ఇసుక గుడేసి!

“అబ్బబ్బా! అదేంటక్కా తల నిండా, వళ్ళంతా ,బట్టలనిండా ఇసుకే ఇసుక! చెవుల్లో కనురెప్పల మీదా?”

“తడారిపోతే రాలిపోతుందిలేరా తమ్మీ!”

“మైపాడా? కోడూరా? ఇసుకపాళెమా?”

“ఇల్లు కదిలితేనా?”

“ఓహో!అర్థమయిందిలే! ఇంకా ఇసుక సమాధి నుంచి బయటపడలేదు ! కదక్కా?”

“భలే కనిపెట్టేవ్ రా తమ్ముడూ..మరి తమరి సంగతేమిటో!”

“తెలుగు నవల తూనికలు కొలతల విభాగం రిపోర్ట్ చదూతున్నా !దాన్ని బట్టే నవల చదివేదీ లేందీ!”

“ఎట్టెట్టా!”

“వినక్కా! “

“చదువు తమ్ముడూ, చదువు !”

*

“ఇంత పొడవా?అంత బరువా?

ఓపిగ్గా చదవాలి.ఓపిగ్గా అంటే ఓ …పి…గ్గా!

వర్ణనలు వర్ణనలు. సంభాషణలు సంభాషణలు.

ఇంతంత రాస్తే ఎవరూ చదవరు! చదవరంటే చదవరు!

సమాచారం సమాచారం. మాకు తెలుసు. మా గూగుల్ కీ తెలుసు.

కథలోకి చేయి పట్టుకొని చకచకా లాక్కెళ్ళాలి కానీ, ఇన్నన్ని పిట్టకథలు దాటుకు పోవాలా? దేనికి?

తిన్నగా చెప్పొచ్చు కదా? డొంక తిరుగుళ్ళేంటి? ఆ అనవసరమైనవన్నీ తీసి పారేస్తే, వందపేజీల్లో కథ వచ్చేస్తుందిగా?

మధ్యలో ఈ నెర్రులువారిన బుద్దుడి పాతబొమ్మ ఎందుకు?అద్దం ముందు తల బాదుకొనే పిచ్చుక కథ ఎందుకు?

కనీసం పేర్లన్నా పెట్టాలా? ఆ పేర్లకు జాతీరీతి ఉండాలా? పేరు తెలిసే సరికి ఆరొందల తొంభై తొమ్మిది పేజీలు తిరగెయ్యాలా?

చరిత్రెవరడిగారు?అలెగ్జాండర్ ఏ కనుమనుంచి వస్తే ఏంటి?

ఉత్తరాదిన మొదలెట్టి, లోకమంతా తిరగడమేంటి?

ఇంతకీ, రాసినావిడ అగ్రమా?ఉగ్రమా? కుడా ఎడమా?

ఆ రాసినావిడ ఆయనెవరు?నాయనెవరు?కొడుకేం చేస్తాడు?ముందావిడ ఇంటిపేరు చెప్పూ!

ఖచ్ఛితంగా అది ఆమె కథే. పోనీ, వాళ్ళమ్మది. కాదూ, అమ్మమ్మది. లేకపోతే అంత బాగా తెలిసినట్టు ఎట్లా రాస్తారు?

అబ్బే, అది ఫలానా వారి జీవితచరిత్ర. మక్కికి మక్కీ.. అచ్చుగుద్దేసినట్టు.అంతే !

లేదు.. లేదు.. ఆమె రాసే ప్రశ్నే లేదు.ఎవరో రచయిత రాసుండాలి. ఎవరో మగవారు రాసి ఆమె పేరు పెట్టారు. లేకుంటే పొరుగుదేశం, సరిహద్దులు, బోర్డరు, జైలు, ఇవన్నీ చూసినట్టే ఎలా రాయగలరు?

ఇంత డబ్బా! పెట్టుబడెవరిది?

ఇది అంతర్జాతీయ కుట్ర!

మనల్ని చూసి ఓర్వలేక పోతున్నారు.

పొరుగు దేశాల కుతంత్రం!

*

“హమ్మయ్య, ఆవిడ తెలుగులో రాయలేదు!బతికిపోయాం!

తమ్ముడూ ఓ పని చేయి!”

“ఏంటక్కా?”

“రామాయణమంతా ఎందుగ్గానీ, కట్టె కొట్టె తెచ్చె , కథ అయి పోయింది.పద మరి!”

“అక్కా! “

“అది నవల తమ్మీ, నవల! ట్వీట్ మెసేజ్ కాదు.

తలవంచి చదువు! నడుమొంచి చదువు!

వినయంగా చదువు! వినమ్రత తో చదువు!

మరోమార్గం లేదు! “

*

తమ్ముడూ,

నవల నవలే. పొడవు వెడల్పూ,ఎత్తూ మందం, బరువు తూకాల్లో కొలవగలమా?

తూనికలూ కొలతల రిపోర్ట్ ను, పక్కన పడేసేయ్ ముందు.

ఈ ఏడాది పదింటిలో ఆరు అకాడెమీ అవార్డులు అందుకొన్న సినిమా నవల ‘ డ్యూన్ ‘అయినా, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అందుకొన్న ‘టోంబ్ ఆఫ్ సాండ్’ అయినా.. ఇసుక కథలే.

మనం చేయాల్సినదల్లా గుప్పిళ్ళ నిండా ఇసుకను పోగేసుకోవడమే కదా?

పద!

ఆ రేణువుల్లోని తడిని వెతుక్కోవద్దూ ?

*

Dune, Frank Herbert ,1965

Tomb of Sand, Geetanjali Shree,2021

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s