంది,” అందుకే అంటారు,అడగందే అమ్మ అయినా పెట్టదు. అడగందే కూతురయినా ఇవ్వదు అనీ ! ”

స్పృహలో ఉన్న ఆఖరి అయిదు రోజులూ,ఆసుపత్రిలోకి వెళ్ళే దాకా ,ఆ ఆకుపచ్చ ఊలు చొక్కాను అడిగి మరీ తొడుక్కుంది.

అయినా, అమ్మ అడగాలా ఏమిటి?

నాకు తోచినంతలో నాలుగు అక్షరాలను ఆమె కు ఆత్మీయంగా ఇవ్వడానికి.

అమ్మ నాకు ఒక ఉదాహరణ.

అందుకే ఆమెకు ,ఈ చిన్న పుస్తకం.

“ ఇదం శరీరం. “

అన్నట్లు, “పరోపకారార్ధం ఇదం శరీరం” అన్న ఆ శ్లోకమూ నాకు అమ్మే ఇచ్చింది !

ఈ రోజటి శోకాన్ని కూడా.

***

 

Scan0003-001
Enter a caption

” ఇదం శరీరం” అమ్మకు ఇస్తూ.

అబ్బూరి చాయాదేవి గారు, ఓల్గా గారు, సురవరం విజయ లక్ష్మి గారు.కోటపాటి మురహరి రావు గారు. 29-12-2004

Scan0001-001
Enter a caption

పుస్తకావిష్కరణ , శ్రీ బొమ్మారెడ్డి గారు.

Scan0005-002
Enter a caption

తొలిప్రతి అందుకొంటోన్న సురవరం సుధాకర్ రెడ్డి గారు.

Scan0001
Enter a caption

అందరితో అమ్మ. అబ్బూరి ఛాయా దేవి,పద్మశ్రీ యలమంచలి,ఓల్గా,సత్యవాణి, డా. మంజులత ,రాధా రాణి,సురవరం విజయ లక్ష్మి గార్లు.

Scan0002-002
Enter a caption

ఫ్రసంగిస్తున్న సురవరం సుధాకార్ రెడ్డి గారు. పక్కన నర్రాకోటయ్య గారు, ఐ .వెంకట్రావు గారు.

Scan0002

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s