గంగాభాగీరథీ సాక్షిగా !

సుమారు మూడేళ్ళ క్రితం, ఒక సరికొత్త హోదా వచ్చి బైఠాయించింది.

IMG-20160518-WA0017

నా కన్నా ఒక ఏడాదిన్నర ముందు మా అమ్మకూ ఈ గౌరవం దక్కింది.

మేము గంగా భాగీరథీ సమానులమయ్యాం.

అప్పటి నుంచి బోలెడన్ని కొత్త విషయాలు తెలిసాయి.

అహహ.కాదు కాదు . తెలియజేయబడ్డాను.

పొద్దున్నే లేచి పనీ పాటలు చేసుకోవాలి కదా,  మన బోటి వాళ్ళకి  అటూ ఇటూ తిరగక తప్పదు మరి.

మా అమ్మకు ఆ తిప్పలు లేవు. మంచంలో ఉండడం. ఒకే సమయాన, చక్రాల కుర్చీలో చక్కర్లు. ఎంత తిరిగినా,నట్టింట్లోనే.

పిలవలని పేరంటాలను పక్కన పెట్టి, పిలిచిన పెళ్ళిళ్ళలో పేరంటాలలో.

శుభాశుభాలలో ఎవరినీ ముట్టుకోకూడదు. శుభాశుభాలలో ఎదురు రాకూడదు .వగైరావగైరా.

శుభ వేదికల మీద కాలూన కూడదు. శుభాశీస్సులు అందించ కూడదు.తదితరాలు.

అయినవాళ్ళవీ కానివాళ్ళవీ, ఓ పదో పదిహేనో పెళ్ళిళ్ళు నడుం బిగించి,కిందా మీదా పడి,కళకళలాడుతూ  చేసిన అనుభవం, పెట్టిన ఖర్చు, ఎలాగు మిగిలింది కదా. సరే,  కాస్త తీరిక చిక్కింది లెమ్మని, ఒక పక్కన ఏ కుర్చీనో దులుపు కొని, సావకాశంగా నలుగురినీ పరికించడం ,కొంత వెసులుబాటుగానే ఉంది.

ఎవరో దయగల చుట్టమో పక్కమో , దగ్గరికి వచ్చి పలకరింపో పరామర్షో చేసి వెళుతున్నారు.

ఎవరి శాయశక్తులా.వారి అభిమానాలనీ ఆపేక్షలనీ పంచి వెళుతుంటారు.

దయ లేని చుట్టాలు, కొంగు దులుపుతూనో, ముక్కు విరుస్తూనో,కనుబొమలు ముడేస్తొనో.

అప్పుడో మాట. ఇప్పుడో మాట. నా చెవి వైపు వీచే గాలిలో పడేస్తారు. అటూ ఇటూ మాటలు పొడుస్తుంటారు.

“అబ్బా ,పొద్దున పొద్దున్నే , ఈవిడ మొహం చూశానేట్రా ! చ ! ”

అంతటితో ఆగితేనా…ఊహు !

“ఏంటి !?!  ఆమె పెళ్ళి మండపం మీదకా? శుభమా అని పెళ్ళి జరుగుతోంటే , ఎవడో ఏదో అన్నాట్ట ! ”

“అమ్మో! ఆమె చేత్తో కానుకలా? ఏడాది తిరిగే లోగా, మనమూ ఆమె లా అవుతాం  !”

” చీరాసారా ఆమెకు మన చేత్తో పెట్టడమా ? ఆమె లాంటీ వాళ్ళే ఆమెకు పెట్టాలి. మనం పెడితే,ఆమె లాగే మనమూ  …”

ఆ నోళ్ళతోనే …ఇలానూ….. !

” చూడండి, మహారాణి ! ఎలా పక్కన కూర్చుందో ! ”

“ఎప్పుడూ సాగించుకొంటదీ, అందరూ వెళ్ళి ఆవిడని పలకరించాలి కాబోలు !”

” ముచ్చు ! ఎలా  ముంగిలా, ఆ మూలన కూర్చుందో చూడు ! ”

“ఒక్క పని ముట్టుకోదు ! ఆ మాత్రానికి రావడం ఎందుకూ ?”

“అందరు బంధువులయా..ఆనందంగా ఉండండయా ” అనుకొని , “లక్ష్మీ సౌభాగ్యవతులు చిరంజీవులు గా సదా సర్వదా వర్ధిల్లాలనీ” మనసారా అనుకొని,  “నరుడి నాలికకి నరం లేదు కదా “అని వేదాంతించుకొని,

ఆ చెవి మాట ఆ చెవి తమ్మెని వేళ్ళాడకుండా విదిలించుకొనాలనే చూస్తా.

