నవలారచన : స్త్రీలు

 

( “సాహితీ సృజనలో స్త్రీలు సదస్సు“, విజయవాడ బుక్ ఎక్షిబిషన్ ,3-1-2018 , ప్రసంగ పాఠం.
      ఛినుకు మాసపత్రిక ఫిబ్రవరి ,2018 సంచికలో ప్రచురితము. )

***

”       నేనెంత స్వేచ్ఛగా ఉన్నానో, ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ స్వేచ్ఛ!

         నేను మూడు చిన్న చిన్న విషయాలనుంచి స్వేచ్చను పొందాను.

         రోలు నుంచి.రోకలి నుంచి. నా వంకర ప్రభువు నుంచి.

          నేను పునర్జన్మ నుంచి ,మరణం నుంచి స్వేచ్చను పొందాను.

          ఇన్నాళ్ళు నన్ను దూరంగా విసిరేసిన ,అన్నిటినుంచీ స్వేచ్చను పొందాను.”

అని  క్రీ.పూ.6 వ శతాబ్దం నాటీ తేరీ గాథలో ఆ నాటి బౌద్ధ కవయిత్రి ముత్త అంటే,

“నా స్వేచ్చకు ఒక అర్ధం ఉండాలి . ఆ అర్ధం కోసం అన్వేషించడమే  ఇప్పుడు నా పని” అని అంటుంది  ఓల్గా గారి

1987 నాటి  “ స్వేచ్చ”  నవలలోని ప్రధాన పాత్ర,  అరుణ.

ఆనాటి స్వేచ్చాభావనకూ ఈ నాటి స్వేచ్చాన్వేషణకు నడుమ విస్తరించిన సాహితీ  ప్రయత్నాల ప్రకటనే నవలరచనలో స్త్రీల అస్తిత్వం.

ఈనాడు నవల గా చెప్పే సాహితీ రూప లక్షణాలన్నీ , కలిగిన  మొదటి రచన, The Tale of Genji.  అనేక అధ్యాయాలుగా, అంచలంచెలుగా,  రచించిన ఈ  నవల,జపాన్ దేశంలో 11 వ శతాబ్దం ఆరంభంలో ,హీయన్ సామ్రాజ్యం ఉన్నత దశలో ఉన్నప్పుడు, ఆనాటి రాజవంశీయులు, రాజోద్యోగులు, పరిజనం నేపథ్యంగా వారి జీవన శైలిని ప్రతిఫలిస్తూ, ఆ కాలమాన పరిస్థితులను ,కాలానుగత మార్పులను చిత్రించిన  ఈ నవల,ఆధునిక ఆంగ్ల ప్రచురణ సుమారు 1360 పేజీలలో విస్తరించి ఉంది.  ఈ  సుధీర్ఘ నవల , ఒక ప్రధాన పాత్ర  చుట్టూ అల్లుకుపోయిన, సుమారు 400 ల పాత్రల జీవిత పరిణామాలను చిత్రిస్తుంది.   ఈనాడు ప్రపంచ సాహిత్యంలో తొలి ఆధునిక నవల గా,తొలి మనస్తత్వ నవలగా గుర్తించ బడ్డ ఈ నవలా రచయిత, మురసాని శికబు , ఒక స్త్రీ. ఆమె పాఠకులు అంతఃపుర స్త్రీలు,  ఉన్నత వర్గీయ స్త్రీలు.

సహవాసి గారు తెలుగు నవల మొదలయిన క్రమం గురించి అన్నట్లుగా, “తెలుగు సాహిత్యం లో కొత్త ప్రక్రియను   అంటుగట్టి,” ఈ ఏడాదికి నూటనలభై ఏళ్ల పైమాటే అయింది. ఆ అంటు కు మూలమైన ఆంగ్ల నవలలలో మొదటి నవల 1663 నాటి, ఉత్తరప్రత్యుత్తారల రూపంలో సాగిన, ” “The lone letters between a noble man and his sister,”నవల. ఈ నవలా రచయిత , Aphra Behn  కూడా స్త్రీ కావడం విశేషం.

నవలారచనకూ స్త్రీలకూ ఉన్న సంబంధబాంధవ్యాలు, ఈ లెక్కన, నవలాప్రక్రియ అంత పురాతనమైనవి.

