వాని శిరసు

Ravana Heads

తలకు తలను తాటిస్తూ

గాలిలో మొలిచిన తొమ్మిది తలలనీ

నిక్కించిన  మెడ మీద నిలిపిన

వాని శిరసు

తల్లి పేగు తెంపుతూ ,

కడుపారా నింపిన,

అమృతభాంఢాన్ని, భద్రంగా

బొడ్డుతాడుతో చుట్టలు చుట్టి,

ఎంతగా విరగ బడ్డాడనీ…!

 

ఈ పాటికి…

అందంగా రంగులద్ది,

బుంగ మీసాలు దిద్దిన

ఆ పది తలకాయలూ

ఫెటిల్మని పేలి ఉంటాయి.

వింతవింత శబ్దాలను చేస్తూ

ముక్కలుముక్కలయ్యి చెల్లాచెదురుగా

చీకటిశకలాలను వెదజల్లి ఉంటాయి.

పండగెళ్ళిన కడపటి రోజుగా, ఇక

ఆరిన బూడిదను చీపుర్లతో ఎగదోసి

చెత్తబండి లో ఏట్లోకి రవాణా చేయడమే.

పగిలిన వాని శిరసులు

చెల్లించుకొన్న మూల్యాలు

అదేమిటో గానీ, ఈ మాటే

తరం తరువాత తరం ,

ఇంటా బయటా

భయంతో భక్తితో

చిలువలుపలువలుగా నేర్పుతూ వచ్చినా,

పది జతల  కళ్ళు నిప్పుల్లో తగల పెట్టినా,

తలలు బద్దలుకొట్టి భీభత్సంగా  చూపెట్టినా,

వాని శిరసు పగల !

వంకరతోక లాగా మళ్ళీ అదే తంతు

పుర్రకో బుద్ధి, పుట్టెడు కీడు

పేడపురుగు గుడ్డులా

ఏ బుర్రలో దాగి ఉంటుందో

ఎప్పుడు వెర్రి తలలు వేస్తుందో.

ఇంటా కాదు బయటా కాదు
కిక్కిరిసిన వంతెన గుంపు
గతి తప్పిన తొక్కిసలాట కాదు.
పట్ట పగలు ,చిమ్మచీకటి
ఎక్కడ ఎలా అర్రులుచాస్తుందో.

పిల్లాలేదు పాపాలేదు.

ముసలీ లేదు ముతకా లేదు

వావి వరసా అసలే లేదు.

ఆమె అమ్మ అయితే చాలు!

వాని శిరసు పగల!

ఫెటిల్లున బద్దలయ్యిన బాణాసంచాల

దద్దరిల్లిన విధ్వంస ధ్వనుల మధ్య

కాలీకాలని కాగితపు భస్మాల్లోంచి

వాని శిరసు ఒక్కోటి తలెత్తుతుంది.

చెక్కేసిన చెల్లెలి ముక్కుచెవుల మీదుగా.

వాని శిరసులు మీసాలు దువ్వుతున్నాయి.

మరెక్కడో,

మట్టిలో పుట్టి మట్టిపై నిలిచి ,

భూకంపంలా గర్జించే, మరొక

సీతాయణం మొదలవుతుంది!

 ( PC:  టి.సంపత్ కుమార్ , న్యూ ఢిల్లి, గారికి ధన్యవాదాలు . సంపత్ గారు పంపిన ఫోటొలు చూసిన నపుడు అనిపించిన మాటలు. )

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s