అప్పుడో మాటా ఇప్పుడో మాటా,  నా బుర్రలో దూరి ,ఎక్కడ బుర్రని బర బరా తొలిచేస్తాయో అని,  మా అమ్మాయి మా ఇంటి వాకిట్లో ఒక బూజు కర్ర వేళ్ళాడ దీసి ఉంచింది. బుర్ర బూజు దులపనిదే, ఇంటి గుమ్మం ససేమిరా తొక్క నివ్వదు. అదొక ముచ్చట ఆవిడకి !

ఇంతలో, దక్షిణాది నుంచి పిలుపొచ్చింది.

“అక్కా, మా బిడ్డ ఒక పుస్తకం రాసింది. నీవు వచ్చి నీ చేతి మీద విడుదల చేసి, ఆశీర్వదించక్కా ! ”

వెళ్ళాను. బోలెడు బంధువులు.

మొదటి పుస్తకం కదా , నేను ముట్టుకొవచ్చా, నాచేత విడుదల చేయొచ్చా , అన్న ఉత్తరాది ప్రశ్నలు ఎందుకో ఏమారి పోయాయి. ఆ ఏమరుపాటులోనే , ఆ శుభకార్యం బ్రహ్మాండంగా ముగిసింది.

పిన్నాండ్లు చుట్టూ చేరి, కువకువలాడుతూ నిండా మురిపించారు.

మళ్ళీ ఈ నడుమ , దక్షిణాదికి రమ్మని పిలుపు.

మొదటి సారి తెలుగు అక్షరాలు నేర్చిన సంబరాన మొదటి తరగతి వారి నుంచి.

ఇది, మరింత శుభకార్యం. అక్షరాభ్యాసం చేసినంత పుణ్యకార్యం. అబ్బెబ్బే , నాబోటీ వాళ్ళు ఆ వేదిక మీదా! అన్న ఉత్తరాది సందేహం ములుకులా గుచ్చుకొంది. అదేమో, మళ్ళీ ఏమరుపాటు .

వెళ్ళి, సవినయంగా , ఒక పక్కగా ఒద్దిగా కూర్చున్నా, తమ్ముడు సెంథిల్ అరుగు మీదికి పిలవసాగాడు. అంతదాకా వచ్చి ఆగడం  సభామర్యాద కాదు కదా…ఆ శుభవేదిక ను ఎక్కాను.

అక్కడ ఉన్నది నేనొక్క దానినే. అందరూ పెద్ద వారు. ఒద్దిక గా కూర్చున్నాను. సెంథిల్ తమ్ముడు మళ్ళీ పిలిచాడు. “అక్కా, వచ్చి దీపం వెలిగించండీ, మాకు నిండా సంతోషం !” అని.

నేను అటూఇటూ ఓ క్షణం దిక్కులు చూసి. ఇటు పారుపల్లి కోదండ రామయ్య  గారు , అటు దామోదర్ రెడ్డి గారు, ఇటు గారపాటి  ఉమామహేశ్వర రావు గారు, వారి వెనుకగా సీతాపతి గారు, ఈ పక్కన ముందు వరసలో ఉన్న, స.వెం.రమేశ్ గారు, మునిరాజు గారు, ఆ పక్కన పద్మావతి గారు, చిన్నారి  సంజనా పద్మం  లను ఒక్కసారి చూశా.

పెద్ద మంటపం  అరుగు మీద, అందరూ నిలబడి , నాచేత ఈ పనిని చేయించారు.

తెలుగునుడి దివ్వెను వెలిగింప చేశారు.ఒక శుభకార్యానికి  ఆరంభం చుట్టారు.

***

దక్షిణాది వారి మాట ఎత్తగానే,” అమ్మో ! వాళ్ళా, పురాతనులు ! వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు! వాళ్ళ చాదస్తాలు , వాళ్ళు ! ఒట్టి పాతకాలం మనుషులు.అబ్బాబ్బా , వేగలేరు.” ఉత్తరాదిన ఉచితసలహాలు ఉప్పెనలా  ముంచెత్తాయి.

“అమ్మో ! అవునా?అంతేనేమో!” మొదట  అనుకొన్నా.

వారు భౌతిక బంధువులు. ఉత్తరాదివారు. వారి నమ్మకాలు వారివి.

