ఉమ్మడి పౌరవిజ్ఞతతో !

” … sooner or later you must see it! “

అనుకొంటాం గానీ, ఎంతటి ఘనాపాటి అయినా, అందరిని దాటుకు వచ్చిన అగ్రగామి అయినా, ఆ ఉన్నత స్థానానికి ఒక్కరోజులో వచ్చి బైఠాయించిందా ఏం? ఒడిదొడుకుల బాటల్లోబడి, ఒక్కో అడుగు వేసుకొంటూనే వచ్చింది కదా! అదే మరి.

ఆ దారిలో ఎన్నెన్ని పాఠాలు… మరెన్ని గుణపాఠాలు నేర్చుకొందో…! రోం నగరమే కాదు, అనేక భాషా సంస్కృతుల కలగూర గంపైన అమెరికా కూడా, ఒక్క రోజులో నిర్మించబడ లేదు!

ఒకటి మాత్రం నిజం.

ఆ భిన్నత్వం, వైవిధ్యమే , ఒకరిఒకరం కలిసి మెలిసి మెలగడాన్ని నిత్య జీవనవ్యవహారం గా మార్చేస్తుంది. మనకు తెలియకుండానే. అదే భిన్నత్వం, వైవిధ్యం విభజించి పాలించే వారికి, వడ్డించిన విస్తరిలా అంది వస్తుంది. దక్కించుకొన్నవారికి దక్కినన్ని ముక్కలు !

ఎన్ని ముక్కలు చేసినా, మళ్ళీ మళ్ళీ కలుపుకు పోవడమే కదా , మనలను మనగా నిలిపేది.అంతే! కాలాలు మారినా మారనిది, మనిషి మనిషిని కలిపి ఉంచేది , సాటి మనిషిని స్పృశించగలిగిన మానవ స్పృహే కదా! అవునండి, అశాంతిని, అనిశ్చితిని ,అభద్రతను, అరాచకాన్ని ఎదురొడ్డి, దార్లిచ్చిన అంచులు కలుపుతూ ముడులేసుకొంటూ, అందమైన అల్లికలతో పెనవేసుకొంటూ , నూతన ఉత్సాహం తో ముందుకు సాగుతూ పోవడమేగా, విజ్ఞత కలిగిన సమాజాలు చేసే పని.

ఇంతకీ, చెప్పొచ్చేదిమిటంటే, ఒక సినిమా గురించి. ఈ సినిమా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన కథ.

బడికి బయలు దేరిన చిన్ని పాప, ఒక బావి లో పడి పోతుంది.ఈ విషయం తెలియని, అమ్మానాన్నల అన్వేషణ, విడి పోయిన ఊరినంతా పాపాయి ఒక్క తాటి మీదికి తీసుకొస్తుంది.

మనిషిలోని అన్ని చీకట్లని బద్దలు చేసి, మరొకమారు వెలుగులు నింపిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన కథ ఇది. ఈ సినిమా లో, హీరో హీరోయిన్లు లేరు. అందరూ ప్రధాన పాత్రలే.

ఇక, ఈ కథకు మూలం ఇద్దరు. ఒక చిన్న పాప. ఆ పాప కనిపించ పోవడానికి కొద్ది సేపటి ముందు, ఆ పాపకు పూలు కొనిచ్చిన ఒక పెద్ద మనిషి. అతను ఒక మైనింగ్ ఇంజినీర్ అయిన తెల్లజాతి అమెరికన్. ఆ పాప ఆఫ్రికన్ అమెరికన్.

అమెరికా పశ్చిమ తీరాన, అప్పుడప్పుడే ఎదుగుతోన్న ఒక చిన్న ఊరిలో జరిగిన యథార్థ సంఘటన . ఆడుతూ పాడుతూ, దారంట పూసిన పువ్వులను సేకరిస్తూ , హుషారుగా తొలిబడికి బయలుదేరిన , అయిదేళ్ళ చిన్నారి పాప, కారోలిన్, ఒక పాడుబడిన, లోతైన బావిలోకి పడి పోతుంది.

