వినమ్ర వందనం

అసంఖ్యాకమైన తెలుగు నాటికలను గ్రంథస్థం చేసిన, చేస్తోన్న ఆచార్య కందిమళ్ళ సాంబశివరావు గారు ఫోన్ చేశారు. ఒక చిన్న పల్లెటూరు లో ఐదురోజుల పాటు నాటకపోటీలు జరుగుతాయని, ఆ వేదిక మీదనే ప్రతిపూటా వివిధ సాంస్కృతిక రంగాలను చెందిన లబ్దప్రతిష్టులకు పురస్కృతులను చేస్తామని, ఈ ఏడాది సాహిత్యరంగంలో చంద్రలతకు ఆ గౌరవం ఇవ్వాలని వారి పరిషత్తు బృందం నిర్ణయించినదని తెలియచేశారు.
వ్యవసాయ ప్రధాన రచనలలో రైతు జీవితాలను చిత్రించినందుకు గాను, సంక్రాంతి వేళ సత్కరించడం సముచితమని భావిస్తున్నామని ,తప్పకుండా అంగీకరించాలని నచ్చజెప్పారు.
పరిషత్ వారి ఏకగ్రీవ నిర్ణయాన్ని సవినయంగా అంగీకరించడానికి ముఖ్యమైన కారణం – అది యన్ టి ఆర్ గారి పేరిట ఇస్తోన్న అవార్డ్. అది యన్ టి ఆర్ కళాపరిషత్,అనంతవరం వారి సాదర ఆహ్వానం.
పై నుంచి ఒక పల్లెటూరి నుంచి వచ్చిన పిలుపు. పల్లెలన్నా పిల్లలన్నా నాకున్న అభిమానం పక్షపాతం తెలిసిందే. ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్నవారందరూ సంక్రాంతి వేళ పుట్టినూరికి తిరిగి రావడం, ఆ రాక ను ఎంతో ఫలప్రదంగా, సృజనాత్మకంగా ఎలా మలుచుకొంటున్నారన్న కుతూహలం తోడయ్యింది.వారి పండగరోజులను మరింత శోభాయమానం ఎలా చేసుకొంటున్నారో అన్న ఆసక్తి కలిగింది.
అలనాడు నాటక రంగానికి ఇలాంటి పల్లెటూళ్ళేగా పట్టుకొమ్మలు. ఆ వేదికలమీద నుంచే వచ్చారు మహా నటులందెరో.
ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కళాకారులకు అయిదురోజుల పాటు ఆతిథ్యం ఇచ్చి, సత్కరిస్తూ, తెలుగునాటకరంగానికి పచ్చనిపందిరి వేసిన అనంతవరం గ్రామస్తుల ప్రయత్నాన్ని కళ్ళారా చూడాలని ఎవరికి ఉండదు?
*
‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు ‘…అంటూ ఎన్ టి ఆర్ గారు పరిచయం అయ్యేప్పటికి, పాలమూరు లో రెండోతరగతి విద్యార్థిని. అప్పుడేగా ‘ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం’ అనీ , ‘కపటి ఆ ద్రోణుడి ‘ గురించి తెలిసిందీ అప్పుడే.
అంతలోనే
“ఆచార్య దేవా… ఏమంటివి ఏమంటివి!” అంటూ “దాన వీర శూర కర్ణ” సినిమా రానే వచ్చింది. బడిపిల్లలకు పాఠాల సంగతేమో గానీ, ప్రతి డైలాగ్ కంఠతా వచ్చేసింది.
ప్రతినాయకుడిని భిన్నకోణంలో చూడడం అప్పుడే పరిచయం అయ్యింది. భూకైలాస్ రావణాసురుడికి సరి ఎవ్వరు?
ఈ మూలాలు. త్రిపురనేని రామస్వామి గారి భావ దృక్పథంలో వేళ్ళూనుకొన్నాయని ఆ తరువాతే తెలిసింది.