వీరు బౌద్ధిక బంధువులు. దక్షిణాది వారు. వీరి ఆపేక్షలు వీరివి.

అదే నేను. అదే అమ్మ.అదే గంగాభాగీరథీ సమానులం !

అమ్మ ఉంటే తటాలున ,అడిగేద్దును.

” అమ్మోయ్ !  వీళ్ళలో  ఎవరు సంస్కారవంతులు ,ఆధునికులు అంటావ్?”

“ఉత్తరాదో దక్షిణాదో,  మన బోటి వాళ్ళని తమ తోటి మనుషుల్లా ఎవరు చూస్తారో, వారు !” అని అనేది అమ్మ .

మా అమ్మ ఎప్పుడూ ఇంతే!    ఖంగుమంటుంది !

మంచు కొండలనే  ఉవ్వెత్తున చీల్చుకు వచ్చే ,

ఆ ప్రచండ గంగాభాగీరథి ఝరిలా !

PS:గంగాభాగీరథీ సమానురాలు : A widow.IMG-20160518-WA0009-001

ప్రకటనలు

8 thoughts on “గంగాభాగీరథీ సాక్షిగా !

 1. ఈ పోస్ట్ చదివితే మనసు మూలిగింది.
  మేం ఉత్తరాదో దక్షిణాదో( ఆ మాటలు సాపేక్షమైనవి కదా) నాకు తెలీదు గాని విస్తరించిన మా కుటుంబం (extended family)లో ఒక పసి వాడి తల్లి, యువ వితంతువు కి పునర్వివాహమై కళ కళ లాడుతూ జీవనం సాగిస్తోంది. జ్ఞానం తెలీకముందే తండ్రిని కోల్పోయిన ఆ పసివాడికి ఒక విశాల హృదయుడైన తండ్రి దొరికాడు.
  దురదృష్టవశాత్తూ ఒక Sadist భార్య అయి, విడాకులు పుచ్చుకున్న మరొక స్త్రీ విదురుడైన మా బంధువుని వివాహమాడి, తన పిల్లలకు తండ్రి ప్రేమ, అండా దండా దొరికేలా చేసి, అతని కుమారుడికి తాను తల్లి ప్రేమనందిస్తూ ఆ ఇంటికి పూర్వపు శోభని తీసుకొచ్చింది. డెబ్భై అయిదేళ్ల మా అమ్మ, ఎనభై అయిదేళ్ల మా నాన్నగారితో పాటు కుటుంబంలోని పెద్దలంతా ఈ రెండు జంటలనీ మనసారా దీవించారు, ఆదరించారు.
  సంస్కృతి ఒక శిల్పం కాదు, ఎప్పటికీ ఒకేలా ఉండిపోవడానికి. అది ఒక జీవనది. అందులో సదాచారాలూ దురాచారాలూ కూడా వానకి కొట్టుకొచ్చే చెత్తా, మన్నూ లాగే కలుస్తూ ఉంటాయి. చెత్తని ఏరి పారేసుకుని ఆ జీవజలాల్ని పరి రక్షించుకునే బాధ్యత మనదే. ఈ ఇరవయ్యొకటో శతాబ్దాంలో మీరు వర్ణించిన సన్నివేశాల్ని ఊహిస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది! ఇలాంటి మనస్తత్వాలు వెదజల్లే దుర్గంధం వల్ల ప్రతిభాన్విత అయిన ఒక రచయిత్రి సాహిత్యానికి దూరమవడం పెద్ద విషాదం!

  మెచ్చుకోండి

  1. అక్షరాల్లోని సాపేక్షతను, ధ్వనినీ, నిగూడతనూ ,అంతకు మించీ ఆ అక్షరాల్లో నిండిన నిశ్శబ్దాన్ని అర్ధం చేసుకొన్నందుకు సంతోషం నాగలక్ష్మి గారు.మీరు చూపిన ఆపేక్షకు అభిమానాలు. తప్పక , మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. స్నేహంతో.

   మెచ్చుకోండి

 2. Madam, very sorry to hear about your loss. Truly, deeply saddened..you are in my thoughts and in all my prayers from the time I read this..:(

  ప్రేమ కాక మరేదైనా మీకు ఇవ్వగలిగిన వాళ్ళందరి మీదా కోపంగా ఉంది, బాధగా ఉంది. చెప్పినంత తేలిక కాదు కనుక, మీరు వీటన్నింటిని దాటుకుంటూ కోరుకున్న తీరం వైపు హాయిగా సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నానండీ..

  Lots of love.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s