“ నవ్యమైనదీ, లాలిత్యమైనదీ నవల ” అంటూ అప్పటీ దాకా వచన ప్రబంధంగా ప్రాచుర్యంలో ఉన్న సాహితీ రూపానికి నవల అనిపేరుపెట్టారు. శ్రీ కాశీభొట్ల బ్రహ్మయ్య శాస్త్రిగారు. ఆ నామకరణం జరిగింది కూడా, కందుకూరి వీరేశలింగం గారి, “రాజశేఖర చరిత్ర”(1858) నవలకు. నవ్యతకూ,లాలిత్యానికి, వనితలకూ ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పక్కరలేదు. నవలా రచన అంటే స్త్రీల రచన అన్న దశకూడా తెలుగు నవల , 70 దశకంలో, చవిచూసింది.

నవల మూలాల గురించి అనేక  అన్వేషణలు జరిగినా, నవల మూలాలు జానపదాలలోని మౌఖిక కథనాల్లో మొదలయ్యాయంటారు మిఖైల్ భక్తిన్.  నిత్యజీవన వ్యహార కథనాలతో  పాటు, అంతరగాల్లోకి తొంగి చూసేవి. అధిభూతిక అనుభువాలను చవిచూపేవి.,ఆలోచనలనూ, అనుభూతులను, ఈ మౌఖిక కథనాల్లో చోటు చేసుకొనేవి. ఆ మౌఖిక కథనాల్లాగానే, ఒక నిర్దిష్ట రూపురేఖల చట్రాలు లేకుండా, సచేతనం గా కొనసాగుతూ, నిరతంతరం విస్తరిస్తూ , అసంపూర్ణమూ, సశేషమూ అయిన ఏకైక సాహితీ ప్రక్రియ  నవల అంటారు భక్తిన్.

అక్షరం అబ్బాక, నవలా రచయితలు అయ్యారు గానీ, స్త్రీలు సహజంగానే, స్వభావ సిద్ధంగానే  నవలాకారులు. ఆకుకు అందకుండా పోకకు కందకుండా, హాస్యంగా, అందంగా ,ప్రతీకాత్మంగా ,తమ కోపతాపాలను వ్యక్తపరుచుకోవడం వారికి వేడి పాలమీద వెన్నఆరా తీసినంత తేలిక !  సంతోషాలను సంబరాలనూ పంచుకోవడం ఒక పేరంటమే.

అన్నిందాలా అణిచివేతలకు గురవతూ, అనేకానేక కట్టుబాట్లలో ఒదుగుతూ, ఎన్నో రకాల జీవన పోరాటాలను కొనసాగిస్తూ, జీవితంపట్ల ఆశను, గాఢానురక్తినీ, నమ్మకాన్ని ప్రకటించడం స్త్రీలకే చెల్లు. మనోభావాలను మనోవేదనలను మనోహరంగా చెప్పగలగడం , వారికి వెన్నతో పెట్టిన విద్య.

ఆ సంవేదనను ఒకరితో ఒకరు పంచుకొనే క్రమంలోనే,  కష్ట నిష్టూరాలను  చెప్పీచెప్పక చెప్పుకొని, ఒకరినొకరు ఓదార్చుకొనే స్వాంతనలోనే , ఆ స్వాభిమానపు, స్వాతిశయపు, సోదాహరణపు…అమ్మలక్కల కబుర్లలోనే,  స్త్రీల  నవలా కథనం మొదయింది.

నవలా పాఠకులుగా గుర్తించబడడంతో, తెలుగు నవలతో స్త్రీల మొదటి ముడి పడింది. స్త్రీ పాఠకులను  దృష్టిలో ఉంచుకొని, తొలినాటి తెలుగునవల రూపురేఖలు ధర్మాధర్మాలు మలచబడడం విశేషం. కొత్తగా చదువునేర్చిన స్త్రీలు చదవడానికి,”పరుషంగా లేని మర్యాదాబద్దమైన భాష ,వస్తువు అవసరమని ” వీరేశలింగం పంతులు గారు సూచించారు. “కళాపూర్ణోదయాన్ని, రాధికా స్వాంతనాన్ని” పంతులు గారు పక్కకు పెట్టిన సంగతి, గుర్తుకు చేసుకోవాలి. ఒక తండ్రి తన కూతురిని మంచీమర్యాదగా పెంచి పెద్దచేసినట్లుగా, పంతులుగారు తెలుగునవలను నిర్వచించారు. 1894లో చింతామణి పత్రికలో , నవలారచన కు ప్రకటించిన నిబంధన ఒకటి  .

