అనగనగ అతిశయమే !

No automatic alt text available.

అవును గానీ,

చెల్లి కృష్ణమ్మ నల్లని నిగారింపులతో బిరబిరా సాగుతుంటే, సోదరి గోదావరమ్మ పాలవెన్నెల్లా పరుగులు పెడుతుందేం? ఎగిసిపడే గంగమ్మ మిడిసిపాటును, ఏ కంట జారిన కన్నీటి చుక్క ఏ కొనగోటను ఒడిసిపట్టి, అణిచిపెట్టిందో !

అది “ఉట్టి” అయితేనేమి.ఉరుము ఉరిమి “మంగలం” మీద పడి,ఆ “వేపుడు చట్టి” పెటిల్మంటేనేమి?

“తడి” ఆరని “చిగురు” చీకట్లలో ,వెలుగుతోన్న “దివిటీ” కావచ్చు. పిల్లల ఆటలవేళల పకపక నవ్వులు మోసుకు వచ్చేది, ఆ క్రమం తప్పనివ్వని గంటలు మోగించే “బడిబూరాలు” కావచ్చు.

https://mail.google.com/mail/u/0/#search/maganti.org%40gmail.com/15c8de6ddf4a01c5?projector=1

పాలసముద్రంలో దాగిన చిన్ని శంఖం “ఉగ్గు”గిన్నైన వైనం ఎట్టిదబ్బా?

విప్పారిన మోముతో పొద్దు తో పాటు తిరుగుతూ ఉండే పూబాలల ఊసులేమిటో?గోసలేమిటో?

జుట్టున్నమ్మ ఏ కొప్పైయినా ముడవచ్చు. మరి, గిరిజాల జుట్టున్న అయ్యగారి మాటేమిటి?అది కుసింత తరిగి “ఇంద్ర లుప్తకం”అయినప్పుడు , అదేనండీ జుట్టుతల బట్టతల ఎలా అయిందో అప్పుడు  ఆ పెద్దమనిషి యవ్వారం ఏమిటో ! దానాల ధర్మరాజు గారు  దడిపించే దయ్యం అవ్వడమేమిటో,

’ అలా ఇనుపగజ్జెలు కాళ్ళకు కట్టు కొని అర్థరాత్రిళ్ళు అపరాత్రిళ్ళు  నాట్యాలాడితే, సెప్టిక్ అయ్యి ఛస్తావ్’ అన్నమాటకే దడిచిపోయి, గడ గడ వణికిపోతూ చేసిన గడబిడ ఏమిటో,  బర బర లాడే ఆకాశవాణి తరతరాల  దెయ్యాల్ని ఎలా తరిమేస్తోందో, పడీ పడీ నవ్వకుండా చదివగలరా మీరు ?

అది సరే, గానీ ఇది “ఎప్పటి కుక్క. మహాభారతం నాటిది.”

ఇలా చెప్పుకొంటూ పోతే మహాభారతమే !

కాళిదాసు విరచిత అజుడి జీవితమైనా , తిక్కన గారి దుస్సల అయినా,చెకోవ్ చేతిరాతల చెక్కిన కళాశిల్పం అయినా, జాకిర్ హుస్సైన్ గారి అబ్బుఖాన్ కీ బక్రీ అయినా, మరేదయినా వంశీ గారి మాటల ఒరవడిలో, మర్యాదగా ఒదిగిపోయి , మలుపులు తిరిగి,మరొక మారు హాయిగా చదువుకొనే అచ్చ తెలుగు కథనమై పోతుంది.  కథలకు పుట్టిళ్ళు ఖాట్మండు,హవాయి బల్గేరియా,అస్సాం, ఈ భూమి మీద ఏ మూలవి అయితేనేమి?  ఏసొప్ ,ఫ్లోరా అన్నా ,చెకోవ్ ఎవరు రాస్తేనేం…అన్నీ వంశీ గారి ఆశుకథనాల్లోకి ఒదిగి పోవాల్సిందే. పిట్ట కథలు,గట్టి కథల ఉత్తిత్తి కబుర్లు కాకరకాయలు బోలెడు.మరి, గంగాళం పాయసం తినిన చక్కెరపాలు తక్కువ అవుతుందా?

గ్రాంథికంలోని గాంభీర్యమూ, అచ్చతెలుగులోని అందచందము ఒకే మారు పరిచయం చేస్తాయి అనేక కథలు. విస్రంభుడు,కంకముఖుడు,మీవడుడు,తక్రసారి ,మహీలత ఇలా ఒక వైపున పరిచయం చేస్తూనే, నమ్మకస్తుడు,పట్టకార,మీగడ ,వెన్నపూస,వానపాములను , ఆయా పదాల  విశిష్టతలను, వివరాలనూ అలవోకగా అందిస్తాయి. ఈ లెక్కన అటు ఆవకాయ, ముద్దపప్పు ,ఇటు అరిసెలు,పరమాన్నం  ఒక్క సారే, పచ్చటి అరిటాకు పరిచి మరీ వడ్డిస్తాయి.

