గుక్కెడు నీళ్ళు.గుప్పెడు ఖర్జూరాలు.

 

1-Oasis 4
1.Gifting her human dignity
1-Oasis 2
2. Dr.Kandimalla Jayamma garu ,Founder President ,Oasis
1-Oasis 3
3.Chandra Latha With Oasis Team:Ms.G. Susila garu, Ms. K.VIjaya lakshmi garu, ,Dr.K.Jayamma garu, Ms.Sarala garu, Ms,Beebi Jan garu.

 

తెలుగు నాట నాట్లేసి,కలుపు తీసి, కోతలు కోసి,నూర్పిళ్ళు చేసినా , పాడిపనులు పాచి పనులు చేసినా,

పట్టుకొచ్చిన చేపారొయ్యల్ని బుట్టల్లో పెట్టి, ఇంటింటీకీ తిప్పి అమ్మినా,  మగ్గం మీద నేస్తోన్న చీరకు నూలు కండేలు వడికినా, రంగులద్ది, బూటాలు కుట్టి,జరీలు పేనినా, వంట చేసినా పిల్లలను పెంచినా,పాఠాలు చెప్పినా, వైద్యం చేసినా, పురుళ్ళు పోసినా, ప్రాణాలు నిలిపినా ,  వాళ్లందరూ అప్పటికీ ఇప్పటికీ , ఆడవారే.

ఉరుకులు పరుగులు పెట్టి ,నిలువు కాళ్ళ మీద నిలబడి, ఊపిరితీసుకొనేంత తీరిక కూడా లేనంతగా ఉద్యోగాలు చేస్తున్నారు.ఇల్లు, బడి,బ్యాంకు,ఆఫీసు,హాస్పిటల్,మాల్,పొలం, తీరం, సంత , అక్కడ ఇక్కడ ఎక్కడైనా వారే.

ఉదరపోషణార్థం ఉద్యోగం. ఉనికి కోసం కూడా ఉద్యోగమే. ఉద్యోగం లేక పోతే ,ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే తరం మనది. ఈ ఉద్యోగపర్వం అంత సుగమమార్గమేమీ కాదు.కుటుంబం,సమాజం ఏర్పరిచిన అనేకానేక, చట్రాల నడుమ నిలబడి నిర్వర్తించాల్సిన విధులు.

ఆ క్రమంలో ఇంటా బయటా, ఆడవారు పదింతలు శ్రమచేయాల్సి వస్తోంది.  సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటప్పుడు, మర్యాదాచట్రాలను కుటుంబ కట్టుబాట్లను దాటి, పెదవి విప్పి మాట్లాడడానికి, భుజాన తలవాల్చి ఓదార్పు పొందడానికి , తమ మర్యాదను కాపాడుతూనే ,ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడానికి  ఒక నమ్మకస్తురాలైన  స్నేహితురాలు ఉంటే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. సరిగ్గా, అలాంటి స్నేహహస్తమే ఒయాసిస్సు.

ఒక్కోసారి అంతే.

దిక్కులన్నీ ధిక్కరించినట్లుగా ఏ పరిస్థితీ కలిసి రానప్పుడు, ఏ దిక్కూ తోచక, ఏ దిక్కూ తెలియక ,ఏ దిక్కుకు వెళ్ళాలో వెళుతున్నామో  తెలియని ఎడారి ప్రయాణాలు మన అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవం లోకి వస్తాయి.

అలాంటప్పుడే, ఒక గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తాం. ఆశగా వెతుకుతాం. అదుగో అక్కడో నీటి చెలమ అన్న వార్త ,చూచాయ గా చెవిన పడగానే, ఆలోచించకుండా ఆత్రంగా పరుగులు పడతాం.

ఆ నీటి చెలమ వడ్డున ఖర్జూరం చెట్టనీడలో  గుడారం బిగించి ,సేద దీరి, ధైర్యం పుంజుకొని, ఓపిక తెచ్చుకొని , మరొక సుధీర్ఘ ఎడారి ప్రయాణానికి సిద్దమవుతాం.

కానీ, ఈ సారి వంటరితనం, భయం ఎటు పోయాయో !

అంతూదరీ లేని  జీవనపు ఎడారిలో, ఆ చల్లటి స్నేహభరిత నీటి చెలమ, ఈ ఒయాసిస్సు !

ఒక్కోరిది ఒక్కో రకమైన సమస్య. ఒక్కో సమస్యకు ఒక్కో రకమైన పరిష్కారం. ఒక్కో వివాదానికి  ఒక్కో రకం తీర్మానం.

ఆరోగ్యం, విద్య, ఉపాధి మొదలైన వాటి విషయాల్లో మార్గదర్షకత్వంతో పాటు, చట్టపరమైన దిశానిర్దేశానికి,ఒయాసిస్సు సభ్యులు సాటి సోదరీమణులకోసం అండదండగా నిలబడడం , చెప్పుకోదగ్గ విషయం. రాజకీయ పరమైన సమస్యలూ, సామాజిక పరమైన ఇబ్బందులు, సాంస్కృతిక క్లేశాలు ,ఒకటేమిటి?

అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఎప్పుడయినా అన్నింటా తామున్నామని నిలబడిన , ఆ విదుషీమణుల స్నేహబృందానికి జేజేలు. చిలకలూరిపేట లాంటి చిన్న పల్లె పట్నం కాని వూరిలో ,కొందరు విదుషీమణులు  పూనుకొని,  ఇలాంటి ఒక సంస్థను మొదలు పెట్టడడం మామూలు విషయం కాదు. వైద్యంతో మొదలుగా అన్నిందాలా ,ఆడవారికి అండగా నిలబడడం  సామాన్యమైన సంగతేమీ కాదు. తమ తమ వృత్తివ్యవహారాల్లో , పనివత్తిళ్ళలో ఉన్నా, అందరూ ఒక మాట మీద నిలబడి ఇంతకాలం , ఆ మాటకే కట్టుబడి ఉండడమూ మామూలు విషయమూ కాదు.సామాన్యమైన సంగతే కాదు.   వారందరి నడుమ ఉన్న సమదృష్టికీ, సమైక్యభావనకూ, స్నేహసంబంధానికి ఇది గుర్తు. మూడు కొప్పులు కలిస్తే, ప్రళయం అన్న ఒక పాత మాట ఎంత ఒట్టిదో చెప్పకనే చెప్పారీ స్నేహబృందం.

నలుగురు ఉన్నతాశయాలు కలిగిన వనితలు నడుం బిగిస్తే, నాలుగు దిక్కులూ ప్రక్షాళనం చేయగలరని, ప్రభంజనం సృష్టించ గలరనీ  నిరూపించారు ఈ రోజు.

సమున్నత ఆలోచనతో , చక్కటి అవగాహనతో, సహేతుక ప్రణాళికతో ,  వారు కలిసికట్టుగా చేసిన పనులన్నీ, గొప్ప ఉదాహరణలు. అందరికీ.

మార్పు అన్నది ఒక ఉదాహరణగా నిలబడడంతోనే  మొదలవుతుంది కదా?

ఈ దశాబ్ద కాలలో ,సభ్యులందరి జీవితాల్లోనూ, వృత్తి వ్యవహారాల్లోనూ , అనేకానేక మార్పులు వచ్చిఉంటాయి. అన్నిటినీ , చక్క దిద్దుకొంటూనే , సంఘంవైపు దృష్టిని నిలిపిన వీరి ప్రయత్నాలన్నీ, వందనీయాలు.

సాటిమనిషిని మనిషిగా గౌరవించే , ఇలాంటి ఒయసిస్సులు ఊరికొక్కటి ఉన్నా సరిపోవు. నిశ్శబ్దంగా, నిబ్బరంగా తమ చిన్న ఆలోచనతో తమచుట్టూ మార్చుకొంటూ, వెలుగులు చిమ్ముతూ వెళుతోన్న ఒయాసిస్సు మరింత వెలొగొందాని, వ్యక్తులుగా శక్తులుగా వనితలు వారికి వారే నిర్మించుకోగలరనీ నిరూపణగా ఉదాహరణగా నిలిచిన ఆ విధుషీమణులందరికీ వినమ్ర నంస్కారాలు.

వారందరినీ ఒక్క మాటమీద ఒక్కగాటన నిలిపి, సంస్థను నిలబెట్టిన పెద్దలు డా. జయమ్మ గారికి, వారి స్నేహ బృందానికి , అభినందనలు.

గత 11 సంత్సరాలుగా ,ఒయాసిస్ సంస్థ, చిలకలూరిపేటలో ,పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నది. స్త్రీల కొరకు ఆరోగ్య ,అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. స్త్రీల స్వాలంబన దిశగా, శిక్షణాతరగతులు నిర్వహించి , కుట్టు మిషన్లు కానుకలుగా అందించారు.క్యాన్సర్ నిర్ధారణా పరీక్షలు, HIV అవగాహన కార్యక్రామలు, మందుల పంపిణీ తదితర సహాయాసహకారారలతో పాటు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఒంటరి మహిళలల స్వాలంబన కు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వికలాంగులకు ట్రైసికిళ్ళు అందచేశారు.
ఇవన్నీ చేస్తున్నన్సి, ఉన్నత విద్యావంతులైన మహిళలు.వైద్యులు,న్యాయవాదులు,అధ్యాపకులు,వృత్తినిపుణులు, సంఘసేవకులు , సానుకూల స్పూర్తి నిండిన సుమారు 120 మంది సభులు. వనితామణులు.
ఈ కార్యక్రమ నిర్వహణలన్నిటికీ అవసరమైన వనరులు, తమతమ స్వీయ సంపాదనల్లోంచే , ఈ సభ్యులంతా సమకూర్చు కోవడం విశేషం.

ఆలోచన కలిగిన ఆర్ధిక స్వాలంబన కలిన మహిళలు సాటివారికి ఎలా తోడు పడవచ్చునో ,వీరు చేసి చూపిస్తున్నారు. గత పదకొండేళ్ళుగా.

ఈ “ఒయసిస్సు “,

కష్టాల ఇసుక ఎడారుల్లో, బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకోవడానికే కాదు,

ఇష్టాల పూలతోటలో  ఉనికిని నిలుపుకోవడానికి కూడా! ఉత్తమ జీవితాన్ని జీవించడానికి కూడా!

ఒయసిస్సు బృందానికి మరొక మారు అభినందలు.వినమ్ర నమస్సులు.

***

Photo 1: Gifting her dignity. On the occasion of 11th Anniversary of Oasis Welfare Association, Chilakaaluri peta,  People with Special needs are gifted with Tricycles. And, sewing machines are distributed.

Photo 2.Dr.Kandimalla Jaymma garu, Senior Gynecologist,  Founder President of Oasis ,Ex-MLA,Chilakaluri peta.

Photo 3: Oasis Team : Ms.G. Susila garu, Chandra Latha ,(Guest ), Ms. K.VIjaya lakshmi garu, ,Dr.K.Jayamma garu, Ms.Sarala garu, Ms,Beebi Jan garu.

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s