“ఎక్కడనూ స్త్రీలు చదవకూడని మృదుత్వం తప్పిన మోటుమాటలుగానీ, అంశాలుగానీ ఉండకూడదు.”

ఈ మర్యాదా చట్రాల నుంచి బయటపడే క్రమం లోనే , నవలాపాఠకులయిన స్త్రీలు నవలారచయితలు గా పరిణమించారు.అయితే, పంతులు గారి నవల అచ్చయిన దాదాపు 80 ఏళ్ళ కు గానీ, తెలుగు నవల ను స్త్రీలు రచించలేదు.

వట్టికొండ విశాలాక్షి గారి “నిష్కామ యోగి”(1956, ప్రజావాణి), డా.శ్రీదేవి గారి “కాలాతీతవ్యక్తులు” (1957, తెలుగు స్వతంత్ర) అటూ ఇటుగా, ఒకేసారి తెలుగు నవలపాఠకులకు అందాయి. స్వేచ్ఛా స్వభావం కలిగిన స్వతంత్ర వ్యకులుగా ఆ పాత్రలు ఊపిరి పోసుకొన్నాయి. తెలుగు నవల అప్పటికే చేసిన సుధీర్ఘ ప్రయాణంలోకి కొత్త నీరు వచ్చి చేరింది.  వరదై పోయింది.

వెనువెంటనే, రంగనాయకమ్మ(బలిపీఠం, 1962)గారు, వాసిరెడ్డి సీతాదేవి( మట్టి మనిషి,1972) గారు ,ఇల్లెందల సరస్వతి గారు,(నీ బాంచెన్ కాల్మొక్తా) ,తదితరులు నవల పట్ల ఒక స్పష్టతతో   తమ రచనలు రాయసాగారు . కోడూరి కౌసల్యాదేవి గారి “చక్రభ్రమణం” (1962) చలన చిత్రం గా మలచబడిన మొదటి నవల. ఇక, మహిళా నవలారచయితల తరం మొదలయ్యింది. పురుషులు కూడా, బీనాదేవి, లల్లాదేవి లాంటి స్త్రీ నామాలతో రాయడం మొదలయ్యింది. ఇది ,సరిగ్గా, Mary Anne Evans  లాంటి వారు  “జార్జ్ ఎలియట్” అన్న పురుష నామం తో రాసిన ఇంగ్లీషు నవలకు భిన్నం. ఆ లెక్కన, ఒక తరాన్ని, తెలుగునవలా రచనను స్త్రీలే శాసించడం విశేషం. అదంతా, జగమెరిగిన చరిత్ర.

మాలతీచందూర్, యద్దనపూడి సులోచనారాణి,లత, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, అచ్యుతవల్లి,జలంధర, డి.కామేశ్వరి, పి.సత్యవతి  గారి వంటి అనేక నవలారచయితలు, స్త్రీలగురించి, స్తీలకోసం స్త్రీలకు సంబందించిన అనేకానేక చిన్న అంశాలు, అప్పటి దాకా ఏ మాత్రం ప్రాధాన్యత నివ్వని ఎన్నెన్నో స్త్రీల విషయాలు, వంటింటి గడప దాటి , ఇరుగు పొరుగు మర్యాద చట్రాలను విదిల్చి, నవలలకెక్కాయి. చలనచిత్రాలుగా మలచబడ్డాయి.

స్త్రీలు నవలాపాఠకులుగానే కాక, నవలా రచయితలుగా ప్రకటించుకొన్న తరం అది.ఆలోచనలూ, అనుభూతులూ మేళవించిన, మేలురచనలు అప్పుడే వచ్చాయి.

నవలారచన అంటే అప్పుడొక ఉత్సవం. ఒక ఉత్సాహం.