పాప అమ్మనాన్నలు ఆ ఊరి షెరిఫ్ బెన్ కెల్లాగ్ సహాయం తో వెతకడం మొదలెడతారు. ఇంతలో, ఆ దారంట వెళుతూ, తన బాబాయిని పలకరించడానికి, ఊళ్ళోకి వచ్చిన క్లాడ్ ప్యాకార్డ్, ఒక పూల కొట్టు దగ్గర , ఆ పాపను పలకరించాడని, పాప కు నచ్చిన పూలు కొని ఇచ్చాడని తెలుస్తుంది.

ఇక, గాలి కన్నా వేగంగా పుకార్లు ఊరిని చుట్టేస్తాయి. ఊరందరి దృష్టి క్లాడ్ పై పడుతుంది. కోపం ఆగ్రహోదగ్రమై, ఊరు ఊరంతా అభద్రత చుట్టేస్తుంది.

పరాయి వాడు, ఊరికి కొత్త వ్యక్తి అయిన క్లాడ్ పై అనుమానం ఇంతింతై, గోరింతలు కొండంతయి, ఊరు ఊరంతా అగ్ని గుండం అవుతుంది. అలజడిని అదుపుచేయడానికి, షెరిఫ్ ను కస్టడీలోకి తీసుకొని, పోలీసుస్టేషన్లో పెడతాడు. ఊరుఊరంతా అక్కడ చేరుతుంది.

క్లాడ్ ప్యాకార్డ్ ఒక మైనింగ్ ఇంజనీర్. అతని బాబాయి ఆ ఊరి ప్రముఖ వ్యాపారవేత్త ,శ్యాం ప్యాకార్డ్.

విషయం తెలిసిన, శ్యాం తన పలుకుబడితో క్లాడ్ ను విడిపించాలని ప్రయత్నిస్తాడు.ఆ వత్తిడిలో శ్యాం కు గుండెనొప్పి వస్తుంది.

ఆ వార్త కాస్తా,అటు మారి ఇటు మారి, శ్యాం పై జాతివిద్వేషకుల దాడిగా ఊరంతా గుప్పుమంటుంది. ఇక, శ్యాం కు మద్దతుగా, ఒక పెద్ద గుంపు తయారవుతుంది. వారిని ఎదుర్కోవడానికి అటువైపు వారు ,అందిన ఆయుధాలన్నిటిని దొరక బుచ్చుకుకొని, వీధుల్లో పడతారు. దాంతో, జాతి వైరం భగ్గుమంటుంది.

ఊరు ఊరంతా ఆ ద్వేషాగ్నికీలల్లో బూడిద అవుతుందేమో అనిపించే సమయాన, పాప ఆచూకి తెలుస్తుంది. ఒక చిన్న పిల్లవాడు, అతని పెంపుడు కుక్కపిల్ల యాదృఛ్చికంగా పాప ఆచూకి కనుక్కుంటారు.

పాప ఒక పాడుబడిన బావిలో పడిపోయింది.

ఆ వార్త ఉరుకులపరుగుల మీద వచ్చి ఊరందరికి తెలుస్తుంది.
అప్పటి వరకు, ఏ ఇద్దరి మధ్యనైనా పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమన్న ఆ ఊరు ఊరంతా, ఎలా ఆ కోపాన్ని, ద్వేషాన్ని అధిగమించి, ఉరుకులు పరుగున వెళ్లి , ఆ పాపను క్షేమంగా అమ్మనాన్నలకు చేరుస్తారన్నదే, ది వెల్ (The Well) ,సినిమా.

*

ఈ సినిమా లో, ఆద్యంతం ఉత్కంఠ భరితమైన పటిష్టమైన కథనంతో ముడిపడిన , మానవసహజ భావోద్వేగాలతో పాటు, ఆసక్తి కరమైన మరెన్నో విషయాలు ఉన్నాయి.