‘అభిమానం ఆభరణం. మర్యాదే మూలధనం’
అవిటితనంలో అందాన్ని, నాయకులైనా, ప్రతి నాయకులైనా, వారు జీవించిన ప్రతి పాత్రలోనూ విలక్షణత్వాన్ని విప్పి చెప్పడం వారికే చెల్లు.
ఇంతకీ, ఎన్ టీ ఆర్ గారంటే వారి స్ఫురద్రూపమా, సుందర విగ్రహమా,ఆత్మ గౌరవమా, భాషాపటిమా, ఉచ్ఛారణా,ధారణా, వాగ్పటిమా, కట్టు నడకా, క్రమశిక్షణా, కళాప్రతిభా, నాయకత్వ ప్రతిభా, అధినేత దార్షనికతా…?
నిజమే, ఏ ఒక్కటని చెప్పగలము?
ఇవన్నీ మరిన్నీ కలబోసిన వారి విశిష్ట వ్యక్తిత్వమే కదా.
ఆనాటి వేదిక మీది వక్తలు చెప్పినట్లుగా, ఆస్తిహక్కు నిచ్చి ఆడబిడ్డగా వెన్ను విరిచి నిలబడేట్టు చేసినందుకా?
నా మటుకు నాకు, అది ఆస్తి హక్కు మాత్రమే కాదు, నా వంటి ఆడబిడ్డలకు అస్తిత్వాన్నిచింది.
వారి ప్రభావం అంతాఇంతా కాదు. తెలుగు భాషలోని గాఢత,లోతు ,అనేకత అర్థం అయ్యింది. భాషలోని లయను గతిని విన్యాసాలను పరిచయం చేసింది. తెలుగంటే ఇష్టాన్ని మమకారాన్ని కలిగించింది. భావ గాంభీర్యాన్ని, సామాజిక భావ చైతన్యాన్ని పరిచయం చేసింది.
తను నమ్మినవాటిని సాధించడలో వారి సంకల్పం, , ప్రయాస, ప్రయత్నం , దీక్ష ,కృషి, తపన.. తపస్సు…పట్టుదల , నిబద్దత..ఒక్కటేమిటి అనేక విధాలుగా, ఒక మూర్తివంతమైన వ్యక్తిగా వారొక స్పూర్తి. ప్రేరణ. ఉదాహరణ.
వారొక కళాకారుడిగా, వక్త, నేతగా ,వ్యక్తిగా , మా తరానికొక అజ్ఞాత ఉపాధ్యాయుడు.
మరి అటువంటి మహానుభావుడి పేరిట సత్కారం అందుకోవడం, మరెంత అపురూపం!
ధన్యోస్మి!
*
డా.జయమ్మ గారి యాభై ఆరేళ్ళ సుధీర్ఘ వైద్య వృత్తి లో వారి చేతుల్లో పురుడుపోసుకొన్న సంతోషాలెన్నో, నిలబడిన ఊపిరులెన్నో.అంతే ముఖ్యమైనది ఎడారిలో మంచినీటి చెలమ వంటి వారి సంస్థ ,ఒయాసిస్ ద్వారా ఎందరికి చేయూత నందించారో, డా జయమ్మ గారు…
సాహితీవేత్త గా చిరపరిచితురాలయిన నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు, అరుణ తేళ్ల గారు, తమ సామాజిక కార్యరంగంలో ఎందరు అభాగినులకు అనాథలకు ఆసరానిచ్చారో… అస్తిత్వాన్నిచ్చారో..
వారిరువురి చేతుల మీదుగా ఈ సత్కారాన్ని అందుకోవడం మరింత సంతోషం.
ఆచార్య కందిమళ్ళ సాంబశివరావు గారికి, ఎన్.టి.ఆర్ కళాపరిషత్, అనంతవరం వారికి
ధన్యవాదాలు.
*

వ్యాఖ్యానించండి