ఆ నాటి రంగనాయకమ్మ గారి జానకి విముక్తి నుండి,వాసిరెడ్డి సీతాదేవి గారి నవలలు, ఓల్గాగారి స్వేచ్ఛ,నల్లూరి రుక్మిణి, అరుణ, మల్లీశ్వరి గారి నవలల వరకు, ఉద్యమాలకు  ఊపిరిగా, ఊతంగా నవల లను మలిచారు. వ్యవసాయం,పట్టణీకరణ, పర్యావరణం, ప్రపంచీకరణ, వంటి విషయాలపై అధ్యయనపూర్వక నవలలను సీతాదేవి గారు, నల్లూరిరుక్మిణి,చంద్ర లత రాసారు.స్త్రీలు,స్త్రీ పురుష సంబంధాలతో మొదలై, మానవ సంబంధమైన అనేక  అంశాలెన్నిటినో, వీరు తెలుగు నవలలో పొందుపరిచారు.

నవలారచన అంటే ఒక   ఉద్యమం.ఒక ఉత్తేజం.

ఇంత నేపథ్యం, తెలుగు నవలకు ఉన్నప్పటికీ,  ఎప్పటికప్పుడు, స్త్రీల నవలలు కలిగించేంత ఉలికిపాటు, అంతా ఇంతా కాదు.

అది కాలాతీత వ్యక్తులు, జానకి విముక్తి, మరీచిక, స్వేచ్ఛ, రేగడివిత్తులు , మరేదయినా.

ఈ ఉలికిపాటు మూలాలు, మర్యాదాబద్దతను  నిర్దేశించిన  తొలినాటి తెలుగు నవలా ధర్మాలను పరామర్షించాల్సి వస్తుంది. “ స్త్రీలై ఉండి ఇలా రాయడమేమిటి ” అన్న భావం ఇంకా తెలుగు నవలను వదలలేదేమొ అనిపిస్తుంది అలాంటప్పుడే.

నవలారచన అంటే ఒక   ఉలికిపాటు. ఒక ఉవ్వెత్తిన అల.

నవలా రచయిత జ్ఞానం ,అనుభవం, దార్షనికతల ముప్పేట అంటారు భక్తిన్. నిజమే, నవలారచన ఎంతో స్వేచ్చను ఇచ్చినప్పటికీ,  స్త్రీలకు ఉన్న అన్ని పరిమితులకు ,కట్టుబాట్లకు నవలారచయితలు అతీతులేమీ కారు. నవల కోసం, అధ్యయనం చేయడానికి,  సమయయం వెచ్చించడానికి, క్షేత్రపర్యటనలకై ప్రయాణాలు చేయడానికి,వెసులుబాటు ,వీలు ఎందరికి కుదురుతుంది? సుధ్దీర్ఘ కాలం  ఏకాగ్రతతో ఒకే రచన మీద శ్రమ చేయడం, అనుకొన్నంత సులువు కాదు.

నిత్యజీవిత వ్యవహారం, కుటుంబం,పిల్లల బాగోగులు, వృత్తివ్యాపకాలు , సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లతో పాటు, భాషపై భావాలపై నియంత్రణలు …ఇలా ఎన్నెన్నో పరిమితులు. ఇంకెన్నో పరిధులు. ఒంటరిగా కూర్చుని రాసుకోవడానికీ వీలు తక్కువ. వర్గీనియా ఉల్ఫ్ , “A room of one’s own (1929) లో చిత్రించినట్టుగా, తనకంటూ కొంత రాసుకొనే సమయమూ, కొద్దిపాటి వెసులుబాటు, స్థలమూ ,ఆనాటీకీ ఈ నాటీకీ , దేశకాలాలకు అతీతంగా స్త్రీ నవలాకారుల అవే  సమస్యలు. విప్పార్చిన రెక్కలను కత్తిరించను, కనిపించని కత్తెరెలెన్నో !  అలాంటప్పుడే, “రెక్కలున్నాయని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు! ఉన్నా తడిచి పోయాయి !”  అన్న కాలాతీత వ్యక్తుల్లోని ఇందిర మాటలు జ్ఞాపకం వస్తాయి.

ఇంతటి విస్తృతంగా, నవలారచనలు చేసినప్పటీకీ, తెలుగు నవలారచయితల జాబితాలలో , స్త్రీల పేర్లు మాత్రం వేళ్ళమీద లెక్కించవలసిందే. వందలకొద్దీ రచించిన స్త్రీల నవలలు సాహితీనవలలు గా పరిగణించక పోవడానికి, అవి చాలా మట్టుకు Mills & Boons తరహా , రొమాన్స్ లకు ప్రతిరూపాలైన, కాలక్షేపపు నవలలుగా లెక్క వేయడం వలన.