తర తమ బేధభావాలను పక్కకు బెట్టి, ఒక చిన్నారిని కాపాడ డానికి, ఒక్క దరికి చేరిన ఊరివారంతా, వారి వారి వృత్తి నైపుణ్యాలనూ,వ్యవహారజ్ఞానాన్ని పంచుతూ, వారికి తోచిన ఉపాయలతో పాటు, ఆనాటి ఆధునిక సంస్థ యంత్ర సామాగ్రిని , ఆ ఆపద నుంచి బయటపడడానికి, ఎలా అన్వయిస్తా రన్నదీ గమనించాల్సిన విషయం.

క్రేన్, బోర్లు వేసే పెద్ద డ్రిల్లింగ్ మెషిన్లు ,పెద్ద పైపులు ఒక పక్కన, ఆ లోతైన బావిలో పాపతో సంభాషించడానికి , రేడియో మైకులను వాడడం…. ఉత్కంఠ భరితంగా ఉంటుంది.అలాగే, పాప ఏ దశలో ఒడ్డున పడుతుందో, అంచనా వేయలేక, సిద్ధంగా ఉన్న వైద్యబృందం, అంబులెన్స్ ఒక పక్కన. ఇక, జాతి,స్థితి అంతరాలను వదిలి, అమ్మలు అందరూ , ఆందోళనలో ఉన్న అమ్మకు ఎలా అండగా నిలబడతారన్నది , ఎంత హృద్యంగా ఉంటుందో!

ఇక, నిజ సంఘటనలో, ఈ ప్రయత్నమంతా లైవ్ బ్రాడ్ కాస్ట్ అవడంతో, ఈ రెస్క్యూ ఆపరేషన్ జాతీయవార్త అయ్యింది. దేశ వ్యాప్తంగా ఊపిరిఉగ్గబట్టి తిలకించిన ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని , టెలివిజన్ ప్రసార చరిత్రలో ఒక ముఖ్యఘట్టంగా భావిస్తారు.

ఆ విశ్వప్రయత్నంలో,మూడేళ్ళ , క్యాథీ ఫిస్కస్ ,(సాన్ మరినో,కాలిఫోర్నియా,1949) ను ఎలా రక్షించి వుండవచ్చునో సూచించే విధాన ఉన్నతీకరించిన స్క్రిప్ట్ ఇది.

క్యాథీ పాపను దక్కించుకోలేక పోయారు.

మనకి మానవస్పర్ష కలిగిన ఒక మంచి సినిమా మిగిలింది!

*

నిజమే, పాడుబడిన లోతైన బావుల్లో చిక్కు పడి , ఉక్కిరిబిక్కిరి అవుతోన్న పసితనాన్ని ఊపిరి పొసి, పసితనాన్ని పచ్చబరుచుకొన్నప్పుడేగా, ఎవరికి వారిలో ఒక వసంతం చిగురిస్తుంది.అది నిజం.నిత్యం. ద్వేష భావనలు ఎంతటి చిచ్చు బెట్టినా, అవకాశవాదులు అంతకంతకూ రెచ్చగొట్టినా, పునరాలోచించు కోగలగడం లోనే, తమ సమాజ పునాదులున్నాయని , మరోమారు నిరూపించిన ఆ దేశ ఉమ్మడి పౌర విజ్ఞత కు … వినయంతో !

ఇంకెంతో, విజ్ఞతతో మెలగాల్సి వుంది, ఇంకెన్నెన్నో అంచులు లేని,తుప్పల్లో దాగిన పాడుబడిన బావులు నోళ్ళు తెరుచుకొన్నాయని గుర్తుచేస్తూ… జేజేలతో!

*ది వెల్, (1951) దర్షకులు: లియో సి.పాప్కిన్ , రస్సెల్ రౌజ్ రెండు అకాడెమీ అవార్డుల నామినీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s