అసలు తలే లేక పోతే ,తల పొగరు ఎక్కడ ఉంటుంది? తలపులు ఎక్కడ ఉంటాయి.  తరిచి తరిచి చూడడం ఎక్కడ ఉంటుంది?   నిజమే గా! తల ఊపేలా వినిపించిన కథనమేగా, తలయొగ్గి నిలబడుతుంది.

యముడి అదృశ్య రూపమూ, సరస్వతీనది అంతర్వాహిని అయిన వైనం, ప్రశాంత చిత్తంతో చేసే ధ్యానము, శూర్పణఖ చెవిముక్కులు కోసిన వైనం , వినయసంపన్నుడు పోతరాజు కాలాన్ని జయించి విరాజితమైన వైభవం, గురువు గారి గాడిదకు వేసిన ముకుతాళ్ళ మూఢాచారపు మూలం, కప్పనెత్తినున్న కళ్ళు చూపిన సమతాలోకం, కంఖాణమ్మ కాలం వొరవడిలో కనుమరుగైన తీరు ,  ఒకే గొంతులో విడమరిచి చెపుతాయి. తొణుకుబెణుకూ లేకుండా.

ఇవి, అనగా అనగా వినవలసినవీ. వినగా వినగా అనవలసినవీ.

పిట్టకథలని రచయిత సవినయంగా స్వయంగా పలుమార్లు ప్రస్తావించినా, ఇవి ఒట్టి కథలు కావు. గట్టివి.

ఒక్క మహావిస్పోటం కథ చూడండి. ఇంతకీ ఆ మహాదేవుని ముద్దు బిడ్డ ఎవరండీ? కాలం. సుకుమారంగా సుందరంగా , విశ్వాంబరంలో కాంతిబంతితో , అల్లన మెల్లన ఆడుకొనే అందాల ఆడ బిడ్డ.

ఆ వైనాలన్నీ ఎంత అలవోకగా, ఆశువుగా, అందంగా చెపుతూ పోతారో !

అందుకేగా అంటారు,అన్నిందాలా అభూతకల్పనలకు మూలాలు వాస్తవ కారణాలలో ఉంటాయని.

అదండీ సంగతి.

వివిధ కాలాల్లో ఆయా సంధర్భాల్లో, వంశీ గారు చెపుతూ పోయిన చిన్న చిన్న కథలే, అనగనగ రమణీయం అయ్యాయి.

తమ కథాప్రయత్నాల పరమార్థము తెలుపుతూ అంటారు రచయిత  ఒకచోట , “తెనుగు పదముల ఉపయోగార్థం గొప్పతనమును గ్రహించవలె.” అంతేనా?  అచ్చ తెలుగు మాటల అందంచందం, సొంపుసొబగు, వంపువయ్యారమూ ఇచ్చోట తనివి తీరా తడిమి చూడాల్సిందే!

వంశీ గారి మాటల ఒరవడి లో పడి కొట్టుకుపోతామా, మాటల తిరగలి లో మెత్తబడి, ఒత్తిగిలి, గిర్రున తిరిగి వస్తామా అన్నది, ఆయా పాఠకుల శబ్దార్థ జ్ఞానాలపై ఆధార పడి ఉంటుంది కదా మరి.మిగిలినవన్నీ చదివి గ్రహించవలసిందే.

మళ్ళీ ఒక మారు, మౌఖిక సాహిత్యం సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని,సౌభాగ్యాన్ని  తడిమి తరించే సంధర్భాన్ని ఈ “అనగా అనగా” కథలు కలిగించాయి.తళుకుబెళుకులు ఎరుగని ,జాన తెనుగుల చెణుకులను పదిలంగా అందించిన వంశీ గారికి ధన్యవాదాలు. వారి దంపతీ బాందవ్యానికి వేడుకగా, ఈ పుస్తకాన్ని ,తమ బిడ్డడి నుంచి కానుకగా అందుకొంటొన్న   అమ్మానాన్నలకు నమస్కారాలు.

““అనగా అనగా అనగా

అనగా అనగా అనగానే ఒక కథ.

అనగా అనగా అనగానే ఒక “ఊ “కొట్టటం .

అనగా అనగా అనగానే ఒక అనుభూతి .

అలా  ఎన్నిటినో తనలో ఇముడ్చుకొన్న ఆ చిన్న  పదం.

ఆ చిన్న పదానికి ఎంతో పెద్ద అనుభవం ఉన్నది.

అలా ఈ కథకు కూడ.”

మరి మీరు కూడా అననగనగా అనుకొంటూ , ఈ చిట్టికథలను గట్టికథలను పిట్టకథలను చదివి తరించండి.

సత్వరం ! శుభాకాంక్షలు !

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s