“రాజశేఖర చరిత్ర” తెలుగు నవలకు మర్యాదను నేర్పడంతో పాటు, ఒక సామాజిక బాధ్యతతో ముడి పెట్టింది.

ఈ వందలకొద్దీ నవలలన్నీ , తరతరాల పాఠకులనీ ,సినిమాప్రేక్షకులనీ కూడగట్టుకొన్నాయి. ఈ నవలా రచయితలు, చాలామట్టుకు , సహజంగానే, టివి రచయితలుగా పరిణామం చెందారు. ప్రసిద్ధి పొందారు.

అంతగా జనాదరణను పొందిన, ఈ నవలల కథన రహస్యం ఏమిటి ? సులువుగా చదవగలగడం. సులువుగా అర్ధమై పోవడం. ఒకే రకమైన కథతో, ఒకే రూపంలో ఒకే తీరులో ప్రచురించ బడిన ఈ రోమాన్స్ లన్నీ, దాదాపుగా  ఒకే ఫార్ములానే పాటిస్తాయని Freddie Freeman అంటారు.      (Why romance genre is so popular ? /  Freddie Freeman )

ఈ ఫార్ములా,  “సిండ్రెల్లా”  కథంత  పురాతనమైనది. నిజజీవితంలో సాధ్యంకాని, ఊహాజనిత ప్రేమ ,చిరకాలం నిలిచి ఉంటుంది. కథ ఎప్పుడూ సుఖాంతమే అవుతుంది. ఈ రొమాన్స్ నవలలోని నాయికలు,ఒక భిన్నమైన ఇంద్రజాల శక్తిని ప్రకటిస్తూ ఉంటారు. అభూతకల్పన  అద్బుతంగా ఆవిష్కరిచబడుతుంది.  నాయకుణ్ణి మచ్చిక చేసుకొని, మంచిచేసుకొని, నాగరీకునిగా, సున్నితమైన వాడిగా,తన మీద ఆధార పడేవాడిలాగా, తనకు విధేయుడిలా  మార్చేస్తుంది.  “సెక్రెటరీ,   ప్రేమనగర్ “ నవలల తరహాలో. అణగారిన ఆశలన్నీ రెక్కలు తొడుక్కొని, అందివస్తాయి.నిజ జీవితంలో కష్టనష్టాలు అంటని, ఒక కల్పనాజనిత సంతోషాన్ని నిజమని నమ్మిస్తాయి. ఆ అందని స్వర్గంలో  తమని తాము చూసుకొని, మురిసిపోయే కథన సంధర్భాలను కలిగిస్తాయి. వీరికి, నవలంటే ఉహాలోకం. ఉత్సాహం ఉల్లాసం.

అనితానాయర్ తన “లేడీస్ కూపె ” (2001) నవలలో,  భిన్న నేపథ్యాలు కలిగి , భిన్న  కథనాలు వినిపించిన సాటి స్త్రీలను తనలోనే చూసుకోగలిగిన ,కథకురాలు అఖిలను, అనేక తలలున్న అఖిలాండేశ్వరి దేవి తో పోలుస్తారు.

అన్ని తలలున్నా, మూల భావన ఒకటే. ఆమె స్త్రీత్వం. 

తన స్వేచ్చను, స్త్రీత్వాన్ని , స్త్రీతత్వాన్ని ,మూర్తిమత్వాన్ని ప్రకటించే కథన సంధర్భాన్ని కలిగించే,  నవలా రచన  స్త్రీలకు ఒక ఉద్యమం, ఒక ఉత్సవం.

స్త్రీత్వం ( feminine ) నుంచి స్త్రీ (female )గా, ఒక మానవి గా పరిణమించే ప్రయత్నాలలో ఒక సహజాన్వేషణ నవలారచన.

నవలా రచన  ఒక స్వేచ్ఛా ప్రకటన. ఒక స్వేచ్ఛాన్వేషణ. ఒక స్వేచ్ఛానుభవం.

నవలారచన చేసే ప్రతి స్త్రీ ఒక ముత్త .ఒక అరుణ. ఒక అఖిలాండేశ్వరీ దేవి! 

***

( డా. చంద్ర లత, తెలుగు రచయిత, కథన శాస్త్రంలో పరిశోధన చేశారు.)

.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s